Thursday, November 3, 2016




కార్తిక  శివకేశవారాధన-04

ఇద్దరూ రమణులే. ఒకరు ‘మా’ రమణులు. ఇంకొకరు ‘ఉమా’ రమణులు అంటూ  శివ కేశవులను ఒకే శ్లోకంలో కవి నుతిస్తున్నాడు. ఆ శ్లోక అర్థ తాత్పర్యాలు తెలుసుకొందాం.

మారమణ ముమారమణం
ఫణధరతల్పం ఫణాధరాకల్పం
ముర మథనం పుర మథనం
వందే బాణారి మసమ భాణారిం

ప్రతి పదార్థము
మారమణమ్= లక్ష్మీపతి  ఆయిన విష్ణువుని (లోకమాత అను పేరున లక్ష్మికి  మా అని ఏకదేశగ్రహణము. ఆమెకు ఇష్టుడు              కనుక విష్ణువు మా రమణుడు)

ఉమారమణం= పార్వతి పతి అయిన శివుని

ఫణధరతల్పం=ఆదిశేషుని పై శయనించిన విష్ణువుని(పడగను ధరించునది  కనుక పాముకు ఫణధరము అనిపేరు)

ఫణధరాకల్పం= పాములను  శరీరములపై అలంకారముగా చేసుకొన్న శివుని

ముర మథనం = మురుడను రాక్షసుని సంహరించిన విష్ణువుని

పుర మథనం= రాక్షసులచే  నిర్మితమైన మూడు పురాలను ధ్వంసం చేసిన శివుని .

బాణారిమ్బాణాసురుని చంపిన విష్ణువుని

అసమ భాణారిం= బేసి బాణములు కల   మన్మథుని చంపిన శివుని .

వందేఇరువురిగా కనిపించే  ఒకే రూపానికి నమస్కారము.

తాత్పర్యము

లక్ష్మీపతి  ఆయిన విష్ణువు ఆదిశేషుని పై శయనించితే పార్వతి పతి అయిన శివుడు పాములను  శరీరములపై అలంకారముగా చేసుకొన్నాడు.

విష్ణువు  మురారి  (మురుడను రాక్షసుని సంహరించినవాడు) శివుడు  పురారి (అసుర నిర్మితమైన మూడు పురాలను ధ్వంసం చేసిన వాడు).

విష్ణువు  బాణాసురుని చంపినవాడు.  శివుడు  మన్మథుని చంపినవాడు

ఇరువురిగా కనిపించే  ఒకే రూపానికి నమస్కారము.

No comments: