Sunday, September 4, 2016

ఆకుపచ్చని మొక్కకు అంజలింతు my salutations to greenary

ఆకుపచ్చని మొక్కకు అంజలింతు
1.      ఆకుపచ్చని తోటలో ఆటలాడి
ఆకుపచ్చని మాటలో హాయినొంది
ఆకుపచ్చని కైతలో అలుపు వీడి
ఆకుపచ్చని మొక్కకు అంజలింతు

2.      ప్రకృతికిని నీకు నెప్పుడు బంధమనుచు
“వేరు” కావద్దని పలికె “వేరు” నాకు
నరికినను లేత చిగురుల నవ్వుమనుచు
చెలిమి టాకుల నేర్పెను చిగురు నాకు.

3.     వానకు నాధారము;చి
త్తానికి నాహ్లాదము; సుఖ దాయకము; సుధా
గాన వినోదము; మమతా
ధ్యానోద్యానము; తరువును తలచుచు కొలిచెదన్

4.     ఒక మౌని కదలుచు ఉపదేశము చేసె
కాదు కాదది అకు కదలిక అది
ఒక దాత నవ్వుచు యుడుగరలొసగెను
కాదు కాదది పండు కరుణ అది
ఒకశిల్పి అందాల నొకచోట చెక్కెను
కాదు కాదది పూల కలిమి అది
ఒక అమ్మ ఎండకు నోర్చి నీడ నొసగె
కాదు కాదది చెట్టు ఘనత అది
చదువగలిగిన వారికి చదువుల గుడి;
కవితలల్లెడివారికి కవితల సడి;
మౌన మంత్రాక్షరాలకు మలుపుల మడి;
చెట్టు కాదది మమతల మెట్టు కాని

5.     పలికె “చెట్టంత కొడుకను” పసిడి మాట;
పలికె “చేతులు కాలిన” పసిడి మూట;
నా తెలుగు భాష లో చెట్టు నాదమయ్యె

చెట్టు లేక భాషయు లేదు; జీవితమది

No comments: