Sunday, September 18, 2016

ఆపాతాళ నభః స్థలాంత  (రుద్రాభిషేకంలోని ధ్యానశ్లోక ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు) 19-09-2016

          శివా ! నువ్వు ఇటువంటి వాడివి. నీకు నమస్కారము” అని చెప్పేది నమకము.”ఓ శివా ! ఇది కూడా (చ) నాకు ఇవ్వు. (మే)  అని  ప్రార్థనా పూర్వకంగా చెప్పేది చమకము.” నమకము, చమకము కలిపితే అది శతరుద్రీయము.

          సహస్రము అంటే వేయి అని  కాదు. అనంతము అంటే లెక్కపెట్టలేనన్ని అని అర్థం చెప్పుకోవాలి.  అలాగే శతరుద్రీయములోని శతకు వంద - అని అర్థం కాదు. అనేక అని చెప్పుకోవాలి.  అనేకమంది శివులు కనబడేది శతరుద్రీయము. ఈ నమకచమకాల ప్రార్థనా శ్లోకము ఇది.

ఆపాతాళ నభః స్థలాంత  భువన  బ్రహ్మాండ మావిర్భవ
జ్జ్యోతిః స్ఫాటికలింగమౌళి విలసత్‌ పూర్ణేందువాంతామృతైః,
అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకం జపన్
ధ్యాయేదీప్సిత సిద్థయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివమ్‌.

ప్రతి పదార్థము
ఆపాతాళ=పాతాళము  మొదలుకొని,
నభః స్ధలాంత = ఆకాశతలము తుదిగాఉన్న,
భువన = భువనములతో గూడిన,
 బ్రహ్మాండం = బ్రహ్మాండరూపముగా
ఆవిర్భవత్‌ = ఆవిర్భవించు    ,
జ్యోతిః స్ఫాటికలింగ = జ్యోతిర్మయమగు స్ఫటికలింగము యొక్క
మౌళి = తలపై,
విలసత్‌ = వెలుగు,
పూర్ణేందు = నిండు చంద్రుని నుండి,
వాంత = (టు వమ ఉద్గిరణే) కురియు,
అమృతైః= అమృతములచే,
 అస్తోకాప్లుతం = దట్టముగా ముంచబడి నట్టియు,
 ఏకం = కేవలుడగు,
ఈశం = ఈశ్వరుని,
ఈప్సితసిద్ధయే = కోరిక నెరవేరుటకు,
అనిశం = ఎల్లపుడును
రుద్రానువాకాన్‌ = రుద్రానువాకములను,
జపన్‌ = జపించుచు,
థ్యాయేత్‌ = థ్యానించునది,
ధ్రువపదం = మూడుకాలములందును చెడని,
శివం = శివుని,
 విప్రః = విప్రుడు,
అభిషించేత్‌ = అభిషేకించునది.

తాత్పర్యము

          పాతాళం నుండి ఆకాశం వరకూ సమస్తం ఒకటే  లింగం.  ఆ లింగ రూపం బ్రహ్మాండం (బ్రహ్మ + అండం= అనగా ఒక కోడి గుడ్డు లా)
           ఆ వెలుగులతో కూడిన జ్యోతిర్మయమయిన లింగం శుధ్ధమయిన స్ఫటికంలా ఉంటుంది.
           మౌళి అంటే తల. కనుక ఆ తలలో  చంద్రమండలం ఉంది.  చంద్రునిలోని ఆ అమృతం శివలింగం తల నుంచి క్రిందకి అభిషేకంలా పడుతోంది..  అందువల్ల బ్రహ్మాండంలో ఉన్నలోకాలన్నింటీకి  కూడా ఈ అమృత ధార వలన చల్లదనం కలుగుతోంది. ! శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు, మూడు కాలాల్లోనూ నమకచమకాలు చదివేముందు  ఈ శ్లోకం చదువుతూ ఈ సృష్టి మొత్తంగా  వ్యాపించిన  ఆ మహాశివ లింగానికి అభిషేకం చేస్తున్నామని  భావించాలి.

విశేషాలు

  1. ఈశ్లోకమున "అస్తోకాప్లుత మేకమ్‌'కు బదులు "అస్తోకాప్లుత లోకమ్‌' అనియు "ధ్రువపదమ్‌'కు బదులు "అద్రుతపదమ్‌' అనియు ఆవిర్భవత్ అనుటకు ఆవిస్ఫురత్ అనియూ ఇతర పాఠాలు ఉన్నాయి.


  1. ఆపాతాళ నభః స్థలాంత  భువన  బ్రహ్మాండమ్ 'అను మొత్తాన్ని ఒక పదంగా( సమస్త పదము) భావించి  కొంతమంది అర్థం చెప్పారు. పాతాళము మొదలు ఆకాశము వరకు బ్రహ్మాండాన్ని ప్రతిబింబిస్తూ స్ఫాటిక లింగమున్నదని  వివరించారు. " ఇక్కడ అర్థములో  వీరు "అస్తోకాప్లుత లోకమ్‌' అని చదివి దానిని "ఈశ' పదానికి  విశేషణముగా చెబుతారు.

  1. ఇంకొందరు-"బ్రహ్మాండ మభితః' (=అంతటా బ్రహ్మాండము వ్యాపించి ఉన్నదిఅని  అధ్యాహరించి(= ఊహించి) బ్రహ్మాండమును ద్వితీయావిభక్తిగా చెబుతూ  బ్రహ్మాండ మంతటను ఆవిః స్ఫురజ్జ్యోతిఃప్రకాశించు (ఆవిస్ఫురత్)  శివస్వరూప మని చెబుతారు..


  1. అర్థముల్లో కొంచెము తేడా ఉన్నప్పటికీ   తాత్పర్యమొకటే.

  1. నడిచే దేవుడు కంచి స్వామి  శ్లోకానికి  ఇలా వ్యాఖ్యానం చేసారు.

పాతాళలోకంనుండి ఆకాశపర్యంతము వ్యాపించి ప్రకాశిస్తున్న స్ఫటికలింగాన్ని అభిషేకిస్తున్నాను - అని దీనిభావం. స్ఫటికలింగం నిర్లిప్తమైనది. శుద్ధమైనది. నైసర్గికంగాగాని ఔపాథికంగాకాని అది పరిణామం చెందుతుంటుంది. అది గుణదోషరహితమైనది. జ్ఞానమెట్లు నిరంజనమో, పరిశుద్ధమో స్ఫటికమూ అట్లే పరిశుద్ధమైనది. పచ్చని ఆకును దానిమీద ఉంచితే అది పచ్చగానూ, ఎఱ్ఱ పూవుతో అలంకరిస్తే ఎర్రగాను కనపడుతుంది. స్వతహాగా అది నిర్వికారమైనది. నిర్వికార పరబ్రహ్మము, మన మనోభావాలను అనుసరించి మారుతుంది. అనుటకు స్ఫటికలింగ మొక దృష్టాంతం. అది నిర్గుణ పరమాత్మకు చిహ్నం.

స్ఫటికలింగానికి శిరోభాగంలో ఒక చంద్రకళ, సహస్రార కమలములోని చంద్రకళను జ్యోతిస్వరూపాన్ని ధ్యానించేవారికి చంద్రకళనుండి అమృతం స్రవించి ఆనందమిస్తున్నది. ఈసమస్త ప్రపంచమున్నూ ఆనందజ్యోతి స్వరూపమైన ఒక లింగమే. దానిని చల్లచేసినామంటే లోకమున్నూ చల్లనౌతుంది. రుద్రాభిషేకానికిముందు శ్లోకం చెప్పి మరీ ధ్యానించాలి.

బ్రహ్మాండమే ఒక శివలింగమనీ, అభిషేక కాలంలో అట్లు ధ్యానిస్తూ అభిషేకం చేయాలనీ, శ్రీరుద్రం నిర్థేశిస్తున్నది. మంచీ, చెడ్డా అన్నీ భగవత్స్వరూపంగా భావించవలెననే రుద్రం చెప్పుతున్నది. అతి మధురమును, శీతలమునూ అయిన చంద్రమండలాన్ని, నిదానంగా ఉచ్చారణచేస్తూ రుద్రాధ్యయనం చేస్తూ లింగాన్ని అభిషేకించాలి.

లింగానికి ఆద్యంతాలులేవు. మనం ఏరీతిగా స్ఫటికాన్ని చూస్తున్నామో, రీతిగానే అది మనకు కనబడుతుంది. భగవంతుడున్నూ మనం విధంగా ప్రార్ధిస్తున్నామో విధంగానే మనలను అనుగ్రహిస్తున్నాడు. మన మనస్సునకు ఒక ఆకృతి అవలంబంలేక ప్రతీకం ఉంటేనేకాని ఆనందం కలగటంలేదు. మనం ప్రేమించే బంధువర్గం విషయంలోకూడా క్షేమవార్త వినటం ఒకరకం, సమక్షంలో దర్శించటం మరొక రకం. ప్రత్యక్షమైతేనే ఆనందం కలుగుతున్నది. భగవద్విషయంలోకూడా ఒక మూర్తి ద్వారా లభించే అనుగ్రహమే సంతోషదాయకంగా ఉంటున్నది.

ఆద్యందరహితంగా పరమేశ్వరమూర్తి జ్యోతి స్వరూపంలో అరుణాచల క్షేత్రంలో ఆవిర్భవించాడు.

అపాతాళ నభస్ధలాంత భువన బ్రహ్మాండంగా వ్యాపించియున్న జ్యోతి స్వరూపాన్ని చంద్రమౌళీశ్వరుని స్ఫాటికలింగ రూపంగా మనం ధ్యానిస్తే వారి అనుగ్రహంకల్గి మనకు ఆనందం కల్గుతుంది.\

  1. కే శివానంద మూర్తిగారు  శ్లోకానికి ఇలా వివరణ చేసారు.
 తూర్పు దిశ నుండి అష్ట వసువులు గాయత్రీ చందస్సులో మహాదేవుని పొగుడుతూ  అమృతముతో అభిషేకిస్తున్నారు.
 దక్షిణ దిశనుండి ఏకాదశ రుద్రులు త్రిష్టుప్ చందస్సులో రుద్రుని పొగుడుతూ  అభిషేకిస్తున్నారు. ద్వాదశాదిత్యులు పడమర దిశనుండి జగతీ చందస్సులోనూ, విశ్వేదేవతలు ఉత్తర దిశనుండి అనుష్టుప్ చందస్సులోనూ శివునికి అభిషేక క్రియ చేస్తున్నారు.. బృహస్పతి పఙ్క్తీ చందస్సులోని మంత్రములతో  బ్రహ్మాండములో ఊర్ధ్వ దిశనుంచి దశ దిశలనుంచి  అభిషేక క్రియ నిర్వహిస్తున్నాడు. (“Structure of the Universe – Vedic” by K Sivananda Murty, 2013)

  1. భాషా విశేషాలు
ఆపాతాళ
ఆపాతాళ శబ్దాన్ని మురారి కవి చక్కగా ప్రయోగించాడు. ప్రయోగమిది.
దేవీం వాచ ముపాసతే హి బహవ: సారంతు సారస్వతమ్
జానీతే నితరామసౌ గురుకుల క్లిష్టో మురారి: కవి:
అబ్దిర్లంఘిత ఏవ వానర భటై: కింత్వస్య గంభీరతాం
ఆపాతాళ నిమగ్న పీవర తనుర్జానాతి మంద్రాచల:
సరస్వతిని ఎంతోమంది పూజించవచ్చు.కాని సారస్వతము  గురుకులములోశ్రమపడి చదువుకొన్న  ఒక "మురారి" కే తెలుస్తుంది.
సముద్రమును ఎన్నో కోతులు  దాటాయి. కాని సముద్రపులోతు - పాతాళం వరకు మునిగిన మందరపర్వతానికి మాత్రమే  తెలుస్తుంది.

                                ఈ   ఆపాతాళ   శ్లోకం  లోతు కూడా ధ్యానపరులకు మాత్రమే  విస్పష్టంగా తెలుస్తుంది.
                                                                                స్వస్తి.
               



No comments: