Sunday, September 4, 2016

AIR HYD Bhavana july 2016 04 scripts

 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యం భావన 22-07-2016
మనసును పెంచినదే మట్టి?


ప్రశ్న మానవుని ఊపిరి. జ్ఞానానికి వాహిక . ప్రశ్నల కత్తుల వంతెనల మీద నడిచివెళ్ళి సమాధానాలను అన్వేషించినవారు, అన్వేషిస్తున్న వారు అనేకమంది ఉన్నారు.108 ఉపనిషత్తులలో ఒక ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు.


ఈ ప్రశ్నల పరంపరలో పంచభూతాలను ప్రశ్నిస్తూ ఒక తాత్విక గీతం ఆధునిక కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది.


మనిషిగ పుట్టెను ఒక మట్టి/తన మనసును పెంచినదే మట్టి/మానై పుట్టెను ఒక మట్టి/తన పూవై పూసినదే మట్టి


పంచభూతాలలో మొదటిది భూమిలేదా మట్టి. భూమిలోనుంచి పుట్టామని అందరము చెబుతుంటాం.అందుకే మనిషిగ పుట్టెను ఒక మట్టి అని అంటూ కనబడని తన తన మనసును పెంచినది ఏ మట్టి ? అని కవి ప్రశ్నిస్తున్నాడు. చెట్టుగా ఇదే మట్టి పుట్టింది. మరి చెట్టులా కాకుండా మట్టి పువ్వులా ఎలా మారింది? అని ప్రశ్న.


మనిషి-మనసులకు ఉపమానాలు మాను, పువ్వులని కవి చెప్పారు. మట్టిలోనుంచి మనిషి. ఆ మనిషి జన్మ ముగిసిన తరువాత మట్టి. చెట్టు నుండి పువ్వు వస్తుంది. పువ్వు నుండి చెట్టు వస్తుంది.ఈ పరిణామ క్రమాన్ని గుర్తించినంత కాలం అజ్ఞానం.మోహం.


ఆయువు పోసెను ఒక గాలి/జీవాత్మలనూదినదే గాలి?/వేణువులూదెను ఒక గాలి/పరమాత్మునికూపిరి ఏ గాలి?


పంచ భూతాలలోని గాలిని గురించి ప్రశ్నల పరంపరఇది.
జీవుడికి ఆయువుని పోసేది గాలి. శరీరాలను మారుస్తూ పోయే జీవాత్మలను ఏ గాలి కల్పించింది? ప్రతి జన్మలోనూ ఈ జీవాత్మల జీవనవేణువులుఊది రాగాలను అనుభవాలను ఏ గాలి ఊదుతోంది? ఆ గాలిని పరమేశ్వరుడంటే ఆ ఈశ్వరునికి ఊపిరి అయిన గాలి ఏమిటి? ఇక్కడ గాలి అంటే ప్రాణం.


“నేను ఇదివరకు ఏ కాలంలోనూ లేనట్టు కాదు ; నువ్వు కూడా ఇదివరకు ఎన్నడూ లేనివాడివి కావు. అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకు ముందు ఏ కాలంలోనూ లేనివారు కారు. అంతేకాదు ; మనందరమూ భవిష్యత్తులో మళ్ళీ ఉండమనీ అనుకోవద్దు” అని భగవద్గీత.ఇది బాగా అర్థం చేసుకోమని – పామువేరు- తాడు వేరు- జీవుడు వేరూ- దేవుడూ వేరూ అనుకోవద్దని మనము శాశ్వతులమని వ్యంగ్యంగా కవి ఉపదేశం.


ఆకలి పెంచినదొక నిప్పు/తన అంగము పెంచినదే నిప్పు/కన్నుగ వెలిగెను ఒక నిప్పు/తన వెన్నుని గాంచినదే నిప్పు


మండటం, వెలగటం నిప్పు లక్షణాలు. శరీరంలొ నిప్పు వైశ్వానర రూపంలో మండుతుంది. కంటి లో వెలుగుగా మారి చూపును ఇస్తుంది.
ఆకలిగా మండించి అవయవాలకు శక్తిని అందించినది ఏ నిప్పు?వెన్ను పూస చివర కుండలినీ శక్తిగా మారినది ఏ నిప్పు? అని కవి ప్రశ్న.
ఇదంతా పరబ్రహ్మమని, అయనను సదా కొలువమని జవాబు.


దాహము తీర్చెను ఒక నీరు/తన దేహపుటొరవడి ఏ నీరు/కడలై పొంగిన దొక నీరు/తన కన్నుల పొంగినదే నీరు


దాహాన్ని ఒక నీరు తీరుస్తోంది. దేహాన్ని నడుపుతున్న నీరు ఏమిటి? కడలిగా – సముద్రంగా ఒక నీరు మారి పొంగుతోంది.కన్నులలో పొంగేది ఏనీరు?


అటనట నిలిచెను ఒక గగనం/
తన ఘటమున నిండినదేగగనం/
ఘటనాఘటనల నడుమ నటనలో/
మెరుపులు మెరిసినదే గగనం


. కుండ ఉన్నంత కాలం కుండ లోపల ఉన్న ఆకాశం ఘటాకాశం బయట ఉన్న మహాకాశం వేరు వేరుగా అనిపిస్తాయి. కుండ ముక్కలైపోతే అంతా మహాకాశమే. ఆ అజ్ఞానం ఛిన్నమైపోతే జీవుడూ, ప్రపంచం, బ్రహ్మమూ అంతా ఒకటే అని గోచరిస్తుంది. ఈ మెరుపులు మెరవాలని కవి కాంక్ష.


పంచభూతముల పంజరశుకమై/
అలమట జెందిన నేనెవరో/
ఏడు కొండలా ఎత్తున నిలిచి/
బదులే పలుకని నీవెవరో!/
ఇంతకు నాకు నీవెవరో!


“పంచభూతాలతో చేసిన పంజరం అంటే శరీరం లో చిక్కుకున్న చిలుకను నేను, శరీరం నుండి శరీరానికి మారుతూ దుఃఖపడుతున్నాను, నాకు శాంతి కావాలి! కాని ఏడు కొండలపైన ఉన్న వేంకటేశ్వరుడు (ఈశ్వరుడు)మాటలాడటంలేదు. ఆయనెవరు? నేను ఎవరు?


ఆయన నేను ఒకటే అని జవాబు. అంతర్యామిని అంతరంగంలో దర్శించాలి. బయట కాదు అని ఉపదేశం.


ఇందుకే దేవాలయాల్లో దేవుని ముందు నిలబడి కళ్ళు మూసుకోమంటారు. ఎందుకంటే ఎదురుగా బయటగా కనబడే దేవుడిని లోపల దర్శించటం నేర్చుకొమ్మని.


మనస్సుకు హత్తుకు పోయే ఈ తాత్విక గీతాన్ని , చలన చిత్రాల కోసం కాకుండా, స్థిర జ్ఞానాన్వేషణలో వేటూరి సుందరరామమూర్తి అనే మహాకవి అంతరాత్మతో వ్రాసుకొన్నారు. స్వస్తి.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యం. భావన (15-07-2016)
మనసా ఎటులోర్తునే
మనస్సు  అనేది తెలిసీ తెలియని బ్రహ్మ పదార్థం.  మనస్సు మనకు ఉన్నదనే అందరం చెబుతుంటాం. మనస్సు లేదనే వారు దాదాపుగా తక్కువ.
 త్యాగరాజ స్వామి వారు మనస్సు గురించి  చాలా కృతులు వ్రాసారు.
.మనసా ఎటులోర్తునే నా/
మనవిని చేకొనవే  అని పల్లవి.
ఓ మనసా! నేను నీకు ఎన్ని విన్నపాలు చేసాను!? నామనవిని గ్రహించవేమిటే? ఆదరించవే!
ఆ మనవి ఏమిటో త్యాగరాజస్వామి చరణాలలో వివరిస్తున్నారు

దినకరకుల భూషణుని/
దీనుడవై భజనజేసి/
దినముగడుపమనిన నీవు/
వినవదేల గుణవిహీన
దినకరుడు అంటే సూర్యుడు. ఆ సూర్యకులమునకు అలంకారమువంటి వాడు రాముడు. వంశములో చాలా మంది జన్మిస్తారు. అలంకారము వల్ల శరీరానికి కాంతి వచ్చినట్లు,  వారిలో కొద్ది మందివల్లనే ఆ వంశానికి పేరు వస్తుంది.  శ్రీ రాముడు అటువంటివాడు. ఓ మనస్సా ! ఆ రాముని   దీనత్వంతో భజన చేసి ప్రతి రోజూ గడపమని మనవి చేసినా  వినవు . మంచిలక్షణాలు లేనిదానివే నువ్వు. గుణ విహీనురాలివి  అందుకే నా మనవిని వినటం లేదు.
దేవుడిని ఎలా కొలవాలో త్యాగరాజస్వామి ఈ చరణంలో చెప్పారు.
స్వామి దగ్గర   దర్పం  పనికిరాదు.దీనత్వం ఉండాలి.అధికుడిని, ఐశ్వర్యవంతుడిని-  ఇలా జిడ్డులన్నీ  వదిలించుకొని, ఏమీ లేని తనంతో శ్రీరాముని మనస్సులోకి ఆహ్వానించాలని ప్రబోధము .

కలిలో రాజస తామస గుణములు - గలవారి చెలిమి/
కలిసిమెలసి తిఱుగుచు మఱి - కాలము గడపకనే
సులభముగా గడతేరను - సూచనలను దెలియజేయు/
ఇలను త్యాగరాజుమాట - వినవదేల గుణవిహీన
ఈ కలియుగములో  రజోగుణము వల్ల పుట్టిన  గర్వముతో – రాజస గుణముతో ఉండే వాళ్లు కొంతమంది.
తమోగుణము వల్ల పుట్టిన చిరాకు, కోపము – ఇలాంటి  తామస గుణము తో  ఉండే  వాళ్లు మరికొంతమంది.
ఓ బుద్ధిలేని మనసా ! వీళ్లతో నాకు స్నేహము చేయిస్తావేమిటే?

వాళ్ల మీద నాకు ప్రేమను పెంచుతావు. వాళ్లతో తిప్పుతావు. విలువైన కాలాన్ని వృథాగా గడిపేస్తావు.. ప్రతి జన్మకి  ముందు  9 నెలలు తల్లి కడుపులో మల మూత్రాలలో తేలుతూ గడపటం ఎంత బాధాకరం. అసలు మళ్ళీ జన్మ ఎత్తకుండా- రామ నామాన్ని జన్మిస్తే మోక్షం సులభముగా వస్తుందని చెబుతున్నా- సూచిస్తున్నా- ఈ త్యాగరాజు మాట పట్టించుకోవా  !
ఈ సందేశాన్ని తాగరాజస్వామి తన మనస్సుకు చెప్పుకొంటున్నట్లు ఉంది కాని – ఇది అందరి మనస్సులకు సంబంధించినది.

మన ఏవ మనుష్యాణాం!కారణం బంధమోక్షయోః!బంధాయ విషయాసంగి!ముక్త్యై నిర్వషయం స్మృతమ్!!  అని మైత్ర్యుపనిషత్ .
మనస్సే బంధమోక్షములు రెంటికీ కారణం.
.మనస్సు విషయాసక్త మయితే  బంధం.
,నిర్విషయమయితే ముక్తి. ఈ విషయాన్నే త్యాగరాజ స్వామి ఆవేదన పూర్వకంగా , విషయలంపటాలలో కొట్టుకొనిపోతున్న మనందరికి ఈ కృతిలో మనస్సు పరంగా చెప్పారు
.
శ్రీ రాముని తలువకుందా    ఇతర విషయాలు తలిస్తే అది  ఎలా ఉంటుందంటే - ఇంటి తలుపులు బార్లా తీసి, కుక్కలను లోపలికి తరిమినట్లట  తన తలు పొకరింటికి దీసిపెట్టి/తాగుక్కలదోలురీతి గాదో!

దేవుని మీద  మనస్సు నిలపకుండా పూజ గంటలు మోగిస్తూ పూజ చేయటం వృథా  . గంగానది, కావేరి నది పవిత్రమయినవే. అయినప్పటికీ మనస్సును స్వాధీనం చేసుకొని  భక్తితో మునిగితే ఫలితం ఉంటుంది. అంతే కాని భక్తి లేకుండా చేసే మునకలు వృథా.

  ఇలా మనస్సు మీద రకరకాల కృతులు రచించిన త్యాగరాజ స్వామి సందేశము అంతర్గతంగా ఈ కృతిలో ఒక్కటే. అదే నిగ్రహం.స్వస్తి.


నందబాలం భజరే (ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సౌజన్యం 01-07-2016 భావన)
శ్రీ కృష్ణుడన్నా, ఆయన చిరునవ్వు అన్నా  భక్త కవులకు, భక్తులకి చాలా ఇష్టం. అందుకే ఏదేవున్ని ఉపాసించినా ఓ మాటు శ్రీ కృష్ణున్ని తాను ఉపాసించే  దైవంలో  చూసుకొని భక్త కవులు మురిసిపోతుంటారు. ఆ ఒరవడిలోనే అంతా రామమయం అని భావించిన రామ భక్తుడు రామదాసు శ్రీ కృష్ణుడిని “నందబాలం భజరే “  అని పరవశత్వంతో  రాముడిలో దర్శించాడు.
నందబాలం భజరే బృందావన వాసుదేవ బృందాలోలం
నందుని కుమారుడైన బాల కృష్ణుని నేను సేవిస్తుంటాను.  బృందావనము అంటే ఆసక్తి కలిగిన , వసుదేవుని సుతుని నేను సేవిస్తుంటాను.
 నంద బాలుడంటే  నందుని కుమారుడని బయటకు కనిపించే అర్థం.నందము అంటే సంతోషం. ఆనందం బాల్యంలోనే అధికం .అందుకే ఆనందం బాల్యంలో ఒక రూపం ధరించింది.అతడే నంద బాలుడు . శ్రీ కృష్ణుడు. పోతన గారు కూడా  నందాంగనా ఢింభకుడు అని  చెబుతూ ఆ నంద స్వరూపుని కృష్ణుని తలచుకొని పొంగి పోయారు.
యమునానది పశ్చిమతీరములో మధుర దగ్గర  ఉన్న ఒక  వనం బృందావనం.. దీనికి ఎదుట అంటే  యమునయొక్క తూర్పుగట్టున గోకులం ఉంది.. అక్కడే  కృష్ణుడు గోపకన్యకలతో అనేకలీలలు చేసాడు.

జలజసంభవాది వినుత చరణార విందం
పద్మమునుంచి పుట్టిన  బ్రహ్మ మొదలయిన వారి చేత కొనియాడబడిన పాద పద్మములు కలవాడు అని చరణములోని మొదటి పాదం.
బ్రహ్మకు రకరకాల పేర్లు ఉన్నాయి. కాని జలజ సంభవుడు అని పద్మ సంబంధమైన పదాన్ని ప్రయోగించటంలో కవి నేర్పు ఉంది.ఎందుకంటే పాద పద్మములు సేవించబోతున్నాను అని తర్వాత పదం.
లలిత మోహన రాధావదన నళినమిళిందం
లలితమైన, మోహనమైన రాధాదేవి ముఖానికి తుమ్మెదలాంటి వాడు కృష్ణుడు.
ఈ రాధ ఎవరు? విడువని భక్తిని ధారతో పోలుస్తారు. ఆ ధారా ను తిరగవేసి చదివితే రాధా.
వినటానికి కష్టం గా ఉన్నా -  ఈ లోకంలో నడుస్తున్న సంసారాలు,కాపురాలు అన్నీ 'అవసరం' కోసం  నడుస్తున్నాయి . కాని  రాధ ప్రేమ స్వార్ధాన్ని దాటిన ప్రేమ. తనను మరచి తన ప్రియతముని ధ్యానంలో కరిగి పోవడమే రాధాతత్త్వం. తన వ్యక్తిత్వాన్ని కరిగించి తాను తన ప్రియునిగా మారడమే రాధాతత్త్వం. శ్రీరామకృష్ణ  పరమహంసకు కూడా  కూడా మొదటగా రాధాదేవి దర్శనం అయిన తర్వాతనే కృష్ణదర్శనం కలిగింది

ఒక సారి  నారదుల వారు రాధను చూసి ”అమ్మా !కృష్ణుడు లేదని బాధ పడుతున్నావా ?”అని అడిగాడు .అప్పుడు రాధ ”కృష్ణుడు నా హృదయం లోనే ఉన్నాడు కదా ఆయన లేనిది ఎక్కడ ?ఆయన లేడని బాధ పడితే,నా హృదయం లోని దేవుడికి ఆ బాధ కలిగించి నట్లే కదా “ అన్నదట.  ఉత్తమ భక్తుని చుట్టూ తిరిగే వాడు భగవంతుడు. అందుకే రాధ అనే వదనం చుట్టూ తుమ్మెద అని రామదాసుల వారి వర్ణన
“నిటలతట స్ఫుట కుటిల నీలాలక బృందం
నుదురు మీద ప్రకాశించే వంకరగా అందంగా ఉన్న  నల్లనైన ముంగురులు కలవాడు
ఘటితశోభిత గోపికాధర మకరందం
శోభించిన గోపికల పెదవులలోని మకరందాన్ని ఆస్వాదించువాడు .
గోదావరీతీర వాసగోపికా కామం‪‎
 గోదావరి తీరములో నివాసమేర్పరచుకొన్న గోపికలకు  ఇష్టమైన వాడు
శ్రీకృష్ణ‬ తత్త్వాన్ని జీర్ణించుకున్న మండపాక పార్వతీశ్వరకవి తన 'రాధాకృష్ణ సంవాదము' అనే కావ్యంలో తన ఉపాసనను యిలా ఆవిష్కరించాడు.
''‪‎మురళి‬ ప్రణవంబు గోపికలు ముక్తజశము/గోగణంబు చిరంతన గోగణంబు/రాధ మూల ప్రకృతి లక్ష్మి బ్రహ్మవిద్య/కృష్ణు డానందమయ తత్త్వమిదె నిజంబు''కృష్ణుడు ఆనందమయ రూపం, లక్ష్మి బ్రహ్మవిద్యా జ్ఞానం, రాధ ప్రకృతి స్వరూపం, గోపికా సమూహము ముక్తిజనం, ఒకే సారి కొన్ని వేల మంది  నేల మీద అద్దాలు పట్టుకుని  నిలబడ్డారు. పైన ఉన్న సూర్యుడు  వాళ్ళందరి అద్దాల్లోను కనబడతాడు. సూర్యుడు శ్రీ కృష్ణుడు గోపికలు  అద్దాల్లోని ప్రతి బింబాలు.
ఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం
సూర్య వంశము అనే సముద్రానికి చంద్రుడు,  భద్రాచల రాముని రూపంలో ఉన్న శ్రీ కృష్ణుని సేవిస్తాను అని ఈ కీర్తనను రామదాసు ముగించాడు..
సముద్రపు ఒడ్డున ఒక పిల్లవాడు కేరింతలు కొడుతున్నాడు. ఆటలాడుతూ, అలలు పట్టుకోవాలని లోలోపలకి వెళుతున్నాడు. ఒక పండితుడు ‘బాబూ ! ఎందుకలా వెళుతున్నావు’ అని అడిగాడు. అలలతో ఆడుకోవటానికి’ అని కుర్రవాడి  సమాధానం.. ‘ఈత వచ్చా ?’ పండితుని ప్రశ్న,.. రాదని అబ్బాయి చెప్పాడు. ‘ఈత రాకపోతే సముద్రంతో  నువ్వు ఆడుకోవటం కాదు, సముద్రం నీతో ఆడుకుంటుంది. ముందు ఈత నేర్చుకో. ఆ తర్వాత అలలతో ఆడుకో’ అని ఆ పండితుని ఉపదేశం
శృంగారం వేషం వేసుకొన్న రామదాసు కీర్తన అలానే సముద్రంగా కనిపిస్తుంది
పరమార్థంగ్రహించటం   ఈత వంటిది.
అప్పుడు ఆ భక్తి సముద్రంలో ఎన్ని మునకలయినా వేయవచ్చు.స్వస్తి.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యం                భావన 08-07-2016
గాయతి వనమాలీ
పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ సదాశివ బ్రహ్మేంద్రులు పాడుకొన్న కీర్తనలు సుప్రసిద్ధమైనవి. చక్కటి  గాయకుడు ఆలపిస్తున్నప్పుడు  అందులో ఏ కీర్తనకు ఆ కీర్తన ప్రశాంతమైన, అనిర్వచనీయమైన స్థితిలో మనలిని పరవశింపచేస్తాయి. అటువంటి ఒక సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలోని అర్థ మాధుర్యాన్ని దర్శించి పరవశిద్దాం

గాయతి వనమాలీ – మధురం గాయతి వనమాలీ
వనమాల అంటే  నాలుగు అర్థాలున్నాయి. మోకాళ్లవరకు వ్రేళ్లాడుతూ, అన్ని ఋతువులలోనూ పూచే పూలతో, మధ్యన పెద్ద గుచ్ఛంతో  మెడలో ఉండే దండ.శబ్ద స్పర్శరూపరస గంధములకు ఒక  రూపమైన దండ. చివురుటాకులు, పూలు కూర్చిన దండ. శివ కేశవ భేదం లేని దండ. ఇటువంటి  వనమాలను ధరించివాడు వనమాలి. ఆ వనమాలి అయిన  శ్రీకృష్ణదేవుడు   వేణువుతో మధుర గానము చేస్తున్నాడు.

పుష్పనుగన్ధిసు - మలయ సమీరే/మునిజన సేవిత యమునా తీరే
పూలవాసనలతో గుబాళిస్తున్న  చల్లని గాలితో నిండిన – మునిజనులు ఉంటున్న  – యమునానదీ తీరంలో  వనమాలి  అయిన శ్రీకృష్ణదేవుడు గానము చేస్తున్నాడు.
సూర్యుని కూతురు యమున . దీని దగ్గర  ఉండే  గోకుల బృందావనములలో  శ్రీకృష్ణుఁడు అనేక లీలలు చేసాడు.  యమున నీరు నల్లగా ఉంటుంది.
ఆ యమునా నదీతీరంలొ ఎవరి దారి వారిదే అను అర్థంలో ఎవరికి వారే యమునా తీరే అను జాతీయము ప్రసిద్ధిలోకి వచ్చింది. అంతమంది గోపికలున్నా ప్రతి ఒకరూ కృష్ణుడు తమతోటే ఉన్నారనుకొన్నారట. మిగతావాళ్లను పట్టించుకోలేదు.అసలే పూల వాసన. దానితో కలిసిన చల్లని గాలి. చల్లని హృదయాలు కలిగిన మునిజనుల స్పర్శ. ఇవన్నీ కలిగిన యమునా నదీ తీరంలో   మధురమైన కృష్ణ గానము. అద్భుతమైన సన్ని వేశము.

కూజిత శుక - పిక - ముఖ ఖగకుఞ్జే/కుటిలాలిక బహు నీరదపుఞ్జే || గాయతి||
ఆ యమున ఒడ్డున ఉన్న పొదలలో చిలుకలు, కోయిలలు అందంగా కూస్తున్నాయి. ఉంగరాలజుట్టులా  మబ్బులు ముసురుకొని వస్తున్నాయి. వాటి మధ్య  కృష్ణ స్వామిగానము ప్రవహిస్తోంది.
మబ్బులు  ఉంగరాలజుట్టులా  ఉన్నాయి అనుట ఏ కవి ప్రయోగించని అందమైనపోలిక. కృష్ణయ్య ముంగురులను పోలిన మబ్బులవి. ఉంగరాల మబ్బులు కురవకముందే కృష్ణ గాన రస ప్రవాహము ప్రవహిస్తోందనుట – వర్ణించటానికి సాధ్యం కాని కవితోక్తి.

తులసీదామ విబూషణహారీ/జలజ భవస్తుత సద్గుణ శౌరీ || గాయతి||
తులసీమాలికను అలంకరించుకొన్నవాడు - బ్రహ్మ మొదలైన వారి పొగడ్తలను అందుకొనే వాడు,  గుణశాలి - శౌరి - వనమాలి గానముచేస్తున్నాడు.
 శ్రీ కృష్ణభగవానునికి  సరితూగ గలిగిన "పవిత్రత" తులసికి ఉందని అందుకే  "తుల"తూగ గల మొక్కకనుక "తులసి" అన్నారట. తులసి మొక్క క్షీర సాగరమధన సమయంలో  అమృతంతో బాటు పుట్టింది. .కార్తీక మాసం లో, శుక్ల పక్షంలో ద్వాదశి నాడు విష్ణువుకు,తులసికి కల్యాణం చేస్తారు.
 తులసి తీర్ధాన్ని చివరి సమయంలో  జీవునికి ఇవ్వడం తులసి యొక్క గొప్పతనాన్ని  తెలియజేస్తుంది.ఇలా చాల విశేషాలున్న తులసీ ఆకులను
 శ్రీ కృష్ణుడు ధరిస్తాడని చెప్పి, సదా శివ బ్రహ్మేంద్రులు  స్వామి గొప్పతనంతో పాటు   తులసి గొప్పతనాన్ని చెప్పారు.

పరమహంస హృద యోత్సవకారీ/పరిపూరిత మురళీ రవధారీ .
పరమహంసలైన సదాశివబ్రహ్మేంద్రుల) హృదయమును ఆనందంతో నింపుతూ  - వనమాలి గోపాలదేవుడు - గానము చేస్తున్నాడు.

ఆనందం వివిధ స్థాయిలలో కలుగుతుంది. ఎవరి అర్హతను అనుసరించి వారు ఆ స్థాయిలొ ఆనందాన్ని అందుకొంటారు. బ్రహ్మ గుణము లేనివాడు.. సత్ చిత్ ఆనందము ఈ మూడింటిని  బ్రహ్మకు ఉపలక్షకములుగా అంటే బ్రహ్మను సూచించేవిగా చెబుతారు. రసోవైసః అంటే  రసమే గా బ్రహ్మ. రసమును పొంది ఆనందము కలవాడవుతున్నాడంటే  -  వాడు బ్రహ్మ అవుతున్నాడని అర్థం

సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తనలు అలా చదివే వారిని, వినే వారిని  ఆనందంతో బ్రహ్మ సదృశులుగా చేస్తాయి. స్వస్తి.

No comments: