Monday, October 31, 2016

                                              శివకేశవులు ఇద్దరూ ఒకటే .........ఇద్దరికి ఒకటే శ్లోకం
శివునికి ప్రయోగించిన విశేషణాల్లోని మొదటి అక్షరాలు తీసివేస్తే విష్ణు దేవుని విశేషణాలు వచ్చేటట్లు ఒక కవి రచించిన
అద్భుతమయిన శివకేశవ శ్లోకాన్ని స్మరించుకొందాం.
పన్నగధారి కరాగ్ర: గంగోమా లక్షితోజ్గదాగ్ర భుజ: శశి
ఖండ శేఖర ఉమా పరిగ్రహో ముహురనాది రవతు త్వామ్.
శివ పరంగా అర్ధం
పన్నగధారి                                                             =    పామును ధరించిన వాడు (పన్నం పతితం యథాతథా గచ్చతీతి పతంగః-                                                                 పడినట్టుగా పోవునది కనుక పాముకు పన్నగమని పేరు)
గంగో మా లక్ష్మిత: = గంగా + ఉమా లక్షిత:         =    గంగా పార్వతులు కోరుకొన్న వాడు
అంగదాగ్ర భుజ: =అంగద+అగ్రభుజః                  =    భుజాల మీద బాహుపురులు - కేయూరాలుధరించిన వాడు
శశిఖండ శేఖర:                                                      =    చంద్ర రేఖను అలంకారంగా ధరించిన వాడు.
ఉమా పరిగ్రహ:                                                      =     పార్వతిని భార్యగా స్వీకరించిన వాడు
 అనాది:                                                                   =     పుట్టుక లేని వాడు  అయిన శివుడు
ముహు:, త్వామ్ అవతు                                     =      ఎప్పుడూ    మిమ్ము కాపాడు గాక !   

భావం:
చేతిలో పామును ధరించిన వాడూ, గంగా, పార్వతులకు ఇష్టమైనవాడు , భుజాల మీద  బాహుపురులు ధరించిన వాడూ, చంద్ర రేఖ తల మీద అలంకారంగా కల వాడూ , పార్వతీ దేవి తన అర్ధాంగిగాకల వాడూ, పుట్టుకేలేనివాడు  అయిన శివుడూ  ఎప్పుడు  మిమ్ములను కాపాడు గాక !.
శ్లోకంలో శివుడికి  చెప్పిన విశేషణ పదాలలో మొదటి  అక్షరాలను తొలిగిస్తే  విష్ణు వర్ణన
కరాగ్ర: నగధారి                       =       గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడు(పన్నగధారిలో “పత్ తీసివేయాలి)
 గో                           =      ఆవుల చేత, (గంగో మా లక్షిత:లో “గం “తీసివేయాలి)
మా                                         =       లక్ష్మీదేవి చేత
లక్షిత:                                     =       కోర బడిన వాడు ( అంటే, గోవులకు , లక్ష్మీ దేవికి ప్రభువు     అయిన వాడు )
 గద: అగ్ర భుజ:                     =       భుజం మీద కౌమోదకి అనే గదను ధరించిన వాడు (అంగదాగ్ర భుజఃలో “అం తీసివేయాలి)
శిఖండ శేఖర:                         =        శిరసున నెమలి పింఛం ధరించిన వాడు (శశిఖండ శేఖరః లో “శ తీసివేయాలి)
మా                                         =      లక్ష్మీదేవిని (ఉమా పరిగ్రహః లో “ఉ తీసివేయాలి)
పరిగ్రహ:                                 =      భార్యగా స్వీకరించిన వాడు
అనాది:                                   =      ( శివ విశేషణాల్లోని మొదటి అక్షరాలు తీసివేయగా మిగిలిన ) విష్ణువు ,       పుట్టుక లేని వాడు అయిన                                                        విష్ణువు
ముహు: , త్వామ్, అవతు =      సదా మిమ్ము కాపాడు గాక !
 భావం:
గోవర్ధన పర్వతాన్ని ధరించిన వాడు,  అవులకు, లక్ష్మీ దేవికీ ప్రభువు, భుజాన గద, తల మీద నెమలి పింఛాన్నీధరించిన వాడు, లక్ష్మి దేవికి  భర్త మరియూ , పుట్టుక లేని వాడూ అయిన  మహా విష్ణువు మిమ్ములనుఎప్పుడూ రక్షించు గాక !

                             ఈ కవి ఎవరో తెలియదు. నమస్సులు.

Wednesday, October 26, 2016

శ్రీ దుర్గా సప్తశ్లోకీ

శివ ఉవాచ-
దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని |
కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ||
దేవ్యువాచ-
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ |
మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ||
ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః,
శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః |
ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా |
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || ౧ ||
దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి |
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా || ౨ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోzస్తు తే || ౩ ||
శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోzస్తు తే || ౪ ||
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోzస్తు తే || ౫ ||
రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి || ౬ ||
సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ || ౭ ||
ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ సంపూర్ణా |

-------------------------చమత్కారమైన కోరిక------------------------
అంధం,దరిద్రం ప్రియయా విహీనం
వీక్షేశ్వరే వదతి యాచ వరం త్వమేకం
నేత్రేణ నాపి వసునో,వనితాం నవిప్రే
ఛత్రాభిరామ సుత దర్శనమిత్య వోచత్
ఒకసారి పరమేశ్వరుడు మహా సంతోషంగా వున్నాడు.పార్వతీదేవి తో సహా భూలోకానికి
వచ్చాడు.యిద్దరూ అలా సరదాగా తిరుగుతున్నారు.బాధపడుతున్న వారెవరైనా కనబడితే
వారికి ప్రత్యక్షమై కోరిన వరాలిస్తున్నాడు.వారికి దారిలో ఒక దరిద్రుడు గుడ్డివాడైన బ్రాహ్మణుడు కనబడ్డాడు..అతనికి భార్యకూడా లేదు..అతన్నిచూసి శివుడికి జాలి కలిగింది.ఒక వరం ఇద్దామనుకున్నాడు.పక్కనే వున్న పార్వతిని సంప్రదించాడు.అతడికి కంటిచూపు యిద్దామనుకున్నాను పార్వతీ ఏమంటావు?అని అడిగాడు.అతడు దరిద్రుడు పైగా భార్య లేనివాడు.కంటిచూపు యిస్తే దయతో దానం చేసేవాళ్ళు కూడా అతనికి దానం చెయ్యరు అంది పార్వతి.పోనీ ధనం యివ్వనా? అన్నాడు శివుడు.ధనం వుంటే గ్రుడ్డివాడు, భార్య లేని వాడు ఏమి చేసుకుంటాడు?అంది పార్వతి.అయితే అందమైన భార్యను యివ్వనా?
అన్నాడు శివుడు దరిద్రుడు,కళ్ళు లేనివాడు అందమైన భార్యను ఏమి చేసుకుంటాడు స్వామీ అని పక పక నవ్వింది పార్వతి.సరేలే వెళ్లి అతనికి ఏమి కావాలో అతన్నే అడుగుదాం పద అన్నాడు శివుడు.అతనికి సమీపంగా వెళ్ళారు.అడుగుల చప్పుడు విని ఎవరు వచ్చింది?అని అడిగాడు అతను. మేము పార్వతీ పరమేశ్వరులము.అన్నాడు.
అతను భక్తితో వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు.అప్పుడు శివుడు నీకు ఒకే ఒక్క వరం యిద్దామని అనుకున్నాను ఏమి కావాలో కోరుకో ఒక్కటే వరమే యిస్తాను సుమా అని రెట్టించాడు
శివుడు.ఆ బ్రాహ్మణుడు బాగా ఆలోచించాడు.ఏదైతే తనకు సుఖమైన జీవితము యిస్తుంది .అని ఆలోచించి స్వామీ అందమైన నాకుమారుడు వాడి భార్యా బిడ్డలతో కూడి రాజ్యము చేస్తూ వుండగా అందమైన నా భార్యతో కలిసి నేను చూడాలి అదే నా కోరిక ఆ వరం ఒక్కటీ ప్రసాదించండి చాలు అన్నాడు.
దానికి .భోళా శంకరుడుసరే అలాగే ఒక్కటేవరమే గా ఇచ్చేశాను.పో అని గర్వంగా పార్వతి వైపు చూశాడు.
చూశావా ఒక్కవరమే యిచ్చాను అన్నాడు.పార్వతి శివుని అమాయకత్వానికీ ,ఆ బ్రాహ్మణుడి తెలివితేటలకీ పకా పకా నవ్వింది.ఎందుకలా నవ్వుతావు?అని కోపంగా అడిగాడు శివుడు.నేనిచ్చినది ఒక్క వరమే కదా! అన్నాడు.మీ ఒక్కవరమే అతనికి అన్నీయిచ్చింది.
కొడుకు కావాలంటే భార్య కావాలి,అతను రాజ్యం చెయ్యాలంటే రాజ్యం , ఐశ్వర్యం.కావాలి,కొడుక్కు భార్య,పిల్లలు అవన్నీ చూడాలంటే అతనికి కళ్ళు కావాలి మరి మీరు ఎన్ని వరాలిచ్చినట్టూ?అతను ఎంత తెలివి గల వాడంటే ఒక్క వరంతోనే అన్నీ సంపాదించుకున్నాడు.అందుకే మీ అమాయకత్వానికి నవ్వు వచ్చింది.అంది పార్వతి
అందుకే మిమ్మల్ని భోళాశంకరుడు అన్నారు.అని చురక అంటించింది పార్వతి.
ఇదీ చమత్కారమైన కోరిక

అన్నమయ్య అక్షర దీపావళి- 01 -05  భాగాలు

అరుదైన క్రిమికీటకాదులందుఁ బుట్టి
పరిభవములనెల్లఁ బడితిఁ గాని
యిరవైనచింత నాఁడింతలేదు యీ-
నరజన్మముకంటె నాఁడే మేలు (01-003)


తాత్పర్యము

జన్మల పరంపరలో భాగముగా అనేక క్రిమి కీటకాదుల జన్మలెత్తి


ఎన్నో అవమానాలు పొందాను కాని


మానవ జన్మలో స్థిరంగా ఉండే చింత పాతజన్మలలో ఇంత లేదు.


మానవ జన్మకంటె ఆనాటి క్రిమి కీటకాదుల జన్మలే మేలు.
అన్నమయ్య అక్షర దీపావళి- 02 (24-10-2016)
పంచేంద్రియములలోని పాప మేమి గలిగినా
అంచెలఁ గామునిఁబోయి అడుగవయ్యా
ముంచిన నాకర్మములో మోసమేమి గలిగినా
మంచితనానఁ జేయించే మాయ నడుగవయ్యా (02-028)
తాత్పర్యము
వేంకటేశా ! నా పంచేంద్రియములచేతలలో వరుసగా, గుంపుగా(అంచెల) నీకు పాపము అని పిస్తే ,నువ్వు వెళ్లి మన్మథుని నిలదీయ్ ! .నా తప్పు ఏమి లేదు. అంతా వాడే చేయిస్తున్నాడు.
కర్మము నన్ను ముంచివేసినది. ఇందులొ మోసమేమన్నా అనిపిస్తేమంచితనముతో నా చేత ఇదంతా చేయిస్తున్న మాయని అడుగు. నాకు మి సంబంధం లేదు.
విశేషాలు
1. పంచేంద్రియములు =
ఐదు కర్మేంద్రియాలు : వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థలు. /ఐదు జ్ఞానేంద్రియాలు : త్వక్కు (చర్మము), చక్షువు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణేంద్రియాలు.
2. కర్మము
కర్మములకు హేతువులు అహంకార మమకారములు. అహంకారము అనఁగా దేహమందు ఆత్మ అను బుద్ధి. మమకారము అనగా తనవిగాని వానియందు తనవి అను బుద్ధి. ఈఅహంకార మమకారములు "అవిద్య" అని చెప్పఁబడుచున్నవి.
ఈశ్వరుఁడు జీవునికి కర్మానురూపముగా శరీరములను ఫలములను ఇస్తున్నాడు. . అనఁగా జీవుఁడు పూర్వజన్మలయందు చేసిన పుణ్యకర్మములను అనుసరించి వివేకముగల మనుష్యాదిజన్మములను పాపకర్మములను అనుసరించి వివేకముచాలని పశువు మొదలైన శరీరములను పొందుచున్నాడు.
కర్మములవలన దేహము కలుగుచు ఉన్నది; దేహముచేత కర్మములు చేయఁబడుచు ఉన్నవి; ఈరెంటిలో ఏదిముందో ఎఱగబడదు. చెట్టువలన విత్తు కలుగుచు ఉన్నది; విత్తువలన చెట్టు కలుగుచు ఉన్నది. ఈరెంటిలో ఏదిముందో తెలియబడదు. అన్నమయ్య దీనినే ప్రశ్నిస్తున్నాడు.
3. మాయ.
తాడును చూసి పాము అని భ్రమపడటం మాయలో పడటం. ‘‘యా నవిద్యతే వస్తుతః సా మాయా’’. వాస్తవంగా ఏది లేదో అది ఉన్నట్లు తోచడం మాయ.
మాఅంటే లేదు, కాదు అనీ, ‘యాఅంటేఏది’ . కనుక ఏది లేదో, ఏది కాదో అది మాయ అని ఒక వివరణ ఉంది.
శంకరాచార్యుల వారుమాయను అచింత్యం అన్నారు. అసత్తూ కాదు, సత్తూ కాదు అని భావం.


అన్నమయ్య అక్షర దీపావళి- 03 (25-10-2016)
          తగు చుట్టరికాలలో ధనమే చుట్టరికము
                జగతిఁ గట్టని కట్టు సంసారము
                వగలైన గుణాలలో వైరమే నిజగుణము
                జిగిఁ బ్రాణులెట్లు గెలిచేరు నీమాయ (03-551)
తాత్పర్యము
          ఓ వేంకటేశా ! చుట్టాలు పక్కాలు అని పైకి చెప్పుకోవటం వరకే. ఈ ప్రపంచంలో ప్రతివారు  అభిమానించే  నిజమైన    చుట్టము   ధనమొక్కటే. చుట్టరికము (స్నేహము) చేసేది ధనముతోనే.
          ఈ ప్రపంచంలో  సంసారంలో   తాడు కనబడదు కాని, కట్టు కట్టబడి ఉంటుంది. ఆ బంధము తప్పించుకోలేము
          మాయలతో ,నటనలతో  ఉండే  మా జీవుల   స్వభావాలలో, ఒకరితో శత్రుత్వము పెట్టుకోవాలనే స్వభావమే నిజమైన
          స్వభావము ( 1. కామము, 2. క్రోధము, 3. లోభము, 4. మోహము, 5. మదము, 6. మాత్సర్యము, 7. దంభము, 8. దర్పము,           9. ఈర్ష్య, 10. అసూయ అనునవి దశ గుణములు)
          కళ్లు జిగేలుమనే మురిపాల కాంతులలో – ఈ జీవులు నీ మాయను ఎల గెలుస్తారయ్యా !

          అన్నమయ్య భావ దీపావళి- 04 (26-10-2016)
వచ్చిన త్రోవెఱఁగము వడిఁ బూర్వకాలమందు
చొచ్చెటి త్రోవెఱఁగము సోదించి విూఁద
కుచ్చిన కర్మములతో గుదియై వేలుకాడేము
హెచ్చి మా బ్రదుకుఁదోవ యీశ్వరుఁడే యెరుఁగు (04-034)
తాత్పర్యము
పూర్వ జన్మలు ఏమి ఎత్తామో ,   మెలిపెట్టిన చిక్కుల దారపుముడి( వడిఏమిటో మాకు తెలియదు. పూర్వజన్మల దారి ఏమిటో  మాకు                 తెలియదు.
ఎంతగా ప్రయత్నించినా  - ప్రవేశించే- రాబోయే జన్మల దారి   మాకు తెలియదు.
కానీ- ఎప్పటికప్పుడు జతచేస్తున్న(కుచ్చిన)   కర్మలను  సూదికి గుచ్చుకొంటూ - (గుదియై) – ఆ జన్మముల సూదికి వేలాడుతున్నాము( వేలుకాడేము)
మా బతుకుల దారి  ఏమిటో - అధికమయిన దయ కలిగిన (హెచ్చి )  వేంకటేశ్వరునికే తెలుసు
         
          అన్నమయ్య అక్షర దీపావళి- 05 (27-10-2016)
          బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా
                బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా
                ఉంగరాలేఁటికినే వొడికిపువేళ్ళ
                వెంగలిమణులు నీ వేలిగోరఁబోలునా(05-002)
తాత్పర్యము
                ఓ వేంకటేశ్వరుని ఇల్లాలా! అలమేలు మంగా!
          నీ శరీరమునిండా బంగారము పెడుతున్నావెందుకు?
          నీ శరీరపు కాంతికి బంగారము  సమానమవుతుందా?
          నీ అందమయిన చేతివేళ్ళకి(వొడికిపువేళ్ళ) ఉంగరాలు  ఎందుకు  పెడుతున్నావే?
          వ్యర్థమయిన (వెంగలి) మణులతో ఉండే  ఆ ఉంగరాలు నీ చేతి వేలి గోటి కాంతికి సరిపోతాయా?
         




         


         





Saturday, October 15, 2016

సారస్వతము( సరస్వతీస్తుతులు- తాత్పర్యములు)-11   16-10-2016
యా వర్ణ, పద, వాక్య, అర్థ గద్యపద్య స్వరూపిణీ
సా మేధా సరస్వతి మాం  క్షిప్రం వాచి నర్తయతు
యా = సరస్వతి;
వర్ణ, పద, వాక్య, అర్థ గద్యపద్య స్వరూపిణీ =అక్షరాలు, పదాలు, వాక్యాలు, ఆర్థాలు, గద్యాలు, పద్యాల  స్వరూపంలో ఉంటుందో
సా మేధా సరస్వతి= మేధాసరస్వతి;
 మాం = నన్ను;
 క్షిప్రం= వెంటనే ,
వాచి = వాక్కునందు;
నర్తయతు = నృత్యము చేయించుగాక
తాత్పర్యము
సరస్వతి అక్షరాలు, పదాలు, వాక్యాలు, ఆర్థాలు, గద్యాలు, పద్యాల  స్వరూపంలో ఉంటుందో
మేధాసరస్వతి  నన్ను వెంటనే  వాక్కునందు నృత్యము చేయించుగాక
(అనగా నాకు చక్కటి వాక్పటిమను ప్రసాదించమని ప్రార్థన.)
విశేషాలు
యా వర్ణ పద వాక్యార్థ స్వరూపేణైవ వర్తతే
 అనాదినిధనా చాంబా సా మాంపాతు సరస్వతీ!(సరస్వతీ రహస్యోపనిషత్) అను శ్లోకం కూడా ఇదే పద్ధతిలో ఉంది.
స్వస్తి.

Wednesday, October 12, 2016


శ్రీలలితా ధీనిహితా దీప్తి శోభితా    తాత్పర్య విశేషాలు   
12-10-2016
Namaste gurugaruu                        
Baunnara                                                 
Chala kalam tarvatha meeku msg cheydam jarugtondi                        
Ivala Sri ganapti sachidananda swamiji ashram lo program unnadi                        
Ikda sudden ga ee paina pampina paata ki cheymaru                        
: Meeru deniki veelaithe artham pampagalaru
                                                                -lalitaha sindhuri
-------------------------------------------------------------------------------------------
శ్రీలలితా ధీనిహితా దీప్తి శోభితా    తాత్పర్య విశేషాలు                    
పల్లవి:
శ్రీలలితా ధీనిహితా దీప్తి శోభితా
విశ్వరూప విలసితా పాతు భావితా
చరణం:
భేదదృష్టి వారణైక దక్ష సుమతిదా
సా విశాల నయనికా కాశికా గతా             …1
కామకోటి భూత మోక్ష దాన సునిపుణా
సా హి కామ నయనికా కాంచికాస్థితా         …2
యా పుం ....నాగ వరా ....ళీ -రివృతిగా
గజలక్ష్మీ కమలగా సైవ భాసురా              …3
దత్తపీఠ మందిరా సౌఖ్య వితరణా
శ్రీగురుర్హి సచ్చిదానంద రూపిణీ                …4
                                                (రాగం: పున్నాగవరాళి తాళం: ఆది)
తాత్పర్యము
శ్రీలలితాదేవీ !  నువ్వు ధీనిహితా  బుద్ధి యందు ఉంచబడినదానివి. నువ్వు కాంతిచే , వెలుగుచే శోభించేదానివి.
నువ్వు ప్రపంచ వ్యాప్తమైన స్వరూపముతో విలసిల్లుదానివి. ధ్యానం వలన తెలియబడు నువ్వు  నన్ను రక్షించెదవు గాక !
విశేషాలు
1. శుశ్రూష, 2. శ్రవణం, 3. గ్రహణం, 4. ధారణ, 5. ఊహ, 6. అపోహ, 7. అర్థజ్ఞానం, 8. తత్త్వజ్ఞానం. ఇవి బుద్ధి ధర్మాలు.
చరణాలు
                                                          1
మా లో  ఉన్న  భేద దృష్టిని పోగొట్టు ఏకైక నేర్పరివి. సద్బుద్ధిని ప్రసాదించుదానివి
అటువంటి ఆ లలితాదేవి విశాలమైన నయనములు  కలిగినదై కాశీ నగరములో విశాలాక్షిగా ఉన్నది.
విశేషాలు
స్వగతం, సజాతీయం, విజాతీయం అనే మూడింటిని భేద త్రయం అన్నారు. ఒక చెట్టుకు కొమ్మలు, పూలు, కాయలు వేర్వేరుగా ఉన్నట్లు ఏకం, ఏవ, అద్వితీయం అనే మూడు పదాలు వేర్వేరైనా ‘‘ఏకమేవాద్వితీయం’’ అనే ఛాందోగ్య శ్రుతి వచనంగా మనకు లభించాయి. ఇందులోఏకం, ‘స్వగతం, ‘ఏవసజాతీయ భేద రాహిత్యం, ‘అద్వితీయంవిజాతీయ భేద రాహిత్యాన్ని సూచిస్తున్నాయి. నాపరాయి, గులకరాయి రెండూ రాళ్లే అయినా వాటిలో తేడా ఉంది. అది సజాతీయ భేదం. రాయి వేరు, చెట్టు వేరు. అది విజాతీయ భేదం.
                                                                2
కామకోటి భూత మోక్ష దాన సునిపుణా
సా హి కామ నయనికా కాంచికాస్థితా  
ఓ లలితాదేవి! సకలచరాచర భూతరాశికి మోక్ష దానము ఇచ్చుటలో నువ్వు చాలా నేర్పరివి
అటువంటి ఆ లలితాదేవి కోరికలను ప్రసాదించే కళ్లతో కాంచీ పురములో మాణిక్యాంబగా ఉన్నది. ఆమె నన్ను రక్షించుగాక !
విశేషాలు    
కామకోటి =కోరికలకు అంచు - కామకోటి. 'జగన్మాతను నమ్మినవారు అన్ని కోరికలను సంపూర్ణంగా పొందుతారు' - అని ఒక అర్థం. కోరికల అవధిని, అనగా 'అంతాన్ని' పొందుతారు. అంటే 'నిష్కామస్థితి' లభిస్తుందని ఇంకొక అర్థం. . కామానికి అంచు మోక్షమే.
                                                                                                3
ఏదేవి   తనచుట్టూ శ్రేష్ఠ పున్నాగములతో  (పున్నాగము=సురపొన్న; ఇంద్రుని యేనుఁగు; పురుషశ్రేష్ఠుఁడు; తెల్లగలువ; ) ఉన్నదో
ఆ ప్రకాశించే కమల గతురాలైన  గజలక్ష్మీ దేవి  నన్ను కాపాడు గాక !
                                                                                                4
దత్తపీఠ మందిరా సౌఖ్య వితరణా
శ్రీగురుర్హి సచ్చిదానంద రూపిణీ      
మా దత్త పీఠమందిరములో కొలువై ఉన్నదానా ! సుఖమును ఇచ్చుదానా !
శ్రీ గురు  సచ్చిదానంద స్వరూపిణీ ! లలితాదేవీ ! నన్ను రక్షించు గాక !
విశేషాలు
సత్‌ + చిత్‌ + ఆనందం. సత్యం, జ్ఞానం, ఆనందం కలసి పరమాత్మ స్వరూపం.
భూత, భవిష్యత్‌, వర్తమానాల వల్ల మార్పు చెందనిదీ, ఎప్పుడూ ఒకే విధంగా ఉండేదీ సత్‌/ సత్తు.
 సచ్చిదానందంలో రెండవదైన చిత్‌/ చిత్తు అంటే ఎరుక.
 నిరుపాధికం, నిరతిశయం, నిరుపమానం అయి ఎప్పటికీ ఉండే సుఖానుభూతి ఆనందం.
దీపానికి ఎరుపు తెలుపుల మిశ్రమ వర్ణం, వేడి, కాంతి ఎలా స్వాభావికంగా కలసి ఉంటాయో అలా సత్తు, చిత్తు, ఆనందం మిళితమై ఉంటాయి. అవి అభిన్నం.
                                      స్వస్తి