Sunday, November 13, 2016

అన్నమయ్య అక్షర దీపావళి- 24 వ సంపుటము 123వ కీర్తన (12-11-2016) రమణి జవ్వనము రామరాజ్య మిక అమరఁగ నిటు గొనియాడరె చెలులు ॥పల్లవి॥ కాంతకుచంబుల ఘనదుర్గంబులు కాంతి జక్కనలు గజబలిసె పొంతనె పిఱుఁదనుపులినపుఁదిప్పలు మంతుకెక్కె నదె మదనుఁడు బలిసె ॥రమ॥ ఈ క్రీడించునట్టి , అందమయిన స్త్రీ (రమణి) పదునాఱేండ్లకు మీఁది ప్రాయము, యౌవనము. (జవ్వనము)ఇకపై సుఖసంతోషములు - సుభిక్షము గల రాజ్యము. (రామరాజ్యము) ఒప్పునట్లుగా (అమరగ) నేను చెప్పినట్లుగా రామరాజ్యమని చెలులు పొగడండి. కోరదగిన ఈ స్రీ (కాంత) స్తనములలో గొప్పవైన కోటలుచక్కని కాంతి కలిగిన అందాలు (కాంతి జక్కనలు) మిక్కిలిగా బలిసాయి( గజబలిసె) దగ్గరనె (పొంతనె) వెనుకగా ( పిఱుఁదను) ఇసుకదిబ్బలు (పులినపుఁదిప్పలు)ప్రసిద్ధికి ఎక్కాయి. (మంతుకెక్కె) అదుగో మన్మథుడు బలిసాడు.

Friday, November 11, 2016

అన్నమయ్య అక్షర దీపావళి- 21 వ సంపుటము  26వ కీర్తన  (12-11-2016)

పల్లవి:     కన్నవే అన్నియును నీఘనతలెల్లా
                నిన్న మొన్న నివియెల్లా నేరుచుకవచ్చేవా

1:        చూపులోనే కానరాదా సూటియైననీవలపు
                ఆపొద్దుననుండి పెట్టే ఆనలేలా
                చేపట్టితి వల్లనాఁడే చేరి నీవారమైతిమి
                తీపులు పైఁబూసేవు దీనికీఁ గడమలా

తాత్పర్యము

 వేంకటేశ్వరా ! నీ ఘన కార్యాలు అన్ని చూసినవే నాయనా !

నిన్నో మొన్నో నేర్చుకొన్నవి కాదు. ఇవన్నీ ఎప్పటి నుంచో  తమరి దగ్గర  ఉన్నవి.

సూటిగా చూస్తే మీ వలపు తెలియకుండా ఉంటుందా!?

ఆ పొద్దున నుంచి సేవకులతో  మా అలమేలు మంగకు ఇవి ఇష్టాలు కనుక ఇది తీసుకురండి..అది తీసుకురండి అని   ప్రేమ కనిపెట్టే ఆజ్ఞలు ఎందుకు?

ఏనాడో  నువ్వు మమ్మలిని చేపట్టావు. . అప్పుడే నిన్ను చేరి నీవారము అయ్యాము.ఇప్పుడు కొత్తగా హడావుడి చేయవద్దు.


తీపులు (తీపులు= ఒళ్లు నొప్పులు పుట్టడం తెలంగాణ మాండలికం]  ఎందుకయ్యా మా మీద పూస్తావు. దీనికి అసలు కొరత ఉందా? (నిరంతరము మాకు ఒళ్లు నొప్పులు పుట్టేటట్లు చేస్తావని భావం) 
కార్తిక  శివకేశవారాధన-12 వ భాగము 12112016

(అప్పయ్యదీక్షితుల  హరిహరాభేదస్తుతి నుండి)

గోనయనమిలానయనం రవిశశినేత్రం రవీన్దువహ్న్యక్షమ్
స్మరతనయం గుహతనయం వన్దే వైకుణ్ఠ ముడుపతిచూడమ్

ఆవును పొందినప్పుడు హరి.

భూమిని పొందినప్పుడు శివుడు

సూర్య, చంద్ర నేత్రాలు కలిగినప్పుడు హరి

సూర్య, చంద్ర, అగ్ని నేత్రాలు కలిగినప్పుడు హరుడు.

మన్మథుడు కుమారునిగా ఉన్నప్పుడు హరి.

కుమారస్వామి కుమారునిగా కలిగినప్పుడు శివుడు.

అటువంటి  వైకుంఠ వాసుని  హరికి , చంద్రుని జుట్టు యందు కల శివునికి నమస్సులు.
Thursday, November 10, 2016


అన్నమయ్య అక్షర దీపావళి- 20 వ సంపుటము  158వ కీర్తన  (11-11-2016)

పల్లవి:     విన్నపమిదెపో వింటివో వినవో కాని
                కన్ను గిరిపే వేమికారణమో కాని

.1:        మాఁటలివి మంచివేపో మనసే తెలియఁగాని
                ఆఁటదానఁ బుణ్యపాప మది నీదేపో
                నాఁటిన సెలవులను నవ్వులు నవ్వే నిది యౌఁబో
                యేఁటికౌఁతా వెనకముం దెంచలేము గాని

తాత్పర్యము

పల్లవి:

ఓ వేంకటేశ్వరా !

          నువ్వు విన్నావో, వినలేదో నాకు తెలియదు కాని  ఇదే  నా విన్నపము.

          అదేంటయ్యా ! నేను విన్నవిస్తుంటే కళ్లు తిప్పుతూ సంజ్ఞచేస్తున్నావు

.1:        ఇదుగో నామాటలు మంచివే ..నీ మనస్సే నాకు తెలియటం లేదు.

                ఆడదానిని. ఏమి జరిగినా  పుణ్యము, పాపము నీదే . గుర్తు పెట్టుకో.

                ఆ పెదవుల మూలలలో నవ్వుతావేమిటయ్యా !

                ఏది ముందో, ఏది వెనకో ఎంచుకోలేక పోతున్నాము.

కార్తిక  శివకేశవారాధన-11 వ భాగము 11112016

(అప్పయ్యదీక్షితుల  హరిహరాభేదస్తుతి నుండి)

వస్తాం పిశఙ్గం వసనం దిశో వా
గరుత్మతా యాతు కకుద్మతా వా
నిద్రాతు వా నృత్యతు వాఽధిరఙ్గే
భేదో మే స్యాత్పరమస్య ధామ్నః

రాగిరంగుకలిగిన వస్త్రములు ధరించి(పిశంగం) పీతాంబరధారిగా , గరుడవాహనునిగా  కనబడితే దేవుడిని  హరి అనిపిలుస్తాం.

 దిగంబరునిగా , గొప్ప మూపురము గల ఎద్దుని ఎక్కి  నంది వాహనుడై కనపడితే  పరమాత్మ హరుడు.

పాలసముదంలో  శయనించి కనబడితే  హరి
నృత్యభంగిమలో కనబడితే నటరాజు.

ఒకే శక్తి రెండు రూపాలలో ఉంది.

ఆరెండింటి మధ్య తేడా నాకు కనబడుట లేదు.


రెండుగా కనబడే ఒకే  శక్తికి  నమస్కారము

Wednesday, November 9, 2016

అన్నమయ్య అక్షర దీపావళి- 19 వ సంపుటము  06వ కీర్తన  (10-11-2016)

          ఎటువంటివాఁడవయ్యా యిచ్చకము సేయఁగాను
                సటలంటా బొమ్మలను జంకింతురా

          వూరకే నీపాదములు వొత్తుచుఁ బిసుకఁ గాను
                గోరుదాఁకెనంటా యేల కొచ్చి చూచేవు
                చేరివూడిగాలు గడుఁ జేసితే మెచ్చుఁ గాక
                నేరుపు నేరము లెంచి నిందవేతురా
తాత్పర్యము
ఎటువంటి వాడివి వేంకటేశ్వరా ! నువ్వు ఇలాంటి వాడివనుకోలేదు.

ఏవో  రెండు   ప్రియవచనములు,  ముఖప్రీతి మాటలు   నీతో మాట్లాడాలి అనుకొన్నాను. రెండు వలపు మాటలు మాట్లాడానోలేదో(యిచ్చకము సేయఁగాను)

వినటానికి బాధలంటూ (సటలంటా) ఏవో బొమ్మలు చూపించి  బెదిరిస్తావురా !

ఊళ్ళో వాళ్ల కష్టాలు అన్నీ నీవే కదా.. తిరిగి తిరిగి నొప్పి పెట్టుంటాయని ఊరికే నీపాదాలు ఒత్తుతూ  పిసికానోలేదో..

నా గోరు గుచ్చుకొన్నదని ఎందుకురా గుచ్చి చూస్తావు? ! (కొచ్చి చూచేవు)

నీదగ్గరికి చేరి సేవలు అనేకం చేస్తే మెచ్చు కోవాలి కాని

నేర్పుగా నేరాలు ఎంచి నిందలు వేస్తావేమిట్రా!
కార్తిక  శివకేశవారాధన-10 వ భాగము 10112016

(అప్పయ్యదీక్షితుల  హరిహరాభేదస్తుతి నుండి)

విష్ణువు  సుదర్శన చక్రము చేతియందు కలిగినవాడు. శివుడు అభయ కరుడు.

విష్ణువు మణిమయ మైన ఆలంకారములు కలిగినవాడు.

శివుడు పాములతలలపై ఉన్న మణులు కలిగినవాడు.

విష్ణువు మోసిన ధనుస్సు కలిగినవాడు.

శివుడు మేరు పర్వతము ధనుస్సుగా కలిగినవాడు.

విష్ణువు గోవులను రక్షించినవాడు.

శివుడు  గొప్పదయిన ఆవును (ఎద్దును) వాహనముగా కలిగినవాడు.

ఆ విష్ణు శివ స్వరూపానికి  నమస్కరించుచున్నాను.

శ్లోకం
చక్రకరమభయకరం మణిమయభూషం ఫణామణీభూషమ్

విధృతధనుం గిరిధనుషం వన్దే గోవిన్దమనఘగోవాహమ్ 

Tuesday, November 8, 2016


కార్తిక  శివకేశవారాధన-09   09112016

(అప్పయ్యదీక్షితుల  హరిహరాభేదస్తుతి నుండి)

పీతపటమరుణజటం పరిమలదేహం పవిత్రభూత్యఙ్గమ్
జలజకరం డమరుకరం వన్దే యోగస్థమఖిలయోగీడ్యమ్

ప్రతిపదార్థము

పీతపటమ్=పసుపు వర్ణము కలిగిన వస్త్రము ధరించినవానిని
ఆరుణజటం = ఇంచుక ఎరుపు కలిగిన జడలు కట్టిన వెంట్రుకలు కలవానిని
పరిమలదేహం= సువాసనలు ఒలుకు శరీరము కలవానిని
 పవిత్రభూత్యఙ్గమ్= పవిత్రమైన విభూతి శరీరమందు కలవానిని
జలజకరం = పద్మము చేయి యందు కలవానిని
డమరుకరం=బుడుబుడుక్క అను శబ్ద మిచ్చు వాయిద్యము కలవానిని
యోగస్థ= ధ్యానమందు ఉండు వానిని, ధ్యానుల యందు ఉండు వానిని
ఆఖిలయోగీడ్యమ్ = సమస్త యోగులచే పొగడదగిన వానిని
వన్దే= నమస్కరించుచున్నాను.

తాత్పర్యము

పసుపు వర్ణము కలిగిన వస్త్రము ధరించినవానిని
ఇంచుక ఎరుపు కలిగిన జడలు కట్టిన వెంట్రుకలు కలవానిని
సువాసనలు ఒలుకు శరీరము కలవానిని
 పవిత్రమైన విభూతి శరీరమందు కలవానిని
పద్మము చేయి యందు కలవానిని
బుడుబుడుక్క అను శబ్ద మిచ్చు వాయిద్యము కలవానిని
ధ్యామందు ఉండు వానిని, ధ్యానుల యందు ఉండు వానిని
సమస్త యోగులచే పొగడదగిన వానిని  కేశవ శివులను నమస్కరించుచున్నాను.

Monday, November 7, 2016కార్తిక  శివకేశవారాధన-08   08112016
(అప్పయ్యదీక్షితుల  హరిహరాభేదస్తుతి నుండి)

పార్థసఖముపాత్తమఖం జలధరకాన్తిం జలన్ధరారాతిమ్
విధితనయం గుహతనయం వన్దే నీలేశమఖిలభూతేశమ్

ప్రతిపదార్థము

పార్థసఖమ్= అర్జునుని  మిత్రుని(పార్థుడు అంటే పృథ(కుంతి) యొక్క కుమారుడు) 
ఉపాత్తమఖం=పొందబడిన దక్ష  యజ్ఞము కలవానిని
 జలధరకాన్తిం= నీలమేఘమువంటి శరీర కాంతి కలవానిని
 జలన్ధరారాతిమ్= జలంధరుడను రాక్షసునికి శత్రువుని
విధితనయం= బ్రహ్మ తనయునిగా కలవానిని( సర్వము చేయువాడు విధి. – బ్ర హ్మ)
 గుహతనయం= కుమారస్వామి తనయునిగా కలవానిని( తన సైన్యమును రక్షించుకొనువాడు గుహుడు)
 నీలేశమ్= నీలాదేవికి ప్రభువుని,
అఖిలభూతేశమ్= సమస్త జీవులకు ప్రభువైన వానిని
వన్దే= నమస్కరించుచున్నాను.
తాత్పర్యము
అర్జునుని  మిత్రుని
పొందబడిన దక్ష  యజ్ఞము కలవానిని
నీలమేఘమువంటి శరీర కాంతి కలవానిని
జలంధరుడను రాక్షసునికి శత్రువుని
బ్రహ్మ తనయునిగా కలవానిని
కుమారస్వామి తనయునిగా కలవానిని
నీలాదేవికి ప్రభువుని,
సమస్త జీవులకు ప్రభువైన వానిని
విష్ణు శివ రూపానికి నమస్కరించుచున్నాను.
విశేషాలు
జలంధర వృత్తాంతము శివ మహాపురాణములో ఇట్లున్నది
మహారుద్రుడిట్లు పలికెను -

జలంధరా! నా చే మహాసముద్రమునందు పాదముతో నిర్మింపబడిన చక్రమును ఎత్తగలిగే బలము నీయందు ఉన్నచో యుద్ధము కొరకు నిలబడుము. లేనిచో, తొలగి పొమ్ము (28).
శంకరుని మాటను విని జలంధరుడు క్రోధముతో ఎర్రనైన నేత్రములనుండి వెలువడే చూపులతో దహించి వేయునాయన్నట్లు చూస్తూ శంకరునితో నిట్లనెను (29).
జలంధరుడిట్లు పలికెను
శంకరా! చక్రమును పైకెత్తి గణములతో సహా నిన్ను సంహరించి దేవతలతో సహా సర్వులను సంహరించి గరుడునివలె నా భాగమును నేను పొందెదను (31). ఇంద్రునితో సహా స్థావరజంగమాత్మకమగు ప్రపంచమును అంతనూ సంహరించే సామర్థ్యము నాకు గలదు. మహేశ్వరా! ముల్లోకములలో నా బాణములచే భేదింపబడని వాడెవ్వడు? (31) నేను బాలుడనై యుండగనే తపస్సుచే బ్రహ్మ భగవానుని నిర్జించితిని. బలశాలియగు బ్రహ్మ, దేవతాశ్రేష్ఠులతో మరియు మునులతో గూడి నా స్థానము నందున్నాడు (32). చరాచరప్రాణులతో గూడిన ముల్లోకములను పూర్ణముగా క్షణములో తగులబెట్టితిని. రుద్ర! నీవు గాని, నీ తపస్సుగాని లెక్కయేమి? భగవాన్బ్రహ్మను కూడ నేను జయించితిని (33). నాగములు గరుడుని గంధమును కూడ సహింపజాలవు. అటులనే, ఇంద్ర-అగ్ని-యమ-కుబేర-వాయు-వరుణాదులు నన్ను సహింపలేరు (34). స్వర్గమునందు గాని, భూలోకమునందు గాని నాకు అడ్డు కానరాలేదు. శంకరా! నేను పర్వతముల నన్నిటినీ దాటి, గణాధ్యక్షుల నందరినీ జయించితిని (35). నాకు కలిగిన దురదను పోగొట్టుకొనుటకై నేను నా భుజదండముతో పర్వతశ్రేష్ఠమగు మందరమును, శోభాయుతమగు నీలపర్వతమును, మిక్కిలి అందమగు మేరు పర్వతమును ఢీకొట్టితిని (36).

          నేను ఆటలాడుతూ హిమవత్పర్వతమునందు బాహువులతో గంగను ఆపివేసితిని. నాకు శత్రువులగు దేవతలపై నా సేవకులు కూడా విజయమును పొందిరి (37). నేను బడబాగ్నిని చేతితో పట్టుకొని దాని నోటిని మూసి వేయగా, ఒక క్షణకాలములో అపుడు సర్వము ఏకసముద్రము ఆయెను (38). ఐరావతము మొదలగు ఏనుగులను సముద్రములలోనికి విసిరివేసితిని. ఇంద్రభగవానుని రథముతో సహా వందయోజనముల వరకు విసిరి వేసితిని (39). ఊర్వశి మొదలగు స్త్రీలను చెరసాలలో పెట్టితిని. గరుడుని విష్ణువుతో సహా నాగపాశముతో బంధించితిని (40). రుద్రా! నేను ముల్లోకములను జయించిన జలంధరుడను, సముద్రపుత్రుడగు మహారాక్షసుడను, మహాబలుడను. నీవు నన్ను ఎరుంగవు (41).
          సముద్రనందనుడగు జలంధరుడు అపుడు మహాదేవునితో నిట్లు పలికి అచటనుండి కదలలేదు. యుద్ధములో సంహరింపబడిన రాక్షసులు ఆతనికి గుర్తు రాలేదు (42). అహంకారి, వినయము నెరుంగని వాడు అగునాతడు భుజముల రెండింటినీ చేతులతో చరిచి పరుషములగు వచనములతో మహాదేవుని ఉద్దేశించి తిరస్కారమును చేసినాడు (43). విధముగా రాక్షసుడు పలికిన అమంగళవచనములను విని మహాదేవుడు నవ్వి, తీవ్రమగు కోపమును పొందెను (44). తన కాలి బొటనవ్రేలితో నిర్మించిన సుదర్శనచక్రమును రుద్రుడు చేతిలోనికి తీసుకొని ఆతనిని సంహరించుటకు సరిసద్ధుడాయెను (45). కోటిసూర్యుల కాంతి గలది, ప్రతయకాలాగ్నిని బోలియున్నది అగు సుదర్శన చక్రమును హరభగవానుడు ప్రయోగించెను (46). చక్రము అంతరిక్షములో జ్వాలలను విరజిమ్ముచూ విశాలమగు నేత్రములు గల జలంధరుని సమీపించి వాని శిరమును వేగముగా నరికివేసెను (47). సముద్రపుత్రుడగు జలంధరుని మొండెము, తల రథమునుండి శబ్దము చేయుచూ భూమిపై బడినవి. పెద్ద హాహాకారము చెలరేగెను (48).
          వజ్రముచే కొట్టబడి రెండు ముక్కలై సముద్రములో పడిన గొప్ప అంజన పర్వతమువలె ఆతని దేహము రెండు ముక్కలై నేలబడెను (49). ఆతని భయంకరమగు రక్తముచే జగత్తు అంతయూ నిండెను. మహర్షీ! దానివలన భూమి అంతయూ వికృతమాయెను (50). రుద్రుని ఆజ్ఞచే రక్తము మరియు మాంసము సర్వము మహారౌరవనరకమునకు చేర్చబడెను. అది అచట రక్తకుండము ఆయెను (51). బృందాదేవియొక్క దేహమునుండి పుట్టిన తేజస్సు గౌరీదేవిలో విలీనమైన విధముగా, ఆతని దేహమునుండి పుట్టిన తేజస్సు కూడ రుద్రునిలో విలీనమయ్యెను (52). దేవతలు, గంధర్వులు, నాగులు జలంధరుడు సంహరింపబడుటను గాంచి మిక్కిలి ప్రసన్నులై " దేవా ! సాధు ' అని పలికిరి (53). దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరు ప్రసన్నురాలైరి. వారు పుష్పవృష్టిని కురిపిస్తూ శివుని కీర్తిని బిగ్గరగా గానము చేసిరి (54). దేవతాస్త్రీలు ప్రేమను పట్టజాలక మహానందముతో నాట్యమును చేస్తూ కిన్నరులతో కూడి మధురస్వనముతో మధురగీతములను చక్కగా పాడిరి (55). మునీ! బృందాదేవికి భర్తయగు జలంధరుడు సంహరింపబడగానే, దిక్కులన్నియు ప్రసన్నములాయెను. త్రివిధములగు వాయువులు కూడా పరమపవిత్రతతో సుఖమగు స్పర్శను కలిగిస్తూ వీచినవి (56). చంద్రుడు చల్లని కిరణములను వెదజల్లెను. సూర్యుడు గొప్ప తేజస్సుతో ప్రకాశించెను. అగ్నులు శాంతముగా మండజొచ్చినవి. ఆకాశము ధూళిలేనిది ఆయెను (57). మునీ! విధముగా సముద్రపుత్రుడగు జలంధరుడు అనంతస్వరూపుడగు శివునిచే సంహరింపబడగా ముల్లోకములు మిక్కిలి అధికమగు స్వస్థతను పొందినవి (58).(ఇది శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహతయందు యుద్ధఖండములో జలంధర వర్ణనమనేఇరువది నాల్గవ అధ్యాయము )