Sunday, September 4, 2016

choornika meanings చూర్ణిక” – అర్థ విశేషాలు

  శ్రీరంగకవి రచించిన   త్రిపురాంబిక “ చూర్ణిక” – అర్థ విశేషాలు
-                    డా. తాడేపల్లి పతంజలి
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

                త్రిపురాంతకంలో  కదంబవన పీఠేశ్వరిగా  వెలసిన బాలా త్రిపుర సుందరిపై ఒక చూర్ణికను  పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన భారతుల పేరయ్య శాస్త్రి రచించారు.. ఈయనకు శ్రీరంగకవి అని ఇంకోపేరు.  కర్నూలు మండలంలోని  అన్నసముద్ర గ్రామవాసి. కాలం పందొమ్మిదవ శతాబ్దం
చూర్ణిక లక్షణాలు.
          లక్షణశిరోమణి మతమున వచనరచన అయిదురకాలు.  గద్య , బిరుదుగద్య  చూర్ణిక, వచనము , విన్నపము వీటిలో చూర్ణికలను   కృష్ణమాచార్యుడు రచియించినట్లుగా చెప్పి  తాళ్లపాక ఆన్నమాచార్యులవారు తమ సంకీర్తన  సంకీర్తనలక్షణములో   చూర్ణిక లక్షణాలు ఈ పద్యంలో చెప్పారు.
ధర  కృష్ణాచార్యాదిక
/పరికల్పితపదము తాళబంథచ్ఛందో
విరహితమై చూర్ణాఖ్యం
 బరగును నిర్యుక్తనామభాసితమగుచున్,
చూర్ణికకు చందో విరహితమైనది. నిర్యుక్తము అని ఇంకొక పేరు దీనికి ఉంది అని అన్నమయ్య వివరణ.

పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణిలో చూర్ణిక లేకవచన ద్వివచన బహువచన సందర్భంబులుగ విభక్త్యానుశాసనిక సమాసాదిత కల్పనానల్పజల్పితంబై వెలయును అన్నాడు. ఏకవచన ద్వివచన బహువచన సందర్భాలతో , మనోహరమైన కల్పనలతో , విభక్తులను అనుశాసించుటకు తగినట్లుగ చూర్ణిక ఉంటుదన్నాడు..
ఇక చూర్ణికకు  ప్రముఖ నిఘంటువులు ఇచ్చిన అర్థాలు ఇవి
1. గద్యభేదము;2. గ్రంథభేదము. ( శబ్దరత్నాకరము బహుజనపల్లి సీతారామాచార్యులు 1912   )
A sort of harmonious prose, not divided into prosodial feet, but with the unbroken sentence running on continously. (బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 )
a kind of easy prose (శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953 )
 ‘చూర్ణికఅంటే తేలిక పదాలతో కూర్చిన రచన అనే అర్థం కొంతమంది చెప్పారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారయితే చూర్ణిక పదం బాగా నచ్చి ఒక చక్కటి కథ  కూడా వ్రాసారు. 
            'మానాన్న చూశావ్. బయట పరమ సాధువు. ఇంట ఫాలాక్షుడు... ఎవరి మీదా కోపం కాదు. ఎందుకో ఒకందుకని కాదు. ఎప్పుడు ఒకటే ధుమధుమ... అలా అని పెళ్లాన్ని వేపుక తినేవాడా... అక్కడ పిల్లి... నా మీద మాత్రం ఒంటికాలి మీద లేచేవాడు...' అంటూ తమాషాగా చమత్కారంగా   చూర్ణికలోని ఒక పాత్ర చెబుతుంది.
ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు శ్రీదీపాల పిచ్చయ్య శాస్త్రిగారు తమ చాటు పద్య  రత్నాకరములో ఉదహరించిన బాలా త్రిపురసుందరి ఉపాస్య దేవతగా కల శ్రీరంగ కవి చూర్ణికను అర్థ తాత్పర్య విశేషాలతో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
   
శ్రీమత్కదంబతరు విడంబిత లస దంబురుహచర ద్వలమాన మానసౌక గరుత్పవమాన ప్లవమాన భాసమాన కంకేళీవన కేళీ సంజాత శ్రమబిందు కందళిత ముఖారవిందే! సంతతానందే!
అర్థం
శ్రీమత్= సంపద గలిగిన; ఒప్పిదము గలిగిన;కదంబతరు= కడిమి చెట్టును ; విడంబిత=అనుకరించు; లసత్ = ప్రకాశమాన మైనఅంబురుహ =నల్లటి పద్మములందు; చరత్ = విహారము చేస్తూ  ;వలమాన= అటు ఇటూ తిరుగుచున్న;మానసౌక = హంస యొక్క;గరుత్ఱెక్క;పవమాన=వాయువులో ప్లవమాన= తెప్పగా; భాసమాన = ప్రకాశించుచున్న;కంకేళీ=అశోకము
వనకేళీ = అడవిలో తిరుగుట చేత;సంజాత = పుట్టిన;శ్రమబిందు= శ్రమతో పుట్టిన చెమట బిందువులచే; కందళిత = చిగురించుచున్న, మొగ్గతొడుగుతున్న ముఖారవిందే!= ముఖ పద్మము కలదానా;  సంతతానందే!= ఎప్పుడూ ఆనందము గొలుపుదానా ! ఆనంద స్వరూపిణీ
తాత్పర్యం
          సంపద గలిగిన కలిగిన కడిమి చెట్టును అనుకరించు ప్రకాశమానమైన నల్లటి పద్మములందు  విహారము చేస్తూ  అటు ఇటూ తిరుగుచున్న  హంస యొక్క   ఱెక్కవాయువులో తెప్పగా ప్రకాశించుచున్నఅశోకములున్న  అడవిలో తిరుగుట చేత  పుట్టిన  శ్రమతో పుట్టిన చెమట బిందువులచే  చిగురించుచున్న, మొగ్గతొడుగుతున్న ముఖ పద్మము కలదానా!  ఎప్పుడూ ఆనందము గొలుపుదానా ! ఆనంద స్వరూపిణీ !  ఓ త్రిపుర సుందరీ దేవీ ! నీకు నమస్సులు
విశేషాలు
Ø  పరమాత్ముడు  కృష్ణావతారంలో స్నానం చేస్తున్నఆడవారి వస్త్రాలను  దొంగిలించి , సమీపంలోని కడిమిచెట్టు నెక్కి కూర్చున్నాడ.   సమయం లో తాను చెట్టుగా జన్మించి నందుకు  తనకు కలిగిన సంతాపాన్ని కడిమి చెట్టు పోగొట్టుకొని సంతోషాన్ని పొందిందని పోతన గారి వర్ణన. (భాగవతం. దశ. 818.)
Ø  “రాసే హరిమిహ విహిత విలాసం” అను ఒక అష్ట పదిలో జయదేవుడు విశద కదంబ తలే  మిళితం   కలి కలుష భయం  శమయంతం/మామపి  కిమపి  తరంగదనంగ దృశా  మనసా  రమయంతంఅన్నాడు.”సఖీ! కదంబ వృక్ష నీడలో చేరిన వాడు, కలి యుగ పాతకాలను పోగొట్టేవాడు, మన్మథ కామ దృష్టితో   నన్ను సంతోష పెట్టే  వవాని యొక్క   అందంగా పెదవిమీద   ప్రకాశించే  స్వామి మందహాసాన్ని    నా  మనస్సు  పొదరింటిలో  స్మరిస్తోంది అనివ్రాసాడు( నేను ఒక పత్రికలో  ఆష్ట పదికి వ్రాసిన వ్యాఖ్యానం నుండి)శ్రీ కృష్ణునికి కదంబ వృక్షమంటే అంత ప్రేమ.
Ø  కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్|
నవామ్బురుహలోచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే- అను ప్రసిద్ధమైన శ్లోకం కూడా అమ్మ ని కడిమి చెట్లయందు నివసించుదానిగా మొట్టమొదటి వర్ణన చేసింది.(కడిమి చెట్ల వనములో నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను ఆనందింప చేయు మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఎత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ,తొలకరిమబ్బు లా  నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను.)

Ø  త్రిపురాంతక స్థల పురాణాన్ని వివరించే బోర్డులో కూడా అమ్మ కదంబ వన మధ్యంలో త్రిపురాంతక పీఠేశ్వరిగా వెలసినట్లు వ్రాయబడిఉంది.
Ø  అందుకనే రంగకవి కూడా అమ్మవారి స్తోత్రాన్ని కడిమి చెట్టుతో ప్రారంభించాడు.
సర్వ సర్వంసహాఖర్వ ధూర్వహ దుర్వార  దర్వీకర గర్వ నిర్వాపణ చణ దోర్వల్లీ సమారోపిత మౌర్వీ నిర్భర నిర్ఘోష నిర్భిద్యమాన పుర్వామర గుర్విణ్యుదర దరీ కుడుంగే!
అర్థం
సర్వ= సమస్తమయిన ; సర్వంసహా=భూమి;అఖర్వ =విస్తారమైన, గొప్పదైన;ధూర్వహ = భారము వహించు;దుర్వార =వారింపనలవికాని ; దర్వీకర = ఆదిశేషుడను పాము యొక్క ; గర్వ= గర్వమును; నిర్వాపణ =వధించు (పోగొట్టి); చణ = నేర్పు కలిగిన; దోర్వల్లీ = బాహువులనెడి తీగలయందు ; సమారోపిత=అధిరోహించిన;  మౌర్వీ= అల్లెత్రాటి యొక్క; నిర్భర = భరింపశక్యముకాని; అధికమయిన; గాఢమయిన;నిర్ఘోష= ధ్వని,   నిర్భిద్యమాన= చీల్చుట; బయటఁబెట్టుట; పూర్వామర =తూర్పు,పడమరల దిక్కులనెడి ; గుర్విణ్యుదర = చూలాలి ఉదరములనెడి; దరీ = గుహలలో విలసిల్లు ; కుడుంగే= పొదరిల్లులాంటిదానా !శౌర్యానుషంగే! =పరాక్రమముయొక్క చేరిక కలదానా !
తాత్పర్యము
.సమస్తమయిన భూమి విస్తారమైన , గొప్పదైన భారము వహించు ఆదిశేషుడను పాము యొక్క  గర్వమును పోగొట్టి ,నేర్పు కలిగిన బాహువులనెడి తీగలయందు  అధిరోహించిన  అల్లెత్రాటి యొక్క అధికమయిన ధ్వని చేత  బయటఁబెట్టుట; తూర్పు,పడమరల దిక్కులనెడి  చూలాలి ఉదరములనెడి గుహలలోని పొదరిల్లుకలదానాపరాక్రమముయొక్క చేరిక కలదానా !నీకు నమస్సులు
విశేషాలు
          ఈ భూమిని తానే మోస్తున్నానని ఆది శేషునికి ఒక రకమైన గర్వముంది. నువ్వు అల్ల్లెత్రాడు అలా సంధించావో లేదో, ఆ లేదో- ఆ బ్రహ్మాండమయిన ధ్వని చేత దిక్కులన్నీ బద్దలయాయి. ఆది శేషునికి తన సామర్థ్యమేపాటిదో తెలిసి వచ్చిందని భావం
శుంభ దంభా మఖారంభ సమయ సముజ్జృంభిత దిక్కుంభి ప్రకటకట స్రవద్దానాసవ పానోదిత గానాధిక నానా మధుపానీకకులీనాంచిత వినీల పతత్రప్రభా భాసమానాసమానాలకాభిరామే! మరకతశ్యామే!
అర్థం
శుంభ= శుంభుడను రాక్షసునియొక్క  ; దంభా మఖారంభ=కపటపుయజ్ఞములో ఆరంభించిన ;  సమయ = శపథము చేత ; సముజ్జృంభిత = బాగా అతిశయించిన; దిక్కుంభి = దిక్కులనెడి ఏనుగులయొక్క ; ప్రకట=ప్రసిద్ధమయిన ;కట = చెక్కిళ్లనుండి ; స్రవత్= స్రవించు ; దాన+ఆసవ=మదమను  పక్వముచేయని చెఱకురసముతో చేసిన మద్యమును    పాన+ఉదిత = తాగుట చేత  పుట్టిన ; గాన+అధిక = గానములచేత అధికమయిన ; నానా= వివిధమైన;  మధుప+అనీక=తుమ్మెదల  సమూహము తో ; మధుకులీన+అంచిత= ఆడుతుమ్మెదల సమూహముతో ; వినీల = బాగా నల్లని ; పతత్ర = రెక్క; ప్రభా భాసమాన= బాగా ప్రకాశించే ; అసమాన= సాటిలేని ; అలకాభిరామే= అలకా+అభిరామే= ముంగురుల చేత మనోజ్ఞమైన దానా !;  మరకతశ్యామే! = ఆకుపచ్చ నీలము అనిపించే నీలము కల గలిపిన మరకతమణి శరీర కాంతికలదానా !
తాత్పర్యము
శుంభుడను రాక్షసునియొక్కకపటపుయజ్ఞములో ఆరంభించిన  శపథము చేత  బాగా అతిశయించిన  దిక్కులనెడి ఏనుగులయొక్క ప్రసిద్ధమయిన  చెక్కిళ్లనుండి  స్రవించుమదమను  పక్వముచేయని చెఱకురసముతో చేసిన మద్యమును    తాగుట చేత  పుట్టిన  గానములచేత అధికమయిన  ఉత్సాహము కలిగిన  వివిధమైన;తుమ్మెదల  నల్లని రెక్కలవలె  బాగా ప్రకాశించే  సాటిలేని  ముంగురుల చేత మనోజ్ఞమైన దానా ! ఆకుపచ్చ నీలము అనిపించే నీలము కల గలిపిన మరకతమణి శరీర కాంతికలదానా !
విశేషాలు
Ø  త్రిపురసుందరీదేవి ముంగురులు తుమ్మెద రెక్కలవలె నల్లగా ఉన్నాయని చెప్పుట కొరకు శుంభుడను వాడు చేసిన గర్వ యజ్ఞ ప్రసక్తి  తెచ్చి  భావసౌందర్యాన్ని కవి పెంచాడు. అమ్మ శుంభుని చంపి వాడి గర్వాన్ని పోగొట్టిందనే విషయంవివిధరీతులలో కవి చెప్పాడు.
Ø  హిరణ్యకశిపు వంశములో పుట్టిన సుందోపసుందుల కొడుకులు  శుంభ నిశుంభులు. వీరు పుష్కర క్షేత్రమున బ్రహ్మనుఁగూర్చి ఉగ్రతపము చేసి  ఇంద్రాదిసురలను పరిభవించు శక్తిని ఒందిరి. వీరు గౌరీకాయకోశమున ఉండి పుట్టిన కౌశికీదేవిచే చంపఁబడిరి.
Ø  మరకత శ్యామలను   దశ విద్యలలో (1. కాళి, 2. తార, 3. ఛిన్నమస్త, 4. శ్రీ, 5. భువనేశ్వరి, 6. భైరవి, 7. బగల, 8. ధ్రూమ, 9. త్రిపురసుందరి, 10. మాతంగి. ) మాతంగి అను ఒక  దేవతగా చెబుతారు. విష్ణువు కు పది అవతారములు ఉన్నట్లే పర దేవతకు కూడా పది విద్యలు, పది దేవతలు కలరు. ఒక్కో దేవతను ఒక్కో రూపములో, ఒక్కో మంత్రముతో ఆరాధిస్తారు. శ్యామల వర్ణముతో కూడి వుంటుంది. ఈమె త్రిపుర సుందరికి మంత్రిణి. ఈమెనే మరకత శ్యామల అని సంస్కృతమునందు, పచ్చైయమ్మన్ అని తమిళములోను పిలుస్తారు.
Ø  మె మతంగుని కొమార్తె అగుటచే మాతంగి అని పేరు వచ్చింది. మతంగ మహర్షి కడిమి చెట్ల మధ్య, అడవిలో ధ్యానం చేస్తుండగా దేవత సాక్షాత్కరించింది. నూరు సంవత్సరాలు మహర్షి తపస్సు చేస్తే కాళీ దేవి శ్యామలయై సాక్షాత్కరించింది. కాళీ తీవ్ర రూపమైతే, శ్యామలను  కోమల రూపంగా  చెబుతారు. . మాతంగికి మరో పేరు శ్యామల.
Ø  ఈమెను ఆరాధించే కాళిదాసు మహా కవి అయినాడు. మాతా మరకత శ్యామా మాతంగీ మధు శ్యాలినీ,
కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంబ వన వాసినీ. అని ఆయన చెప్పిన శ్లోకం ప్రసిద్ధమయినది.
Ø  ఆమె మధుశాలిని కూడా. అందుకే శ్రీరంగ కవి కూడా అమ్మని వర్ణిస్తూ పాదాలలొ ఆసవ ప్రసక్తి తెచ్చాడు.
Ø  మధువు సుఖానికి సంకేతం గా ఒక సంస్కృత న్యాయంలో (మధు పశ్యసి దుర్బుద్ధే ప్రపాతం కిం పశ్యసి )చెప్పబడింది.
మూఢుఁడా! తేనెనే చూచుచున్నావుగాని, పతనమును మాత్రము గమనించుట లేదు. ఒకఁడు చెట్టు చివరకొమ్మలో నున్న తేనెను సంపాదింపవలయునను పేరాసతో ప్రాకుచుండెనేగాని, అచటికొమ్మ విఱిగి తాను పడుటను మాత్రము గమినించుట లేదఁట. అట్లే- తుచ్ఛకామసుఖ మనుభవించు నిచ్ఛచే చేయరాని పనులలో నడుగిడుటయేగాని మూఢులు దానివలన సంభవించు నరకమును మాత్రము గుర్తించరు. దీనినే "మధు పశ్యసి దుర్బుద్ధే ప్రపాతం కిం పశ్యసి" అనియు నందురు.
రంగదభంగ రణరంగ కళాభిషంగ చండముండాసురప్రకాండ ఖండ నోద్దం డాఖండల వేదండ తుండాయమాన భుజాదండ మండిత మండలాగ్ర రోచిః ప్రకీర్ణ బ్రహ్మాండ కరండే! చాముండే!
అర్థం
రంగత్= ప్రకాశించే; అభంగ =భంగము లేని;  రణరంగ= యుధ్ధరంగ ;  కళ+అభిషంగ = కళను చేరిన ; చండముండాసురప్రకాండ = చండముండులను;అసుర= రాక్షసులను ;ప్రకాండ= చెట్టు బోదెలను( శ్రేష్ఠుడు);  ఖండన= ఖండించుట యందు;ఉద్దండ= అఖండల= ఇంద్రునియొక్క ;  వేదండ= ఐరావతమును తుండాయమాన =తొండమును లాగి సాగదీయుటలో ;  భుజాదండ = భుజదండముతో; మండిత=అలంకరింపబడిన మండలాగ్ర = కత్తి యొక్క ; రోచిః = వెలుగులో ;ప్రకీర్ణ = వ్యాపించిన ; బ్రహ్మాండ= బ్రహ్మాండమను ;  కరండే  =భరణి కలదానా  ! చాముండే=  చాముండాదేవీ !
            తాత్పర్యము
          చాముండాదేవీ ! యుధ్ధరంగ కళలో ఆరి తేరిన  శుంభనిశుంభుల సేవకులయిన చండముండులను రాక్షసుల చెట్టు బోదెలను నువ్వు  ఖండించే సమయములో  ఇంద్రునియొక్క  ఐరావతము ఉత్సాహంతో తొండమును లాగి సాగదీసింది.నీ   భుజదండమును  అలంకరించిన నీ   కత్తి యొక్క  వెలుగులో  ఈ బ్రహ్మామ్డమంతా వ్యాపించి ఒక  భరణి అయినది.

యుగవిగమావసర సముద్భూత ప్రవాత సంఘాత జీమూత మధ్య ధగద్ధగాయమాన సౌదామినీ ద్యుతి వినిర్మితి కోమల సంహనన విశేషే! అపహృత దోషే!
అర్థం
యుగ= యుగ ; విగమ+అవసర= నాశన సమయములో సముద్భూత= పుట్టిన;  ప్రవాత = ప్రచండ మారుత ; సంఘాత= గట్టి దెబ్బ, సమూహము ;జీమూత మధ్య = మబ్బుల  మధ్య;  ధగద్ధగాయమాన= ధగద్ధగాయమానముగావెలుగు ;  సౌదామినీ= మెరుపుల ;  ద్యుతి= కాంతితో;  వినిర్మితి= చక్కగా నిర్మింపబడిన;  కోమల సంహనన విశేషే! = కోమలమైన శరీర విశేషము కలదానా ! అపహృత దోషే! = పోగొట్టబడిన దోషములు కలదానా !
తాత్పర్యము
యుగాంతములో వచ్చే ప్రళయ సమయములో  ప్రచండ మారుతముల తాకిడి చేత  మబ్బుల  మధ్య ధగద్ధగాయమానముగా వెలుగు మెరుపుల కాంతితో  చక్కగా నిర్మింపబడిన  కోమలమైన శరీర విశేషము కలదానా ! పోగొట్టబడిన దోషములు కలదానా !
విశేషము
 రంగ కవి గారి ఈ భావన చాలా కొత్తగా ఉంది.ప్రళయ కాలములోని మెరుపుల కాంతి అనూహ్యం. అటువంటి మెరుపుల కాంతితో  త్రిపుర సుందరీదేవి శరీరము నిర్మింపబడిందట. మళ్లీ ఆ శరీరము కోమలమయినదట. జయహో
అసమసమయ వికసిత కుసుమ కిసలయ మసృణ ఘుసృణ విసరణ చరణాలంకరణ నిపుణ నూపుర కుహురావ లయ యుత కలకంఠ కంఠ కలరవానుకూల పంచమస్వర గ్రామానుకరణ విపంచికా వల్లరీ నినాదామోదిత సకల దిశావకాశే! సుప్రకాశే!
అర్థం
అసమ= సమయము కాని; సమయ = సమయములో ; (శ్రీ విద్యలోని సమయాచారము కూడా ఇక్కడ సూచ్యం. అమ్మ సమయాచార తత్పరా కదా !)వికసిత= వికసించిన;  కుసుమ= పువ్వు యొక్క ;  కిసలయ = చిగురు ; మసృణ = చిక్కని, నున్నని; ఘుసృణ = కుంకుమపువ్వు; విసరణ= వ్యాపించిన;  చరణాలంకరణ= పాదములను అలంకరించిన ;  నిపుణ= నేర్పు కలిగిన ;  నూపుర= అందె;  కుహురావ= కోకిల ధ్వనుల ;  లయ యుత=లయతో కూడిన;  కలకంఠ = కోకిలల; కంఠ కలరవానుకూల=పావురముల ధ్వనులకు అనుకూలముగా పంచమస్వర = పంచమస్వరమునును;గ్రామానుకరణ= షడ్జాదిస్వరమును అనుకరించు విపంచికా= వీణ;  వల్లరీ= తీగ; నినాదామోదిత= నినాదమును ఆమోదించిన;  సకల దిశావకాశే! = అన్ని దిశల వకాశము కలదానా ! సుప్రకాశే!= చక్కటి ప్రకాశము కలదానా !
తాత్పర్యం
అసమ= సమయము కాని; సమయ = సమయములో ; (శ్రీ విద్యలోని సమయాచారము కూడా ఇక్కడ సూచ్యం. అమ్మ సమయాచార తత్పరా కదా !)వికసిత= వికసించిన;  కుసుమ= పువ్వు యొక్క ;  కిసలయ = చిగురు ; మసృణ = చిక్కని, నున్నని; ఘుసృణ = కుంకుమపువ్వు; విసరణ= వ్యాపించిన;  చరణాలంకరణ= పాదములను అలంకరించిన ;  నిపుణ= నేర్పు కలిగిన ;  నూపుర= అందె;  కుహురావ= కోకిల ధ్వనుల ;  లయ యుత=లయతో కూడిన;  కలకంఠ = కోకిలల; కంఠ కలరవానుకూల=పావురముల ధ్వనులకు అనుకూలముగా పంచమస్వర = పంచమస్వరమునును;గ్రామానుకరణ= షడ్జాదిస్వరమును అనుకరించు విపంచికా= వీణ;  వల్లరీ= తీగ; నినాదామోదిత= నినాదమును ఆమోదించిన;  సకల దిశావకాశే! = అన్ని దిశల వకాశము కలదానా ! సుప్రకాశే!= చక్కటి ప్రకాశము కలదానా ! తారాకర తారాధిప తారాద్రి సమీరాశన క్షీరాబ్ధి పటీరాంబుజ హీరాబ్జ సుధాధారా నిభ గౌరద్యుతి విద్యోతమాన యశోవిశాలే! శ్రీబాలే!
తారాకర =నక్షత్రముల సమూహము; తారాధిప = చంద్రుడు; తారాద్రి సమీరాశన క్షీరాబ్ధి=పాలసముద్రము పటీర+అంబుజ = చందనము, పద్మము ; హీర=వజ్రము, అబ్జ= పద్మము;  సుధా= అమృతము, ధారా= కత్తి అంచుతో;  నిభ=సమానమైన గౌరద్యుతి = తెల్లని కాంతితో ; విద్యోతమాన= ప్రకాశించుచున్న యశోవిశాలే!= విస్తారమైన కీర్తి కలదానా !  శ్రీబాలే!= శ్రీ బాలాంబికా ! నమస్కారము.
చిదగ్ని కుండికార్ణవ సంజాత భువనమోహినీ గేహినీ సమస్త కుళ కౌళీ నిగర్భ రహస్యాతి రహస్య పరాపర రహస్య యోగినీ శ్రీమ త్కౌమార గిరీంద్ర సౌవర్ణ ప్రాకార మధ్య విటంక విన్యస్త నిస్తుల ప్రశస్త మణిగణ వ్యాకీర్ణ మండపాభ్యంతర వితర్దికారంగ వలభికాయంత్ర పాంచాలికాయమాన ప్రమథగణ సేవిత శ్రీ త్రిపురాంతకేశ్వరోత్సంగ నివాసే! విశదహాసే!


చిదగ్నికుండికార్ణవ సంజాత= బ్రహ్మ తేజస్సుకు ఒక ఆకారమైన చిత్ అను అగ్నికుండం నుండి పుట్టిన (చిత్’’ అంటే జ్ఞానంప్రతిపదార్ధం వెనుక పదార్ధానికి సంబంధించిన తత్త్వాన్ని  జ్ఞానమంటారు. తత్త్వం          లేకుండా                 పదార్ధం వుండదు. వృక్షం లోని  వృక్షత్వమే దానియొక్క జ్ఞానము. ఇదే  చిత్ అని      పిలువబడుతుంది.)
             భువనమోహినీ = భువనములను మోహింపచేయు; గేహినీ= ఇల్లాలు; సమస్త = సమస్తమైనకులమార్గమును అనుసరించే వారు, , కౌలమును అనుసరించే వారిని (కులమంటే వ్యష్టి కుండలినిని సమిష్టిచైతన్యం అయిన పరమశివునితో అనుసంధానించే మార్గం.దీనినే 'కౌలమార్గం' అని కూడా అంటుంటారు కౌలముఅంటే  భోగము , యోగము కలిపి ఆచరించే మార్గం)  నిగర్భ రహస్యాతి రహస్య పరాపర            రహస్య యోగినీ=అనేక రహస్యములు కలిగిన యోగినులు కలది;   శ్రీమత్కౌమార= శోభావంతమైన  కౌమారగిరి  పర్వత శ్రేష్ఠము యొక్కసౌవర్ణ ప్రాకార మధ్య = బంగారు ప్రాకారముల మధ్య ఉన్న విటంక= ఇంటి ముంజూరునందలి గువ్వగూడులో ;  విన్యస్త = ఉంచబడిన
నిస్తుల= సాటిలేని;  ప్రశస్త= ప్రశస్తమైన;  మణిగణ= మణి సమూహములతో  వ్యాకీర్ణ = చెదిరిన; మండపాభ్యంతర= మండపములోపలి ;  వితర్దికా= అరుగు ; రంగ = నాట్య స్థానములోని ; వలభికాయంత్ర = చంద్రశాల యంత్రములతో ;             పాంచాలికాయమాన= బొమ్మలుగ చేయబడిన ప్రమథగణ సేవిత= ప్రమథ గణములచే  సేవింపబడు;  శ్రీ త్రిపురాంతకేశ్వర= త్రిపురాంతకుడైన పరమశివుని యొక్కఉత్సంగ నివాసే= తొడపై  నివాసము కలదానా !      విశదహాసే! = స్పష్టమయిన నవ్వు కలదానా !
సకల సుకవి వర్ణిత మృదుమధుర కవితా రచనాధురీణ భారతులాన్వయాంభోధి తుహినకర రంగయాభిధా నాంగ నాదెమాంబికా గర్భశుక్తి మౌక్తికాయమాన శ్రీరంగకవి విరచిత గద్యపద్యానుమోద మానసాంభోజే! నత సురసమాజే!
 శ్రీ త్రిపురాంబికాభిధే యావతీర్ణ జగదంబే! అధరజితబింబే! పులిన నితంబే!

శ్రీశ్రీ త్రిపురాంబే! సదామాం పాహి, మాం పాహి.
సకల సుకవి వర్ణిత= సమస్త సుకవులచే వర్ణించబడిన;  మృదుమధుర కవితా రచనాధురీణ= మృదుమధురమైన  కవితా రచన చేయుటలో  నేర్పరి యయిన; భారతులాన్వయాంభోధి = భారతుల వంశమనెడి సముద్రమునకు; తుహినకర = చంద్రునివంటి వాడయిన ; రంగయాభిధాన = రంగయ అను పేరు కలిగిన వాని అంగన= స్త్రీ అయిన (భార్య ఆయిన) ఆదెమాంబికా= ఆదెమ అను తల్లియొక్క  గర్భ శుక్తి మౌక్తికాయమాన =గర్భమనెడి ముత్యపు చిప్పలో ముత్యములా ప్రభవించిన ;  శ్రీరంగకవి విరచిత= శ్రీ రంగ కవి అను నేను రచించిన   గద్యపద్యఅనుమోద= గద్య పద్యలచే సంతోషింపబడిన;  మానసాంభోజే!= మనస్సను పద్మము కలదానా !  నత సురసమాజే!= నమస్కరించిన దేవతా సమూహము కలదానా !
           
 శ్రీ త్రిపురాంబికాభిధేశ్రీ త్రిపురాంబిక అను పేరు కలదానా !   శ్రీ యావతీర్ణ జగదంబే! =సమస్త ప్రఅపంచానికీ జననీ ! అధరజితబింబే= పెదవుల చేత జయింపబడిన దొండపండు కలదానా !  పులిన నితంబే= ఇసుకదిబ్బలవమ్టి నితంబములు కలదానా !
 శ్రీశ్రీ త్రిపురాంబే! =  శ్రె త్రిపురాంబికా దేవీ ! సదా= ఎప్పుడూ ; మాం= నన్ను  పాహి= రక్షించు, మాం పాహి.= నన్ను రక్షించు

           
త్రిపురసున్దర్యష్టకమ్

కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్|
నవామ్బురుహలొచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||||

    కదంబవృక్షములు (కడిమి చేట్లు) వనమందు నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు (ఆనందింప చేయు) మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఏత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ,తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను.

కదమ్బవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్|
దయావిభవకారిణీం విశదరొచనాచారిణీం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||||

    కదంబవనమందు నివసించునదీ, బంగారు వీణను ధరించినదీ, అమూల్యమైన మణిహారముల నలంకరించుకున్నదీ, ముఖము నందు వారుణీ (ఉత్తమమైన మద్యము) పరిమళము కలదీ,అత్యధికమైన దయను కురిపించునదీ, గొరొచనము పూసుకున్నదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సున్దరిని ఆశ్రయించుచున్నాను.

కదమ్బవనశాలయా కుచభరొల్లసన్మాలయా
కుచొపమితశైలయా గురుకృపాలసద్వేలయా|
మదారుణకపొలయా మధురగీతవాచాలయా
కయాపి ఘనలీలయా కవచితా వయం లేఏలయా||||

    కదంబవనములొనున్న ఇంటిలొ నివసించునదీ, వక్షొజములపై పుష్పమాలనలంకరించుకున్నదీ, పర్వతములవలే ఏత్తైన స్తనములు కలదీ, అధికమైన కృపాసముద్రమునకు తీరము వంటిదీ, మద్యముచే ఏర్రనైన చేంపలు కలదీ, మధుర సంగీతమును గానము చేయు చున్నదీ, వర్ణించనలవి కానిదీ, మేఘము వలే నల్లనైనదీ అగు ఒక లీలచే మనము రక్షించబడుచున్నాము.

కదమ్బవనమధ్యగాం కనకమణ్డలొపస్థితాం
షడమ్బురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్|
విడమ్బితజపారుచిం వికచచన్ద్రచూడామణిం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||||

    కదంబవన మధ్యమునందున్నదీ, బంగారు మండపము నందు కొలువు తీర్చునదీ మూలాధారము-స్వాదిష్ఠానము-మణిపూరము-అనాహతము-విశుద్దము-ఆజ్ఞ అనే ఆరుచక్రములందు నివసించు నదీ, ఏల్లప్పుడు యొగసిద్దులకు మేరుపు తీగవలే దర్శనమిచ్చునదీ, జపాపుష్పము (మంకేన పువ్వు) వంటి శరీర కాంతి కలదీ, శిరస్సుపై చంద్రుని ఆభరణముగా ధరించునదీ, మూడు కన్నులు గల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసున్దరిని ఆశ్రయించుచున్నాను.

కుచాఞ్చితవిపఞ్చికాం కుటిలకున్తలాలఙ్కృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్|
మదారుణవిలొచనాం మనసిజారిసమ్మొహినీం
మతఙ్గమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే||||

    వక్షస్థలము నందు వీణ కలదీ, వంకరయైన కేశములతొ అలంకరింపబడినదీ, సహస్రార పద్మము నందు నివసించునదీ, దుష్టులను ద్వేషించునదీ, మద్యపానముచే ఏర్రనైనకన్నులు కలదీ, మన్మథుని జయించిన శివుని కూడ మొహింపచేయునదీ, మతంగమహర్షికి కుమార్తేగా అవతరించినదీ, మధురముగా మాట్లాడునదీ అగు త్రిపురసున్దరిని ఆశ్రయించుచున్నాను.


స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరమిన్దునీలామ్బరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాఞ్చలామ్|
ఘనస్తనభరొన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||||

    ప్రథమరజస్వలయై ఆరక్తబిందువు లంటియున్న నల్లని వస్త్రమును ధరించినదీ, మద్యపాత్రను పట్టుకున్నదీ, మద్యపానముచే ఏర్రనై కదలుచున్న కన్నులు కలదీ, ఉన్నతమైన స్తనములు కలదీ, జారుచున్న జడముడి కలదీ, శ్యామల (నల్లనిది) యైనదీ, మూడు కన్నులు గల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసున్దరిని ఆశ్రయించుచున్నాను.

సకుఙ్కుమవిలేపనామలికచుమ్బికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్|
అశేషజనమొహినీమరుణమాల్యభూషామ్బరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్||||

    కుంకుమతొ కలిసిన విలేపమును పూసుకున్నదీ, ముంగురులను తాకుచున్న కస్తూరీ తిలకమును ధరించినదీ,చిరునవ్వుతొ కలిసిన కన్నులు కలదీ, పుష్పభాణమును-చేరకువింటినీ-పాశాంకుశములను ధరించినదీ, అశేష జనులను మొహింపచేయునదీ, ఏర్రని పూలదండలను-ఆభరణములను-వస్త్రములను ధరించినదీ, జపాపుష్పము వలేప్రకాశించుచున్నదీ అగు జగదంబను జపము చేయునపుడు స్మరించేదను.

పురందరపురంధ్రికాచికురబన్ధసైరంధ్రికాం
పితామహపతివ్రతాపటుపటీరచర్చారతామ్|
ముకున్దరమణీమణీలసదలఙ్క్రియాకారిణీం
భజామి భువనామ్బికాం సురవధూటికాచేటికామ్||||

    ఇంద్రుని భార్యయగు శచీ దేవిచే కేశాలంకరణ చేయబడినదీ, బ్రహ్మదేవుని భార్యయగు సరస్వతిచే మంచి గంధము పూయబడినదీ, విష్ణుపత్నియగు లక్ష్మీచే అలంకరింపబడినదీ, దేవతాస్త్రీలు చేలికత్తేలుగా కలదీ యగు జగన్మాతను సేవించుచున్నాను.                            జయ జయ శంకర హర హర శంకర

                            జయ జయ శంకర హర హర శంకర


No comments: