Thursday, October 6, 2016


ఏడవరోజు (07-10-2016 )కనక దుర్గమ్మ అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి
                        శ్రీ సూక్తమ్    తాత్పర్య విశేషాలు
                                      01 
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
తాత్పర్యము
ఓ అగ్నిదేవా! బంగారపు రంగుకలిగిన  పాపాలను హరించేది,    బంగారము  మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడినది,
చంద్రునిలా చల్లగా ఉండేది,  బంగారముతో కూడినది అయిన  లక్ష్మీదేవిని ( ఎవరి చేత సర్వము చూడబడునో ఆమె లక్ష్మి)
నా కొరకు ఆవాహన చేయుము .
విశేషాలు
లక్ష్మి
ఈమె విష్ణువు యొక్క భార్య. పాలసముద్రమున అమృత మథన సమయములో పుట్టిందని కొన్ని చోట్ల ఉంటే  ధాతృ విధాతలతో  కలిసి  జ్యేష్ఠాదేవికి చెల్లెలు అయి బ్రహ్మకు పుట్టిందని కొన్ని చోట్ల ఉన్నది..
భృగు మహర్షి కూతురు అని అందుకే  ఈమెకు భార్గవి అని పేరు  వచ్చిందంటారు. అమెకు ఇన్ని జన్మాలు రావటానికి  కారణము  కల్పభేదములు అంటారు. వేయి మహాయుగాలు కలిస్తే  ఒక కల్పం. మహా యుగం అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు అనే నాలుగు యుగాల కాలం.  ఇప్పుడు శ్వేత వరాహ కల్పం.
ఆవాహనము
అంటే ఆహ్వానము, పిలుపు;
దేవతలను విగ్రహాదులయందు సన్నిధి చేయండని కోరుట.మంత్రోచ్చారణచే దైవశక్తిని విగ్రహములయందు నిలుపుట ఆవాహనము
హరిణి
హరిణి అంటే  ఆడుజింక,  ఒక యప్సరస్త్రీ, బంగారుప్రతిమ, వృత్తవిశేషము, అడవిమొల్ల, ఆకుపచ్చవర్ణము గలది అను అర్థములున్నప్పటికీ ఇక్కడ హరి పత్ని, పాపములను హరించునది అను అర్థములు  స్వీకరించుట సముచితము.
హిరణ్యము
హయ్యతి గచ్ఛతీతి హిరణ్యం. పోయే స్వభావము కలిగినది హిరణ్యము.
                                      02
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్
తాత్పర్యము
ఓ అగ్ని దేవుడా !
          ఎవరి దయ వల్ల   బంగారము , పొందదగినవయిన  ఆవులు, గుర్రాలు బంధువులను  (సేవకులను), నేను పొందుతానో (పొందానో) ఆ లక్ష్మీదేవిని ( ఎవరి చేత సర్వము చూడబడునో ఆమె లక్ష్మి) విష్ణుదేవుని వీడకుండా అనుసరించే లక్ష్మీదేవిని, నా ఇంట్లో కూడా వీడకుండా చూడుము. నా కొరకు ఆహ్వానించుము.( నా ఇల్లు సిరిసంపదలతో సుభిక్షంగా ఉండేటట్లు చేయుమని భావము)              
విశేషాలు
          ఈ మంత్రములో వాడబడిన “వింద “అనే పదాన్ని ఎక్కువగా ముహుర్తానికి ముందు వాడుతుంటారు.నష్టం ధనం విందతి ( లభతే) అస్మిన్ – ఇతి విందః. ఏదైనా వస్తువు , డబ్బు, మనిషి   ఈ ముహూర్తంలో తప్పిపోతే తిరిగొస్తారట..         వాల్మీకి రామాయణం అరణ్యకాండలో రామలక్ష్మణులతో జటాయువు ఈ వింద ముహూర్తం గురించి చెప్పాడు. ( 68 వసర్గ-13 )శ్లోకం).
          పగటి పూట ఉండే 15  ముహూర్తాలలో 11  వ విజయ ముహూర్తమునకు విందమని పేరు.
          విజయాలను ప్రసాదించే లక్ష్మీదేవిని ఆ (విందా+ఇయం) విందా పేరుతో ఈ మంత్రంలో పిలవటం గమనార్హం. 

                                                03

ఈ మంత్రంలో లక్ష్మిని   యోగ సాధకుడు ఆహ్వానిస్తున్నాడు.

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోదినీమ్
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్


తాత్పర్యము

          లక్ష్మీదేవి  ప్రారంభంలో గుర్రం వలె,  మధ్యలో రథము లా, చివర్లో ఏనుగులా  శబ్దము చేస్తుంది. అటువంటి  లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాను.  లక్ష్మీదేవి  నా విషయములో  ప్రీతి కల్గి  నన్ను అనుగ్రహించుగాక !
విశేషము
          ఈ మంత్రం యోగ శాస్త్రం నేపథ్యంలో నే అర్థమవుతుంది
          అమ్మ ఏమిటి.... ఆ ఆరుపులేమిటి ... అని మనకు అనిపించటం సహజం.
          యోగసాధనలో దేవి ......
          సుషుమ్నా నాడి మూలంలో చేసే శబ్దం అశ్వ ఘోష.
          సుషుమ్నా నాడి మధ్యంలో చేసే శబ్దం రథ ఘోష.
          యోగ సాధన చివరి దశలో అమ్మ చేసే ధ్వని కరిణీ ధ్వని.
          అలా  ధ్వనులు జనించే యోగంలో కుదురుగా నిలిపి , నన్ను యోగంలో అనుగ్రహించు అని ఈ మంత్రంలో విన్నపము.
                                                          04

ఈ నాలుగవ మంత్రంలో వేద పురుషుడు లక్ష్మీదేవిని తన హృదయములోనికి రమ్మనమని  ఆహ్వానిస్తున్నారు.

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్
పద్మేస్థితాం పద్మవర్ణాం త్వామిహోపహ్వయే శ్రియమ్
తాత్పర్యము
          ఓ  లక్ష్మీదేవి !   నువ్వు శబ్దము చేసే దానివి,గొప్పతనానికి కారణమైన దానివి, అందమైన  స్వభావము కలిగిన దానివి, దయతో నిండిన హృదయము కలిగినదానివి, ప్రకాశించేదానివి, తృప్తి కలిగినదానివి, భగవంతుని తృప్తి పరిచేదానివి, పద్మములో నిలచి ఉన్నదానివి, పద్మమువంటి వర్ణము కలిగినదానివి, నిన్ను ఇక్కడకు ( నా హృదయము లోనికి) ఆహ్వానిస్తున్నాను.
విశేషాలు
౧. కై శబ్దే  . అని ధాతువు. అందువల్ల ఈ మంత్రంలో  కాం అను ఆక్షరానికి శబ్దించేదానివని అర్థం చెప్పబడింది.
                                               
                                      05

ఈ అయిదవ మంత్రంలో లక్ష్మీదేవిని వేద పురుషుడు శరణు కోరుతున్నాడు.

చన్ద్రాం ప్రభాసాం యశసాం జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే

తాత్పర్యము

          అమ్మా! లక్ష్మీదేవీ! నువ్వు  చంద్రునిలా దయతో చల్లదనం కలిగినదానివి .బాగా కాంతి కలిగినదానివి. కీర్తి  కలిగినదానివి. వివిధ అగ్నుల స్వరూపము కలిగినదానివి . ఈ లోకమునందు , పర లోకమునందు దేవుడైన విష్ణువుతో కలిసి ఉన్నావు.దాతృత్వ గుణము కలిగినదానివి. కాలానికి అతీతమయినదానివి.అటువంటి నిన్ను నేను శరణము  కోరుతున్నాను.   నాయొక్క దారిద్ర్యము  నశించుగాక! నిన్ను వరిస్తున్నాను.( భక్తితో నిన్ను నా హృదయంలో ఉండాలని కోరుకొంటున్నాను)
విశేషాలు
అగ్నులను  నిఘంటువులలో ఇలా చెప్పారు.
త్రివిధ-అగ్నులు
1. గార్హపత్యము (పిత), 2. దక్షిణాగ్ని (మాత), 3. ఆహవనీయము (గురువు).
"పితా వై గార్హపత్యోఽగ్ని ర్మాతాగ్నిర్దక్షిణః స్మృతః, గురు రాహవనీయస్తు సాగ్ని త్రేతా గరీయసీ" [మనుస్మృతి 2-331]
చతుర్విధ అగ్నులు
(అ.) 1. దీపాగ్ని, 2. కమలాగ్ని, 3. మంధాగ్ని, 4. గాఢాగ్ని.
(ఆ.) 1. బడబాగ్ని, 2. జఠరాగ్ని, 3. గృహాగ్ని, 4. వైద్యుతాగ్ని.
(ఇ.) 1. విషమాగ్ని, 2. తీక్ష్ణాగ్ని, 3. మందాగ్ని, 4. సమాగ్ని.
పంచ-అగ్నులు :
(అ.) 1. దక్షిణాగ్ని, 2. గార్హపత్యాగ్ని, 3. ఆహవనీయాగ్ని, 4. సభ్యాగ్ని, 5. ఆవసథ్యాగ్ని.
(ఆ.) 1. మందాగ్ని, 2. తీక్ష్ణాగ్ని, 3. విషమాగ్ని, 4. సమాగ్ని, 5. భస్మాగ్ని.
(ఇ.) 1. బడబాగ్ని, 2. జఠరాగ్ని, 3. దావాగ్ని, 4. గృహాగ్ని, 5. వైదికాగ్ని.
(ఈ.) 1. పూర్వాగ్ని, 2. దక్షిణాగ్ని, 3. పశ్చిమాగ్ని, 4. ఉత్తరాగ్ని, 5. సూర్యుడు.
(ఉ.) 1. బుద్ధి, 2. ఉదానము, 3. చక్షుస్సు, 4. రూపము, 5. పాతము.
(ఊ.) 1. జ్ఞానాగ్ని, 2. కాలాగ్ని, 3. క్షుధాగ్ని, 4. శీతాగ్ని, 5. కోపాగ్ని.
(ఋ.) 1. బడబాగ్ని, 2. జఠరాగ్ని, 3. కాష్ఠాగ్ని, 4. వజ్రాగ్ని, 5. సూర్యాగ్ని.
(ౠ.) 1. ఉదరాగ్ని, 2. మందాగ్ని, 3. కామాగ్ని, 4. శోకాగ్ని, 5. బడబాగ్ని. [అగ్నిపురాణం]
షట్‌-అగ్నులు :
1. గార్హపత్యము, 2. ఆహవనీయము, 3. దక్షిణము, 4. సభ్యము, 5. అవసథ్యము, 6. ఔపాసనము. [ఇవి కర్మకాండకు సంబంధించినవి]
అష్ట-అగ్నులు :
1. దీపాగ్ని, 2. కమలాగ్ని, 3. గాఢాగ్ని, 4. దావాగ్ని, 5. తుషాగ్ని, 6. భగనాగ్ని, 7. వానిజాగ్ని, 8. వత్సలాగ్ని.
అగ్నులు :
1. పంచాగ్నులు అంటే లౌకిక జీవితంలో ఉదరాగ్ని, మందాగ్ని, కామాగ్ని, శోకాగ్ని, బడబాగ్ని.

2. ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం, సభ్యం, అపసథ్యం. (అనలం, కుకూలం, ఛగలం, వత్సలం అనేవి సామాన్యాగ్ని భేదాలు).                                                         ౨

          “పద్యమానం మినోతీతి కాలం పద్మం ప్రచక్షతే” ( లక్ష్మీతంత్రం) తాను కదులుతూ మిగిలినవానిని విభాగించేది  కనుక పద్మానికి కాలమని పేరు.

                                                06

ఈమంత్రంలో  లక్ష్మి తో సంబంధం ఉన్న బిల్వ వృక్షాన్ని పొగుడుతున్నాడు.

ఆదిత్యవర్ణే తపసో ౽ధిజాతో
వనస్పతిస్తవ వృక్షో౽థ బిల్వః
తస్య ఫలాని తపసా నుదన్తు
 మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః
తాత్పర్యము

          శుభ కారకమైన ! ఓ బిల్వ వృక్షమా !  సూర్యుని వర్ణం వంటి వర్ణం కలిగినదానా! నీ సంకల్పం వల్ల నువ్వు
అన్ని శుభాలకోసం అవతరించావు. గొప్ప చెట్టు   ఆ బిల్వ వృక్షం .  దాని యొక్క పండ్లు నా తపస్సుతో అజ్ఞానాన్ని, శత్రువులను బయటికి కనిపించే దారిద్ర్యాలను పోగొట్టు గాక !
విశేషాలు
బిల్వమంటే మారేడు.
శ్రీ మహా విష్ణువు , లక్ష్మీదేవితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతినుంచి బిల్వ వృక్షం జన్మించిందిట
బిల్వపంచకము
1. తులసి, 2. మారెడు, 3. వావిలి, 4. ఉత్తరేణు, 5. వెలగ [వీని పత్రములు].
బిల్వఖల్వాటన్యాయం
మిట్టమధ్యాహ్న సమయంలో బట్టతలవాడొకడు వీధిలో పోతూ సూర్యకిరణాలవల్ల తల చురుక్కుమనగా దగ్గరున్న మారెడుచెట్టు కిందికి చేరినాడు. వెంటనే మీది నుండి మారెడుపండు తలమీద పండి తల చితికింది. [దురదృష్టవంతుడికి, ఎక్కడికి పోయినా బాధలే అని భావం.]
బిల్వవిభజనన్యాయం
మారెడుపండును పగులగొట్టడమన్నట్లు. [తెలియని విషయంలో ప్రవర్తించడమని భావం.]
                                                07
ఈ మంత్రంలో యోగ శాస్త్ర విధానాన్ని అనుసరించి లక్ష్మి తనను పొందాలని సాధకుడు ఆహ్వానిస్తున్నాడు.
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతో ౽స్మి రాష్ట్రే ౽ స్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే

విశేషాలు
మూలాధార పద్మము యొక్క కర్ణికలో అగ్ని మండలము ఉన్నదని శాస్త్రము. దానిని ఈ మంత్రములో మణితో పోలుస్తున్నారు.
శరీరంలోని చక్రాలు ఉంటాయని యోగ శాస్త్రం చెబుతోంది.
మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః
7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం
6. ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం
5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం
4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం
3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం
2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం
1. ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం
వీటిలో మూలాధారచక్రం మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవు ఆకారంలో ఉంటుంది.
ఈ మంత్రంలో లక్ష్మీదేవి అనుగ్రహానికి భారత భూమిలో పుట్టటం ఒక గొప్ప అర్హత అని చెబుతున్నారు. మనము ఎంత అదృష్ట
                                      08
క్షుత్పిపాసాం మలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాన్  నిర్ణుదమే గృహాత్
తాత్పర్యము
 ఓ వేద పురుషా !(అగ్ని దేవా )ఆకలి, దాహము మొదలయిన  దోషాలకు కారకురాలయిన , లక్ష్మికంటె పెద్దదయిన జ్యేష్ఠాదేవిని నేను నశింపచేస్తున్నాను. దరిద్రము సమృద్ధి లేక పోవటము మొదలయిన వాటన్నింటిని నా  ఇంటి నుండి వెళ్లి పోయేటట్లు చేయి.
 విశేషాలు
          01.నాశయామ్యహమ్ (“నేను నశింపచేస్తున్నాను )“ అనే  పద బంధం  కొంచెం వింత కలిగిస్తుంది.  నిజానికి సాధకునికి అంత శక్తి లేదు. ఇక్కడ “నేను” పదం – అమ్మ  దయతో పరిపూర్ణుడైన భక్తుని సూచిస్తుంది. అటువంటి భక్తునికి దరిద్రాన్ని నాశనము చేయగల శక్తి ఉంటుంది.

          02.సంపూర్ణ కార్తీక మహాపురాణములో (29వ అధ్యాయం)ఈ జ్యేష్ఠాదేవి కథ విపులంగా ఉంది. 
 క్షీరసాగర మథనంలో  అనేక వస్తువులు లభించాయి.  లక్ష్మినీ కౌస్తుభాన్నీ శ్రీహరికి సమర్పించి - తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు.  లక్ష్మి  తనకన్న   పెద్దదయిన  జ్యేష్ఠకు పెండ్లి కావాలని కోరింది. విష్ణువు - ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని ఇచ్చి పెండ్లి చేసాడు. పవిత్రమైన  యజ్ఞయాగాదులు  జరిగే ఉద్దాలకుని ఆశ్రమంలో ఉండలేని జ్యేష్ఠాదేవిని  రావిచెట్టు మొదట్లో  కూర్చో'మని చెప్పి ఉద్దాలకుడు వెళ్ళాడు. ఎన్నాళ్ళకీ ఉద్దాలకుడు రాలేదు. ఆమెని ఊరడిస్తూ  "ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగానూ, అక్కడ జ్యేష్ఠాదేవిని పూజించే వారిని  శ్రీలక్ష్మి కరుణిస్తుందని  శ్రీహరి చెప్పాడు.

                                                09
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
 ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్
శ్రీ లక్ష్మీదేవిని తన ఇంటిలో నిత్యము ఉండమని సాధకుడు ఈ మంత్రములో ఆహ్వానిస్తున్నాడు.
తాత్పర్యము
లక్ష్మీదేవి అన్ని సుగంధాలకు నిలయం .ఎవరూ జయించలేనిది. ఎప్పుడూ గుణములతో  నిండి  యున్నది. ఏనుగులకు ఈ శ్వరిసమ స్త జీవరాశులకు అధికారిణి . అటువంటి  లక్ష్మీదేవిని నా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాను.
విశేషాలు
1. కర్పూరము, 2. కస్తూరి, 3. పునుగు, 4. జవ్వాజి, 5. అగరు, 6. పన్నీరు, 7. అత్తరు, 8. శ్రీగంధము. అను ఎనిమిది రకాల గంధాలనే కాకుండా గంధ శబ్దం   పంచ తన్మాత్రలలోని (శబ్దస్పర్శ రూపరసగంధములు) గంధ శబ్దాన్ని కూడా సూచిస్తుంది.
తత్‌ + మాత్ర. తత్‌ అంటే పరబ్రహ్మం. మాత్రం అంటే కొలమానం. బ్రహ్మాన్ని తెలుసుకొనడానికి ఉపయోగపడే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు  ఐదూ కలసి పంచ తన్మాత్రలు. వీటిని  చెవి, చర్మం, కన్ను, నోరు, ముక్కు అనే జ్ఞానేంద్రియాలతో తెలుసుకొంటాము.
గంధాదుల ద్వార లక్ష్మీదేవిని తెలుసుకోవచ్చని భావం.
వైభోగాలకు, బలానికి  ప్రతీక  ఏనుగు.
 ఏనుగు ఎక్కడ వుంటే అక్కడ సర్వసంపదలు, శక్తులు  ఉంటాయి.
ప్రముఖ దినపత్రిక ది  హిందూ తన గుర్తింపు చిహ్నం (logo)లో ఏనుగుని బలానికి , అధికారానికి ప్రతీకగా గ్రహించింది.
లక్ష్మీదేవిని సేవిస్తే సర్వసంపదలు, శక్తులు   వస్తాయని భావం. 
                                      10
లక్ష్మీదేవిని తన దగ్గర ఉండమని వేద పురుషుడు ఈ మంత్రములో ప్రార్థిస్తున్నాడు.
మనసః కామమాకూతిం  వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః
తాత్పర్యము
 అమ్మా ! లక్ష్మీదేవి! నువ్వు  మనస్సుచేత కోరుకొనేదానివి.పలికే శబ్దాలకు అర్థము నీవే.సత్యమైనదానివి .నీ రూపాన్ని నా మనస్సు  పొందేటట్లు చేయి.
 పశు స్వరూపులైన  మా  జీవులలో జ్ఞాన స్వరూపంలో ఉన్నదానివి. భోగించదగిన వస్తువులలో కీర్తి రూపంగా ఉన్నదానివి.ఓ
లక్ష్మీదేవి! నా భావనా తీరాలకు దయతో నువ్వు  చేరు.(నా మనస్సులో నిత్యంగా ఉండు తల్లీ అని ప్రార్థన.)
                                                -11
లక్ష్మీదేవిని తన వారందరి దగ్గర ఉండేటట్లు చేయమని కర్దమప్రజాపతిని  వేదపురుషుడు  ఈ మంత్రములో ప్రార్థిస్తున్నాడు.
కర్దమేన  ప్రజాభూతా మయి సంభవ కర్దమ !
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్
తాత్పర్యము
 ఓ కర్దమ ప్రజాపతీ ! కర్దముడవైన నీచేత   కుమార్తెగా లక్ష్మీదేవి  స్వీకరించబడినది. పద్మాల మాలికలు కలిగిన శ్రీ లక్ష్మిని నాయందు  ఉండే పరిస్థితి కలిగించు. నాకులములో,నా వారిలో  అమ్మ శ్రీ లక్ష్మీదేవిని ఎప్పుడు  ఉండేటట్లు చేయి.
విశేషము
కర్దమ ప్రజాపతి
బ్రహ్మచ్ఛాయయందు పుట్టిన వాడు కర్దమ ప్రజాపతి . భార్య దేవహూతి. కొడుకు కపిలుడు
కర్దమ ప్రజాపతి లక్ష్మీదేవిని కుమార్తెగా పాలకడలిలో ఆమె పుట్టినప్పుడు స్వీకరించాడని శ్రీ సూక్త వ్యాఖ్యానమ్ లో డా. ఈ. ఏ. శింగరాచార్యులవారు తెలిపారు.( 120 పే.)
                                                12
లక్ష్మీదేవిని తన వారందరి దగ్గర ఉండేటట్లు చేయమని చిక్లీతుడనే లక్ష్మీ ఆలయాన్ని కాపాలా కాసే వాడిని   వేదపురుషుడు  ఈ మంత్రములో ప్రార్థిస్తున్నాడు.
ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే
ని చ  దేవీం మాతరం  శ్రియం వాసయ మే  కులే
తాత్పర్యము
 లక్ష్మీ  అమ్మవారి గుడిని రక్షించేవాడా !  నీరు -  లక్ష్మికి ఇష్టమైన వానిని    మా ఇంట్లో సృష్టించుగాక. నా ఇంట్లో నివసించు.
తల్లి అయిన శ్రీ లక్ష్మిని  నా కులములో (నా వంశంలో)నిత్యము ఉండేటట్లు చేయి
విశేషాలు
 విష్ణువుకు నివాస స్థానమైన నీరు - లక్ష్మికి ఇష్టమైన వానిని    మా ఇంట్లో సృష్టించుగాక.  అని చెప్పటంలో నీటి యొక్క గొప్పతనం చెప్పబడింది.
 పద్ముడు, గతుడు, శంఖ నిధి,నాలుగు దంతాలున్న ఏనుగు, శుభకరమైన పాము, సింహం, చిక్లీతుడు- లక్ష్మీ దేవి గుడిని కాపాలా కాసేవారు. వీరిలో చిక్లీతుని ఈ మంత్రంలో వేద పురుషుడు ప్రార్థిస్తున్నాడు.
                                                13
లక్ష్మిని తన దగ్గర ఎప్పుడూ ఉండేటట్లు చేయమని  అగ్నిని  ఈ మంత్రంలో వేద పురుషుడు ప్రార్థిస్తున్నాడు.
ఆర్ద్రాం పుష్కరిణీం  యష్టిం పింగళాం పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
భావము
 ఓ అగ్నిదేవా ! చల్లని , మృదువైన మనస్సు కలిగినది,భక్తులను పోషించేది, అందరికి ఆలంబనగా ఉండేది, పచ్చని రంగును  కలిగినది, తామరపూల మాలికను ధరించినది , ఆనంద రూపమును ధరించినది,బంగారంకలిగినది అయిన ,లక్ష్మీదేవిని  ఎప్పుడూ నా దగ్గర ఉండేటట్లు నన్ను  అనుగ్రహించు
విశేషాలు
 జాతవేదుడు అనగా అగ్ని.
 అపౌరుషేయాలైన వేదాల పుట్టుకను గురించి అగ్ని ఒక్కరికే తెలుసు. వేదాల పుట్టుక గురించి తెలిసినవాడు కనుక జాతవేదుడు.  (నిరుక్తం).
                                                14
సూర్య రూపిణియైన లక్ష్మిని తన దగ్గర ఎప్పుడూ ఉండేటట్లు చేయమని  అగ్నిని  ఈ మంత్రంలో వేద పురుషుడు ప్రార్థిస్తున్నాడు.
ఆర్ద్రాం పుష్కరిణీం తుష్టిం  సువర్ణాం హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
భావము
 ఓ అగ్నిదేవా ! చల్లని , మృదువైన మనస్సు కలిగినది,భక్తులను పోషించేది(తామరలను కలిగినది), అందరిని సంతోషింపచేసేది, అందమైన శబ్దమయిన వేదంలా ఉన్నది ,హైమ పర్వతాన్ని మాలగా ధరించినది,సూర్య రూపమును ధరించినది, బంగారంకలిగినది అయిన లక్ష్మీదేవిని  నాకు అనుగ్రహించు.
విశేషాలు
1. జాతవేదుడు అనగా అగ్ని.
2. అపౌరుషేయాలైన వేదాల పుట్టుకను గురించి అగ్ని ఒక్కరికే తెలుసు. వేదాల పుట్టుక గురించి తెలిసినవాడు కనుక జాతవేదుడు.  (నిరుక్తం).
3. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు మొదలయినవి  హైమన  పర్వతంలో ఉంటాయి.బ్రహ్మను స్థిరంగా నిలుపుట కొరకు తాను ఈ  హైమన పర్వతాన్ని ధరిస్తున్నానని లక్ష్మీదేవి లక్ష్మీ తంత్రంలో చెప్పింది. అందుకే ఆమెకు “హేమ మాలిని” అని పేరు వచ్చింది.(డా. ఈ . ఏ. సింగరాచార్యులవారి శ్రీ సూక్త వ్యాఖ్యానము. పుట.131)
                                                15
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్
భావము
 ఓ అగ్నిదేవా ! అధికమైన  బంగారాన్ని, ఆవులను, సేవకురాళ్లను, గుర్రములను, పురుషులను నాకు ప్రసాదించే లక్ష్మిని అనుగ్రహించు.
విశేషాలు
1. జాతవేదుడు అనగా అగ్ని.
2. అపౌరుషేయాలైన వేదాల పుట్టుకను గురించి అగ్ని ఒక్కరికే తెలుసు. వేదాల పుట్టుక గురించి తెలిసినవాడు కనుక జాతవేదుడు.  (నిరుక్తం).
3. అధికమైన  బంగారాన్ని, ఆవులను, సేవకురాళ్లను, గుర్రములను, పురుషులను లక్ష్మితో వస్తాయి కనుక లక్ష్మిని అనుగ్రహించమని ప్రార్థన
4. శ్రీమంతుడయిన స్వామి . ఏ రూపం ధరించినా 'అనపగామిని' 'అనపాయినీ' (వీడకుండా అనుసరించే శక్తి) అయిన లక్ష్మి ఆయన వెంటనే ఉంటుంది. ఆయన వక్షంపై కొలువుతీరి ఉన్నది ఆ తల్లి. ఈ శ్రీ సూక్తానికి ఈ అజ్ఞాని వ్రాసిన అర్థతాత్పర్య విశేషాలలో దోషాలుంటే  ఆ శ్రీ లక్ష్మిని  క్షమించవలసినదిగా ప్రార్థిస్తూ, ఈ శ్రీ సూక్త అర్థ తాత్పర్యాలు చదివినవారికి శుభ సంపత్తులు కలుగచేయాలని ప్రార్థిస్తున్నాను.
                                                 శుభమ్ భూయాత్
No comments: