Monday, November 7, 2016



కార్తిక  శివకేశవారాధన-08   08112016
(అప్పయ్యదీక్షితుల  హరిహరాభేదస్తుతి నుండి)

పార్థసఖముపాత్తమఖం జలధరకాన్తిం జలన్ధరారాతిమ్
విధితనయం గుహతనయం వన్దే నీలేశమఖిలభూతేశమ్

ప్రతిపదార్థము

పార్థసఖమ్= అర్జునుని  మిత్రుని(పార్థుడు అంటే పృథ(కుంతి) యొక్క కుమారుడు) 
ఉపాత్తమఖం=పొందబడిన దక్ష  యజ్ఞము కలవానిని
 జలధరకాన్తిం= నీలమేఘమువంటి శరీర కాంతి కలవానిని
 జలన్ధరారాతిమ్= జలంధరుడను రాక్షసునికి శత్రువుని
విధితనయం= బ్రహ్మ తనయునిగా కలవానిని( సర్వము చేయువాడు విధి. – బ్ర హ్మ)
 గుహతనయం= కుమారస్వామి తనయునిగా కలవానిని( తన సైన్యమును రక్షించుకొనువాడు గుహుడు)
 నీలేశమ్= నీలాదేవికి ప్రభువుని,
అఖిలభూతేశమ్= సమస్త జీవులకు ప్రభువైన వానిని
వన్దే= నమస్కరించుచున్నాను.
తాత్పర్యము
అర్జునుని  మిత్రుని
పొందబడిన దక్ష  యజ్ఞము కలవానిని
నీలమేఘమువంటి శరీర కాంతి కలవానిని
జలంధరుడను రాక్షసునికి శత్రువుని
బ్రహ్మ తనయునిగా కలవానిని
కుమారస్వామి తనయునిగా కలవానిని
నీలాదేవికి ప్రభువుని,
సమస్త జీవులకు ప్రభువైన వానిని
విష్ణు శివ రూపానికి నమస్కరించుచున్నాను.
విశేషాలు
జలంధర వృత్తాంతము శివ మహాపురాణములో ఇట్లున్నది
మహారుద్రుడిట్లు పలికెను -

జలంధరా! నా చే మహాసముద్రమునందు పాదముతో నిర్మింపబడిన చక్రమును ఎత్తగలిగే బలము నీయందు ఉన్నచో యుద్ధము కొరకు నిలబడుము. లేనిచో, తొలగి పొమ్ము (28).
శంకరుని మాటను విని జలంధరుడు క్రోధముతో ఎర్రనైన నేత్రములనుండి వెలువడే చూపులతో దహించి వేయునాయన్నట్లు చూస్తూ శంకరునితో నిట్లనెను (29).
జలంధరుడిట్లు పలికెను
శంకరా! చక్రమును పైకెత్తి గణములతో సహా నిన్ను సంహరించి దేవతలతో సహా సర్వులను సంహరించి గరుడునివలె నా భాగమును నేను పొందెదను (31). ఇంద్రునితో సహా స్థావరజంగమాత్మకమగు ప్రపంచమును అంతనూ సంహరించే సామర్థ్యము నాకు గలదు. మహేశ్వరా! ముల్లోకములలో నా బాణములచే భేదింపబడని వాడెవ్వడు? (31) నేను బాలుడనై యుండగనే తపస్సుచే బ్రహ్మ భగవానుని నిర్జించితిని. బలశాలియగు బ్రహ్మ, దేవతాశ్రేష్ఠులతో మరియు మునులతో గూడి నా స్థానము నందున్నాడు (32). చరాచరప్రాణులతో గూడిన ముల్లోకములను పూర్ణముగా క్షణములో తగులబెట్టితిని. రుద్ర! నీవు గాని, నీ తపస్సుగాని లెక్కయేమి? భగవాన్బ్రహ్మను కూడ నేను జయించితిని (33). నాగములు గరుడుని గంధమును కూడ సహింపజాలవు. అటులనే, ఇంద్ర-అగ్ని-యమ-కుబేర-వాయు-వరుణాదులు నన్ను సహింపలేరు (34). స్వర్గమునందు గాని, భూలోకమునందు గాని నాకు అడ్డు కానరాలేదు. శంకరా! నేను పర్వతముల నన్నిటినీ దాటి, గణాధ్యక్షుల నందరినీ జయించితిని (35). నాకు కలిగిన దురదను పోగొట్టుకొనుటకై నేను నా భుజదండముతో పర్వతశ్రేష్ఠమగు మందరమును, శోభాయుతమగు నీలపర్వతమును, మిక్కిలి అందమగు మేరు పర్వతమును ఢీకొట్టితిని (36).

          నేను ఆటలాడుతూ హిమవత్పర్వతమునందు బాహువులతో గంగను ఆపివేసితిని. నాకు శత్రువులగు దేవతలపై నా సేవకులు కూడా విజయమును పొందిరి (37). నేను బడబాగ్నిని చేతితో పట్టుకొని దాని నోటిని మూసి వేయగా, ఒక క్షణకాలములో అపుడు సర్వము ఏకసముద్రము ఆయెను (38). ఐరావతము మొదలగు ఏనుగులను సముద్రములలోనికి విసిరివేసితిని. ఇంద్రభగవానుని రథముతో సహా వందయోజనముల వరకు విసిరి వేసితిని (39). ఊర్వశి మొదలగు స్త్రీలను చెరసాలలో పెట్టితిని. గరుడుని విష్ణువుతో సహా నాగపాశముతో బంధించితిని (40). రుద్రా! నేను ముల్లోకములను జయించిన జలంధరుడను, సముద్రపుత్రుడగు మహారాక్షసుడను, మహాబలుడను. నీవు నన్ను ఎరుంగవు (41).
          సముద్రనందనుడగు జలంధరుడు అపుడు మహాదేవునితో నిట్లు పలికి అచటనుండి కదలలేదు. యుద్ధములో సంహరింపబడిన రాక్షసులు ఆతనికి గుర్తు రాలేదు (42). అహంకారి, వినయము నెరుంగని వాడు అగునాతడు భుజముల రెండింటినీ చేతులతో చరిచి పరుషములగు వచనములతో మహాదేవుని ఉద్దేశించి తిరస్కారమును చేసినాడు (43). విధముగా రాక్షసుడు పలికిన అమంగళవచనములను విని మహాదేవుడు నవ్వి, తీవ్రమగు కోపమును పొందెను (44). తన కాలి బొటనవ్రేలితో నిర్మించిన సుదర్శనచక్రమును రుద్రుడు చేతిలోనికి తీసుకొని ఆతనిని సంహరించుటకు సరిసద్ధుడాయెను (45). కోటిసూర్యుల కాంతి గలది, ప్రతయకాలాగ్నిని బోలియున్నది అగు సుదర్శన చక్రమును హరభగవానుడు ప్రయోగించెను (46). చక్రము అంతరిక్షములో జ్వాలలను విరజిమ్ముచూ విశాలమగు నేత్రములు గల జలంధరుని సమీపించి వాని శిరమును వేగముగా నరికివేసెను (47). సముద్రపుత్రుడగు జలంధరుని మొండెము, తల రథమునుండి శబ్దము చేయుచూ భూమిపై బడినవి. పెద్ద హాహాకారము చెలరేగెను (48).
          వజ్రముచే కొట్టబడి రెండు ముక్కలై సముద్రములో పడిన గొప్ప అంజన పర్వతమువలె ఆతని దేహము రెండు ముక్కలై నేలబడెను (49). ఆతని భయంకరమగు రక్తముచే జగత్తు అంతయూ నిండెను. మహర్షీ! దానివలన భూమి అంతయూ వికృతమాయెను (50). రుద్రుని ఆజ్ఞచే రక్తము మరియు మాంసము సర్వము మహారౌరవనరకమునకు చేర్చబడెను. అది అచట రక్తకుండము ఆయెను (51). బృందాదేవియొక్క దేహమునుండి పుట్టిన తేజస్సు గౌరీదేవిలో విలీనమైన విధముగా, ఆతని దేహమునుండి పుట్టిన తేజస్సు కూడ రుద్రునిలో విలీనమయ్యెను (52). దేవతలు, గంధర్వులు, నాగులు జలంధరుడు సంహరింపబడుటను గాంచి మిక్కిలి ప్రసన్నులై " దేవా ! సాధు ' అని పలికిరి (53). దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరు ప్రసన్నురాలైరి. వారు పుష్పవృష్టిని కురిపిస్తూ శివుని కీర్తిని బిగ్గరగా గానము చేసిరి (54). దేవతాస్త్రీలు ప్రేమను పట్టజాలక మహానందముతో నాట్యమును చేస్తూ కిన్నరులతో కూడి మధురస్వనముతో మధురగీతములను చక్కగా పాడిరి (55). మునీ! బృందాదేవికి భర్తయగు జలంధరుడు సంహరింపబడగానే, దిక్కులన్నియు ప్రసన్నములాయెను. త్రివిధములగు వాయువులు కూడా పరమపవిత్రతతో సుఖమగు స్పర్శను కలిగిస్తూ వీచినవి (56). చంద్రుడు చల్లని కిరణములను వెదజల్లెను. సూర్యుడు గొప్ప తేజస్సుతో ప్రకాశించెను. అగ్నులు శాంతముగా మండజొచ్చినవి. ఆకాశము ధూళిలేనిది ఆయెను (57). మునీ! విధముగా సముద్రపుత్రుడగు జలంధరుడు అనంతస్వరూపుడగు శివునిచే సంహరింపబడగా ముల్లోకములు మిక్కిలి అధికమగు స్వస్థతను పొందినవి (58).(ఇది శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహతయందు యుద్ధఖండములో జలంధర వర్ణనమనేఇరువది నాల్గవ అధ్యాయము )

No comments: