Wednesday, October 26, 2016


అన్నమయ్య అక్షర దీపావళి- 01 -05  భాగాలు

అరుదైన క్రిమికీటకాదులందుఁ బుట్టి
పరిభవములనెల్లఁ బడితిఁ గాని
యిరవైనచింత నాఁడింతలేదు యీ-
నరజన్మముకంటె నాఁడే మేలు (01-003)


తాత్పర్యము

జన్మల పరంపరలో భాగముగా అనేక క్రిమి కీటకాదుల జన్మలెత్తి


ఎన్నో అవమానాలు పొందాను కాని


మానవ జన్మలో స్థిరంగా ఉండే చింత పాతజన్మలలో ఇంత లేదు.


మానవ జన్మకంటె ఆనాటి క్రిమి కీటకాదుల జన్మలే మేలు.
అన్నమయ్య అక్షర దీపావళి- 02 (24-10-2016)
పంచేంద్రియములలోని పాప మేమి గలిగినా
అంచెలఁ గామునిఁబోయి అడుగవయ్యా
ముంచిన నాకర్మములో మోసమేమి గలిగినా
మంచితనానఁ జేయించే మాయ నడుగవయ్యా (02-028)
తాత్పర్యము
వేంకటేశా ! నా పంచేంద్రియములచేతలలో వరుసగా, గుంపుగా(అంచెల) నీకు పాపము అని పిస్తే ,నువ్వు వెళ్లి మన్మథుని నిలదీయ్ ! .నా తప్పు ఏమి లేదు. అంతా వాడే చేయిస్తున్నాడు.
కర్మము నన్ను ముంచివేసినది. ఇందులొ మోసమేమన్నా అనిపిస్తేమంచితనముతో నా చేత ఇదంతా చేయిస్తున్న మాయని అడుగు. నాకు మి సంబంధం లేదు.
విశేషాలు
1. పంచేంద్రియములు =
ఐదు కర్మేంద్రియాలు : వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థలు. /ఐదు జ్ఞానేంద్రియాలు : త్వక్కు (చర్మము), చక్షువు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణేంద్రియాలు.
2. కర్మము
కర్మములకు హేతువులు అహంకార మమకారములు. అహంకారము అనఁగా దేహమందు ఆత్మ అను బుద్ధి. మమకారము అనగా తనవిగాని వానియందు తనవి అను బుద్ధి. ఈఅహంకార మమకారములు "అవిద్య" అని చెప్పఁబడుచున్నవి.
ఈశ్వరుఁడు జీవునికి కర్మానురూపముగా శరీరములను ఫలములను ఇస్తున్నాడు. . అనఁగా జీవుఁడు పూర్వజన్మలయందు చేసిన పుణ్యకర్మములను అనుసరించి వివేకముగల మనుష్యాదిజన్మములను పాపకర్మములను అనుసరించి వివేకముచాలని పశువు మొదలైన శరీరములను పొందుచున్నాడు.
కర్మములవలన దేహము కలుగుచు ఉన్నది; దేహముచేత కర్మములు చేయఁబడుచు ఉన్నవి; ఈరెంటిలో ఏదిముందో ఎఱగబడదు. చెట్టువలన విత్తు కలుగుచు ఉన్నది; విత్తువలన చెట్టు కలుగుచు ఉన్నది. ఈరెంటిలో ఏదిముందో తెలియబడదు. అన్నమయ్య దీనినే ప్రశ్నిస్తున్నాడు.
3. మాయ.
తాడును చూసి పాము అని భ్రమపడటం మాయలో పడటం. ‘‘యా నవిద్యతే వస్తుతః సా మాయా’’. వాస్తవంగా ఏది లేదో అది ఉన్నట్లు తోచడం మాయ.
మాఅంటే లేదు, కాదు అనీ, ‘యాఅంటేఏది’ . కనుక ఏది లేదో, ఏది కాదో అది మాయ అని ఒక వివరణ ఉంది.
శంకరాచార్యుల వారుమాయను అచింత్యం అన్నారు. అసత్తూ కాదు, సత్తూ కాదు అని భావం.


అన్నమయ్య అక్షర దీపావళి- 03 (25-10-2016)
          తగు చుట్టరికాలలో ధనమే చుట్టరికము
                జగతిఁ గట్టని కట్టు సంసారము
                వగలైన గుణాలలో వైరమే నిజగుణము
                జిగిఁ బ్రాణులెట్లు గెలిచేరు నీమాయ (03-551)
తాత్పర్యము
          ఓ వేంకటేశా ! చుట్టాలు పక్కాలు అని పైకి చెప్పుకోవటం వరకే. ఈ ప్రపంచంలో ప్రతివారు  అభిమానించే  నిజమైన    చుట్టము   ధనమొక్కటే. చుట్టరికము (స్నేహము) చేసేది ధనముతోనే.
          ఈ ప్రపంచంలో  సంసారంలో   తాడు కనబడదు కాని, కట్టు కట్టబడి ఉంటుంది. ఆ బంధము తప్పించుకోలేము
          మాయలతో ,నటనలతో  ఉండే  మా జీవుల   స్వభావాలలో, ఒకరితో శత్రుత్వము పెట్టుకోవాలనే స్వభావమే నిజమైన
          స్వభావము ( 1. కామము, 2. క్రోధము, 3. లోభము, 4. మోహము, 5. మదము, 6. మాత్సర్యము, 7. దంభము, 8. దర్పము,           9. ఈర్ష్య, 10. అసూయ అనునవి దశ గుణములు)
          కళ్లు జిగేలుమనే మురిపాల కాంతులలో – ఈ జీవులు నీ మాయను ఎల గెలుస్తారయ్యా !

          అన్నమయ్య భావ దీపావళి- 04 (26-10-2016)
వచ్చిన త్రోవెఱఁగము వడిఁ బూర్వకాలమందు
చొచ్చెటి త్రోవెఱఁగము సోదించి విూఁద
కుచ్చిన కర్మములతో గుదియై వేలుకాడేము
హెచ్చి మా బ్రదుకుఁదోవ యీశ్వరుఁడే యెరుఁగు (04-034)
తాత్పర్యము
పూర్వ జన్మలు ఏమి ఎత్తామో ,   మెలిపెట్టిన చిక్కుల దారపుముడి( వడిఏమిటో మాకు తెలియదు. పూర్వజన్మల దారి ఏమిటో  మాకు                 తెలియదు.
ఎంతగా ప్రయత్నించినా  - ప్రవేశించే- రాబోయే జన్మల దారి   మాకు తెలియదు.
కానీ- ఎప్పటికప్పుడు జతచేస్తున్న(కుచ్చిన)   కర్మలను  సూదికి గుచ్చుకొంటూ - (గుదియై) – ఆ జన్మముల సూదికి వేలాడుతున్నాము( వేలుకాడేము)
మా బతుకుల దారి  ఏమిటో - అధికమయిన దయ కలిగిన (హెచ్చి )  వేంకటేశ్వరునికే తెలుసు
         
          అన్నమయ్య అక్షర దీపావళి- 05 (27-10-2016)
          బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా
                బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా
                ఉంగరాలేఁటికినే వొడికిపువేళ్ళ
                వెంగలిమణులు నీ వేలిగోరఁబోలునా(05-002)
తాత్పర్యము
                ఓ వేంకటేశ్వరుని ఇల్లాలా! అలమేలు మంగా!
          నీ శరీరమునిండా బంగారము పెడుతున్నావెందుకు?
          నీ శరీరపు కాంతికి బంగారము  సమానమవుతుందా?
          నీ అందమయిన చేతివేళ్ళకి(వొడికిపువేళ్ళ) ఉంగరాలు  ఎందుకు  పెడుతున్నావే?
          వ్యర్థమయిన (వెంగలి) మణులతో ఉండే  ఆ ఉంగరాలు నీ చేతి వేలి గోటి కాంతికి సరిపోతాయా?
         
         


         

No comments: