Tuesday, November 1, 2016


    


కార్తిక  శివకేశవారాధన-02
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః.
యధాశివమయో విష్ణు రేవం విష్ణుమయశ్శివః,
యధాంతరం న పశ్యామి తధామే స్వస్తిరాయుషీ
 ప్రతి  పదార్థము
విష్ణురూపాయ                      = విష్ణు రూపముతో ఉన్న;
శివాయ                                  = శివునకు  నమస్కారము
శివరూపాయ                         = అలాగే శివ రూపముతో ఉన్న
విష్ణవే                                      = విష్ణువునకు  నమస్కారము
శివస్య                                     = శివునియొక్క
హృదయం                             = హృదయము
విష్ణుః                                      = విష్ణువే.
విష్ణోశ్చ                                   = అట్లే విష్ణువు యొక్క
హృదయం                  = హృదయము
శివః.                        = శివుడే.
విష్ణుః                       = విష్ణువు
యధా                       = ఏ విధముగా
శివమయః                  = శివమయుడో
ఏవం                        = ఈవిధముగానే
శివః                         = శివుడును
విష్ణుమయః                = విష్ణుమయుడే.
 యధా                      =ఎంత అధికముగా
న అంతరం                             =శివ కేశవులకు అభేదమును
పశ్యామి                    = చూచుదునో
 తధా                        =అంత అధికముగా
మే                                           = నాకు
స్వస్తిః                       =జీవితమున క్షేమము
ఆయుషీ                                 =దీర్ఘాయుష్షు కలుగుగాక !

తాత్పర్యము

విష్ణు రూపముతో ఉన్న శివునకు  నమస్కారము
అలాగే శివ రూపముతో ఉన్న విష్ణువునకు  నమస్కారము
శివునియొక్క  హృదయము విష్ణువే.
అట్లే విష్ణువు యొక్క  హృదయము  శివుడే.
విష్ణువు ఏ విధముగా శివమయుడో ఈవిధముగానే శివుడును విష్ణుమయుడే.
ఎంత అధికముగాశివ కేశవులకు అభేదమును  చూచుదునో
అంత అధికముగా నాకు జీవితమున క్షేమము  దీర్ఘాయుష్షు కలుగుగాక !

విశేషాలు

హృదయము
ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముదముడిపోయినన్ సమసిపోవుట లేదిది, దీపమందు మా
హృదయము సుమ్మి! నిల్పి చనియెన్ గత పుత్రిక యే యభాగ్యయో (గుర్రం జాషువ  ‘శ్మశాన వాటి)
చిక్కటి చీకటిలో ఒక  కొత్త సమాధి కలిసిపోయింది. . దాని మీద దీపం  ఒకటి. నూనె పూర్తిగా అయిపోయినా కూడా మిణుగురు పురుగులాగా వెలుగుతోంది.  ప్రమిదలో ఆముదము తగ్గిపోయినా  ఆ దీపము ఆరిపోవుటలేదు.
అది దీపము కాదు.
కన్నకుమార్తె   సమాధి దగ్గర ఒక తల్లి వదిలిపెట్టి వెళ్లిన హృదయము.
                                                ****
శివుని హృదయము విష్ణువు. విష్ణుదేవుని  హృదయము శివుడు.
ఇష్టమైన వారిని తలచుకొనే విషయములచేత తనను తాను కోల్పోవటం హృదయం.

          శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః. స్వస్తి.

No comments: