Monday, October 31, 2016

                                              శివకేశవులు ఇద్దరూ ఒకటే .........ఇద్దరికి ఒకటే శ్లోకం
శివునికి ప్రయోగించిన విశేషణాల్లోని మొదటి అక్షరాలు తీసివేస్తే విష్ణు దేవుని విశేషణాలు వచ్చేటట్లు ఒక కవి రచించిన
అద్భుతమయిన శివకేశవ శ్లోకాన్ని స్మరించుకొందాం.
పన్నగధారి కరాగ్ర: గంగోమా లక్షితోజ్గదాగ్ర భుజ: శశి
ఖండ శేఖర ఉమా పరిగ్రహో ముహురనాది రవతు త్వామ్.
శివ పరంగా అర్ధం
పన్నగధారి                                                             =    పామును ధరించిన వాడు (పన్నం పతితం యథాతథా గచ్చతీతి పతంగః-                                                                 పడినట్టుగా పోవునది కనుక పాముకు పన్నగమని పేరు)
గంగో మా లక్ష్మిత: = గంగా + ఉమా లక్షిత:         =    గంగా పార్వతులు కోరుకొన్న వాడు
అంగదాగ్ర భుజ: =అంగద+అగ్రభుజః                  =    భుజాల మీద బాహుపురులు - కేయూరాలుధరించిన వాడు
శశిఖండ శేఖర:                                                      =    చంద్ర రేఖను అలంకారంగా ధరించిన వాడు.
ఉమా పరిగ్రహ:                                                      =     పార్వతిని భార్యగా స్వీకరించిన వాడు
 అనాది:                                                                   =     పుట్టుక లేని వాడు  అయిన శివుడు
ముహు:, త్వామ్ అవతు                                     =      ఎప్పుడూ    మిమ్ము కాపాడు గాక !   

భావం:
చేతిలో పామును ధరించిన వాడూ, గంగా, పార్వతులకు ఇష్టమైనవాడు , భుజాల మీద  బాహుపురులు ధరించిన వాడూ, చంద్ర రేఖ తల మీద అలంకారంగా కల వాడూ , పార్వతీ దేవి తన అర్ధాంగిగాకల వాడూ, పుట్టుకేలేనివాడు  అయిన శివుడూ  ఎప్పుడు  మిమ్ములను కాపాడు గాక !.
శ్లోకంలో శివుడికి  చెప్పిన విశేషణ పదాలలో మొదటి  అక్షరాలను తొలిగిస్తే  విష్ణు వర్ణన
కరాగ్ర: నగధారి                       =       గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడు(పన్నగధారిలో “పత్ తీసివేయాలి)
 గో                           =      ఆవుల చేత, (గంగో మా లక్షిత:లో “గం “తీసివేయాలి)
మా                                         =       లక్ష్మీదేవి చేత
లక్షిత:                                     =       కోర బడిన వాడు ( అంటే, గోవులకు , లక్ష్మీ దేవికి ప్రభువు     అయిన వాడు )
 గద: అగ్ర భుజ:                     =       భుజం మీద కౌమోదకి అనే గదను ధరించిన వాడు (అంగదాగ్ర భుజఃలో “అం తీసివేయాలి)
శిఖండ శేఖర:                         =        శిరసున నెమలి పింఛం ధరించిన వాడు (శశిఖండ శేఖరః లో “శ తీసివేయాలి)
మా                                         =      లక్ష్మీదేవిని (ఉమా పరిగ్రహః లో “ఉ తీసివేయాలి)
పరిగ్రహ:                                 =      భార్యగా స్వీకరించిన వాడు
అనాది:                                   =      ( శివ విశేషణాల్లోని మొదటి అక్షరాలు తీసివేయగా మిగిలిన ) విష్ణువు ,       పుట్టుక లేని వాడు అయిన                                                        విష్ణువు
ముహు: , త్వామ్, అవతు =      సదా మిమ్ము కాపాడు గాక !
 భావం:
గోవర్ధన పర్వతాన్ని ధరించిన వాడు,  అవులకు, లక్ష్మీ దేవికీ ప్రభువు, భుజాన గద, తల మీద నెమలి పింఛాన్నీధరించిన వాడు, లక్ష్మి దేవికి  భర్త మరియూ , పుట్టుక లేని వాడూ అయిన  మహా విష్ణువు మిమ్ములనుఎప్పుడూ రక్షించు గాక !

                             ఈ కవి ఎవరో తెలియదు. నమస్సులు.

1 comment:

కంది శంకరయ్య said...

అద్భుతమైన శ్లోకాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు.