Saturday, December 3, 2016

శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థములు 01 నుండి 22 వరకు 

శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-01
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1              

కౌసల్యా సుప్రజా రామ   = కౌసల్యాదేవి యొక్క చక్కటి సంతానమైన ఓ శ్రీ రామా !
పూర్వా సంధ్యా           = తూర్పు దిక్కున సంధ్య
ప్రవర్తతే                    = కలుగుచున్నది(తూరుపు తెల్లవారుచున్నది)
నరశార్దూల                = ఓ పురుషోత్తమా !
ఉత్తిష్ఠ                      = లెమ్ము.( మేలుకొను)
దైవం                       = దైవ సంబంధమైన
ఆహ్నికమ్‌                = పగటి వేళ  చేయదగిన పూజ మొదలైన  కార్యక్రమములు
కర్తవ్యం                    = చేయవలెను

తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.

శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-02

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ

ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు


గోవింద           =  ఓ గోవిందుడా !
ఉత్తిష్ఠ                      = లెమ్ము
గరుడధ్వజ                = గరుడ పక్షి జెండాగా కలిగిన ఓ దేవా !
ఉత్తిష్ఠ                      = లెమ్ము
కమలాకాన్త               =లక్ష్మీదేవికి ఇష్టమైన ఓ వేంకటేశా !
 త్రైలోక్యం                  = మూడు లోకములకు
మంగళం                  = శుభమును
కురు                       = చేయుము.
త్రి-లోకములు :
1. భూలోకము, 2. స్వర్గలోకము, 3. పాతాళ లోకము.
1. మనుష్య లోకము, 2. పితృలోకము, 3. దేవలోకము.

తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము.

శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-03

మాతః సమస్త జగతాం మధుకైటభారే:

వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే

శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌


సమస్త జగతాం            = సమస్త లోకములకు
మాతః                     = తల్లివియు;
మధుకైటభారే:             = మధువు, కైటభుడు అను రాక్షసులకు
                              శత్రువైన విష్ణుమూర్తి యొక్క
వక్షో విహారిణి              = రొమ్మున విహరించుదానవును;
మనోహర దివ్యమూర్తే    = మనోహరము, దివ్యము అగు ఆకారము కలదానివియు;
శ్రీస్వామిని                 = పూజ్యురాలవగు యజమానురాలవును;
శ్రితజనప్రియ దానశీలే    = శరణు కోరిన ప్రజల ప్రియములను
                                అనగా కోరికలను ఇచ్చు స్వభావము కలదానవునుఅగు;
శ్రీ వేంకటేశ దయితే       = శ్రీ వేంకటేశ్వరుని ప్రియురాలవైన ఓ లక్ష్మీదేవీ!
తవ                        = నీకు
సుప్రభాతమ్‌              = శుభోదయము (అగుగాక !)

విశేషాలు
14  లోకములు
          భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము - ఈయేడును           ఊర్ధ్వలోకములు.

          అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము - ఈ యేడును అధోలోకములు
త్రి-లోకములు :
          (అ.) 1. భూలోకము, 2. స్వర్గలోకము, 3. పాతాళ లోకము.
          (ఆ.) 1. మనుష్య లోకము, 2. పితృలోకము, 3. దేవలోకము.



తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక.


శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-04

తవ సుప్రభాత మరవిందలోచనే

భవతు ప్రసన్న ముఖచంద్రమండలే

విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే

వృషశైలనాద దయితే దయానిధే. 4


అరవిందలోచనే                     = పద్మముల వంటి కన్నులు కలదానా !
ప్రసన్న ముఖచంద్రమండలే      =చంద్రబింబముతో సమానమైన
                                       ప్రసన్నమయిన మోము కలదానా !
విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే      = బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు – వీరల భార్యలగు
                                                సరస్వతి, పార్వతి, పులోమజలచే
                                                పూజింపబడుదానా !
వృషశైలనాథ దయితే              = వృషభ పర్వత ప్రభువైన శ్రీవేంకటేశ్వరుని
                                                ప్రియురాలివయిన లక్ష్మీదేవీ !
దయానిధే                           = దయకు పెన్నిధియైనదానా !
తవ                                  = నీకు
సుప్రభాతమ్‌                        = శుభోదయము
భవతు                               = అగుగాక !



విశేషాలు
అరవిందము

వ్యు. అరాకారాణి పత్రాణి విందతి - అరం = శీఘ్రం లిప్సాం విందతి వా-

అర + వింద్‌ + శః (కృ.ప్ర.)

బండికంటియాకులవంటి రేకులుకలది (లేక) శీఘ్రముగా మక్కువ కలిగించునది. ( తామర, పద్మము)


తా. కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖమును గల ఓ లక్ష్మీదేవీ! నిన్ను సరస్వతి, పార్వతి, శచీదేవి పూజించుచుందురు. శ్రీవేంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు నీకు సుప్రభాతమగు గాక.


శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-05

అత్ర్యాదిసప్తఋషయస్సముపాస్య సంధ్యా

మాకాశ సింధు కమలాని మనోహరాణి

ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్‌

ప్రతి పదార్థము

అత్ర్యాదిసప్తఋషయః     = అత్రి మొదలయిన సప్త ఋషులు
సంధ్యాం                   = ప్రాతస్సంధ్యావందనమును
సముపాస్య                = ఉపాసన చేసి అనగా సంధ్య వార్చి
మనోహరాణి               = మనస్సును హరించునవైన
అకాశ సింధు కమలాని = ఆకాశగంగలోని పద్మములను
ఆదాయ                             = గ్రహించి
పాదయుగం               = మీ  రెండు పాదములను
అర్చయితుం              = పూజించుటకు
ప్రపన్నాః                   = భక్తితో శరణము కోరి వేచి ఉన్నారు.
శేషాద్రి శేఖర విభో         =శేషాద్రి శిఖరములో ఉన్న  ఓ వేంకటేశ్వరా !
తవ                        = నీకు
సుప్రభాతమ్‌              = శుభోదయము

విశేషాలు
సప్తర్షులు

మరీచి, అంగిరసుఁడు, పులహుఁడు, వసిష్ఠుఁడు, అత్రి, పులస్త్యుఁడు, క్రతువు అనువారు సప్తర్షులు
కశ్యపుఁడు, అత్రి, భరద్వాజుఁడు, విశ్వామిత్రుఁడు, గౌతముఁడు, జమదగ్ని, వసిష్ఠుఁడు అనువారు ఏడ్వురును సప్తర్షులు అని కొందఱు చెబుతారు.
తా. అత్రి మున్నగు సప్తమహర్షులను తమ చక్కని సంధ్యావందనమును ముగించి, ఆకాశగంగ యందలి చక్కని కమలములను తెచ్చి నీ పాదములను చూజించుటకు వచ్చియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-06
పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా:
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి
భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్‌
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌
ప్రతి పదార్థము
పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా:   = మహేశ్వరుడు, బ్రహ్మ, కుమారస్వామి,                                                                                       మహేంద్రుడు మొదలగు వారైన
విబుధాః                             = దేవతలు ;
త్రైవిక్రమాది చరితం       = మీ త్రివిక్రమావతారాది సంబంధమైన చరిత్రను
స్తువంతి                             = స్తోత్రము చేయుచున్నారు.
భాషాపతిః                           = బృహస్పతి
వాసరశుద్ధిమ్             = తిథి వారాది నక్షత్ర యోగ కరణాది దిన శుద్ధిని
ఆరాత్‌                     =దగ్గరనే
పఠతి                                = చదువుచున్నాడు.
శేషాద్రి శేఖరవిభో          =ఓ వేంకటాచలపతీ !
తవ                                  = నీకు
సుప్రభాతమ్‌              = శుభోదయము
విశేషాలు
పంచాననుఁడు = శివుడు
సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అను ఐదు ముఖములున్నవాఁడు
షణ్ముఖుఁడు=కుమారస్వామి.
ఆఱు తలలు గలవాఁడు.
వాసవుడు= ఇంద్రుడు
రత్నములు కలవాడు
త్రివిక్రముఁడు =విష్ణువు.
మూడులోకములను మూడడుగులుగా కొలచుట త్రివిక్రమ చరిత్ర
తా. శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.


శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-07

ఈషత్ర్పఫుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రుమాది సుమనోహర పాళికానాం

ఆవాతి మందమనిల స్సహ దివ్యగంధైః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌
ప్రతి పదార్థము
ఈషత్            = కొంచెముగా
ప్రఫుల్ల           = వికసించిన
సరసీరుహ                = తామరల యొక్కయు
నారికేళ          = కొబ్బరి
పూగ                       = పోక (వక్క)  మొదలైన 
ద్రుమాది                   = మొదలైన చెట్ల యొక్కయు
సుమనోహర     = బాగా మనోహరములైన
పాళికానాం                = మోవులయొక్కయు
                               (లేఁత ఆకుల మొలకమొత్తము లేదా మొలకను మోవు అంటారు)
దివ్యగంధైః సహ =దివ్యమైన పరిమళములతో కలిసి
అనిలః            = వాయువు
మందం          = మెల్లగా
ఆవాతి           = వీచుచున్నది
శేషాద్రి శేఖరవిభో = ఓశేషాచల పతీ !
తవ                        = నీకు
సుప్రభాతమ్‌     = శుభోదయము

విశేషాలు
పోఁక =వక్క.
Areca catechu, the areca or betel-nut tree
దీని భేదములు కారుపోఁక, తోఁటపోఁక మొ


తా. కొంచెం వికసించిన తామరపూల యొక్క, కొబ్బరి, పోక మున్నగు చెట్ల అందమైన మోవుల యొక్క సువాసనలతో మలయమారుతము మెల్లగా వీచుచున్నది. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-08

ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః

పాత్రావశిష్ట కదలీఫల పాయసాని

భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌



ప్రతిపదార్థము

ఉత్తమ పంజరస్థాః        = శ్రేష్ఠములైన, గొప్పవైన పంజరములలో ఉన్న
కేళిశుకాః                  = ఆటకొరకు ఉంచబడిన చిలుకలు(పెంపుడుచిలుకలు)
నేత్ర యుగమ్             = రెండు కన్నులను
ఉన్మీల్య                    = బాగుగా తెరిచి
పాత్రావశిష్ట కదలీఫల పాయసాని= పాత్రయందు ఇదివరకు తినగా మిగిలిన
                              అరటి పండ్లను, పాయసములను
భుక్త్వా            = తిని
అథ                        = అటుపిమ్మట
సలీలమ్                   = విలాసముగా
పఠంతి                     = పాడుచున్నవి
శేషాద్రి శేఖరవిభో          = ఓశేషాచల పతీ !
తవ                        = నీకు
సుప్రభాతమ్‌              = శుభోదయము



తా. ఓ శేషశైలపతీ! చక్కని పంజరములలో వున్న పెంపుడు చిలుకలు తా మిదివరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలియున్న అరటిపండ్లను, పాయసమును తిని వాలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక!


శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-09

తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా

గాయన్త్యనంత చరితం తవ నారదో౽పి

భాషాసమగ్ర మసకృత్కర చారరమ్యం

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 9

ప్రతిపదార్థము

శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-09
నారదో౽పి                                    = నారద మహర్షి కూడా
తంత్రీప్రకర్ష మధురస్వనయా      = తంత్రులయొక్క పట్టుచే మధురమైన శబ్దము కలిగిన
విపంచ్యా                                      = ఏడు తంతులు కలిగిన విపంచి అను వీణా వాయిద్యముతో
భాషాసమగ్ర మ్                     =భాషచే సమగ్రమైన, లేదా భాషా మయమైన
అసకృత్కర చారరమ్యం            = మాటిమాటికి చేతి ఆడింపులచే అందమయిన
తవ                                            = నీయొక్క
అనంత చరితం                     =తుదిలేని చరిత్రను
గాయతి                             = గానము చేయుచున్నాడు.
శేషాద్రి శేఖరవిభో                            = ఓశేషాచల పతీ !
తవ                                           = నీకు
సుప్రభాతమ్‌                        = శుభోదయము

తా. ఓ అనంతా! నారదుడు కూడ మధురముగా ధ్వనిచేయు తన వీణ తీగలను మీటుచు, పెక్కు సారులు రమ్యముగా హస్తాభినయముచేయుచు, చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశా! నీకు సుప్రభాతమగు గాక.


శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-10వశ్లో

భృంగావళీచ మకరంద రసానువిద్ధ

ఝంకారగీత నినదైః సహ సేవనాయ

నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 10
ప్రతి పదార్థము
భృంగావళీచ                        = తుమ్మెదల గుంపు కూడా
మకరంద రసానువిద్ధ              = మకరందమను పూల తేనెను
                                                   తాగుట వలన సంబంధించిన
ఝంకారగీత నినదైః సహ          = ఝంకారమను గీతికా
                                                          ధ్వనులతో
సేవనాయ                                     = మిమ్ములను సేవించుటకు
ఉపాంత సరసీకమలోదరేభ్యః      =  సమీపములోని తటాకములలోని
                                                          తామరపూల మధ్యనుండి
నిర్యాతి                              = బయటికి వచ్చుచున్నది
శేషాద్రి శేఖరవిభో                            = ఓశేషాచల పతీ !
తవ                                            = నీకు
సుప్రభాతమ్‌                        = శుభోదయము

తా. మకరందమును త్రాగి విజృంభించిన తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుటకై సమీప సరస్సులలోని కమలములనుండి బయలువెడలి వచ్చుచున్నవి. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగు గా.

శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-11వశ్లో
యోషాగణేన వరదధ్ని విమథ్నమానే

ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషాః

రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 11

శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-11వశ్లో ప్రతిపదార్థము
ఘోషాలయేషు           = గొల్లవారి ఇండ్ల యందు
యోషాగణేన               = స్త్రీల సమూహము చేత
 వరదధ్ని                           = శ్రేష్ఠమయిన పెఱుగు
 విమథ్నమానేసతి                 = చిలుకబడినది అగుచుండగా
దధిమంథన తీవ్ర ఘోషాః = పెఱుగు చిలుకుటవలన కలిగిన
                                                తీవ్రమయిన శబ్దము కలిగిన
 కకుభః                    = దిక్కులును
కుంభాఃచ                            = పెఱుగు చిలుకు కుండలును
రోషాత్                     = రోషము వలన
కలిం                                 = కలహమును
విదధతే                    = సలుపుచున్నవి.( అలా ఉన్నాయని భావము)
శేషాద్రి శేఖరవిభో                   = ఓశేషాద్రి పర్వతములో ఉన్న వేంకటేశ్వరా !
తవ                                  = నీకు
సుప్రభాతమ్‌              = శుభోదయము


తా. ఓ శేషాద్రినాధుడవగు ఓ వేంకటేశ్వరా! గొల్ల పల్లెలలోని గొల్లపడుచులు పెరుగు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి. ఆ ధ్వని, ప్రతిధ్వనుల బట్టి పెరుగుకుండలు, దిక్కులు కలహించుచున్నవా? అన్నట్లు కానవచ్చుచున్నవి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.


శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము – ప్రతి పదార్థము-12వశ్లో ప్రతిపదార్థము
పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా
భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌

ప్రతిపదార్థము

పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః  = కమలములకు ప్రభువగు సూర్యునకు
                                                మిత్రములైన       తామరపూవులందున్న
                                                 తుమ్మెదల సమూహములు
నిజాంగలక్ష్మ్యా                       = తమ శరీర కాంతి చేత
కువలయస్య                                  = నల్లకలువ యొక్క
శ్రియం                               = కాంతిని
హర్తుం                               = అపహరించుటకు
భేరీనినాదమివ                     = భేరీనాదమును చేయువానివలె
తీవ్రనాదం                                     = పెద్దధ్వనిని
బిభ్రతి                                         = చేయుచున్నవి
శేషాద్రి శేఖరవిభో                             = ఓశేషాద్రి లో ఉన్న వేంకటేశ్వరా !
తవ                                           = నీకు
సుప్రభాతమ్‌                        = శుభోదయము


తా. సూర్యుని మిత్రములగు కమలములయందున్న తుమ్మెదలు, తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలు వెడలి భేరీని వాయించునట్లు ధ్వని చేయుచున్నవి. ఓ శేషాచల ప్రభూ! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము –13వశ్లో ప్రతి పదార్థము-
శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో
శ్రీ దేవతాగృహభుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 13
ప్రతి పదార్థము
శ్రీమన్                     = లక్ష్మీదేవితో కలిసి ఉండువాడా !
అభీష్టవరద                         = భక్తులు కోరిన వరములు ఇచ్చువాడా !
అఖిల లోకబంధో                   =అన్ని లోకాలకు బంధువైన వాడా !
శ్రీ శ్రీనివాస                          = పూజ్యురాలయిన లక్ష్మీదేవికి నివాస
                                                స్థలమైనవాడా !
జగదేక దయైకసింధో     = ప్రపంచము మొత్తానికి ఒక్కడివే
                                                 అయిన దయా సముద్రుడా !
శ్రీ దేవతాగృహభుజాంతర
 దివ్యమూర్తే                        =  లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలము చేత
                                                అందమయిన ఆకారము కలవాడా !
శ్రీ వేంకటాచలపతే        = సంపదతో కూడిన వేంకటాచలపతీ !
తవ                                  = నీకు
సుప్రభాతమ్‌                        = సుప్రభాతము అగుగాక !

తా. శ్రీమంతుడవైన ఓ దేవా! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకములన్నింటికిని బంధువుడవు. ఓ శ్రీనివాసా! లోకములన్నింటను నీ వొక్కడవే దయాసముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్సు కలవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.







శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము –14వశ్లో ప్రతి పదార్థము-26112016

శ్రీ స్వామి పుష్కరిణికా ౽౽ప్లవనిర్మలాంగాః
శ్రేయో౽ర్థినో హరవిరించి సనందనాద్యాః
ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 14

శ్రీ స్వామి పుష్కరిణికా ౽౽ప్లవనిర్మలాంగాః= శ్రీ స్వామి పుష్కరిణిలో
మునుగుటచే నిర్మలమైన శరీరము కలిగినవారై
శ్రేయో౽ర్థినః                        = మేలు కోరుకొనువారగుచు
 హరవిరించి సనందనాద్యాః= శివ, బ్రహ్మ, సనందనాదులు
వరవేత్రహతోత్తమాంగాః   = (ద్వారపాలకుల చేతులలోని) శ్రేష్ఠములైన  పేముబెత్తములచే కొట్టబడిన తలలు కలవారగుచు(తలలపై బెత్తపు దెబ్బలు తినుచూ)
ద్వారే వసంతి             = ద్వారమునందు వేచి ఉన్నారు.
శ్రీ వేంకటాచలపతే        = సంపదతో కూడిన వేంకటాచలపతీ !
తవ                                  = నీకు
సుప్రభాతమ్‌              = సుప్రభాతము అగుగాక !


తా. బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానముచేసి పరిశుద్ధులై తమ మేలునకై ద్వారముకడ బెత్తములవారు తలలపయి కొట్టుచున్నను లెక్కింపక కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.


శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము –15వశ్లో ప్రతి పదార్థము-27112016
శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాం త్వదీయవసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌
త్వదీయవసతేః  =నువ్వుండే నివాసముకు  
శ్రీ శేషశైల                  = శేషాచలమని
గరుడాచల       = గరుడాచలమని
వేంకటాద్రి                  = వేంకటాచలము లేక వేంకటాద్రి అని
నారాయణాద్రి    = నారాయణాద్రి అని
వృషభాద్రి                  = వృషభాద్రి అని
వృషాద్రి                    = వృషాద్రి అని
ముఖ్యాం                  = మొదలుగా గల
ఆఖ్యాం                    = పేర్లను
అనిశం           = ఎల్లప్పుడు
వదంతి           =చెప్పుచున్నారు.
శ్రీ వేంకటాచలపతే= సంపదతో కూడిన వేంకటాచలపతీ !
తవ                        = నీకు
సుప్రభాతమ్‌     = సుప్రభాతము అగుగాక !
తా. ఓ వేంకటేశ్వరా! నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము –16వశ్లో ప్రతి పదార్థము-28112016
సేవాపరాః శివసురేశ కృశానుధర్మ
రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః
బద్ధాంజలి ప్రవిలసన్నిజశీర్ష దేశాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 16
శివః                        = ఈశ్వరుడు
సురేశః            = దేవేంద్రుడు
కృశానుః                   = అగ్ని
ధర్మః                       = యమధర్మరాజు
రక్షః                        = నైరుతి
అంబునాథః      = వరుణుడు
పవమానః                 = వాయువు
ధనాధినాథాః     = కుబేరుడు మొదలగు
                              అష్టదిక్పాలకులు
బద్ధాంజలి                  =కూర్పబడిన కైమోడ్పులచే
ప్రవిలసన్నిజశీర్ష దేశాః=ప్రకాశించు శిరో భాగములు కలవారై
(తలలయందు చేతులుంచి నమస్కరిస్తున్నారని భావం)
సేవాపరాః                  = నీ సేవ చేయుటకు ఆసక్తి కలిగి ఉన్నారు.
శ్రీ వేంకటాచలపతే        = సంపదతో కూడిన వేంకటాచలపతీ !
తవ                                  = నీకు
సుప్రభాతమ్‌              = సుప్రభాతము అగుగాక !




తా. ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి వరుణుడు, వాయువు, కుబేరుడు అను అష్టదిక్పతులును శిరస్సులపయి చేతులు మోడ్చి నీ సేవకయి కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.



శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము –17వశ్లో ప్రతి పదార్థము-29112016
ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌
తే                 = నీయొక్క
ధాటీషు          = గమనములందు ( విహారములందు)
విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
= గరుడుడు, సింహము, ఆదిశేషుడు, ఐరావతము. (ఇంద్రుని వాహనము.)       ఉచ్చైశ్శ్రవము( గట్టిగా మాట్లాడినగాని వినలేని చెవిటిదయిన ఇంద్రుని గుర్రము)
అనునవి
స్వస్వాధికార              = వారి వారి అధికారము,
మహిమాదికమ్          = మహిమ మొదలయినవానిని
 అర్థయంతే                = ప్రార్థించుచున్నారు.
శ్రీ వేంకటాచలపతే        = సంపదతో కూడిన వేంకటాచలపతీ !
తవ                                  = నీకు
సుప్రభాతమ్‌              = సుప్రభాతము అగుగాక !
విశేషాలు
ఉచ్చైశ్శ్రవము   అర్థాలు

1.ఇంద్రుని గుఱ్ఱము. (ఆంధ్రశబ్దరత్నాకరము చెలమచెర్ల రంగాచార్యులు 1966)

2. నిక్కిన చెవులుగలది. (ఆంధ్రశబ్దరత్నాకరము చెలమచెర్ల రంగాచార్యులు 1966)
3. గట్టిగా మాట్లాడినగాని వినలేనిది. చెవిటిది. (ఆంధ్రశబ్దరత్నాకరము చెలమచెర్ల రంగాచార్యులు 1966)
4. ఉచ్చైః శ్రవసీ యస్య సః ఉచ్చైశ్రవాః – ఉన్నతములైన చెవులు గలది.(అమరకోశము)
5. ఉచ్చైః శ్రవః కీర్తిః యస్య – ఉన్నతమైన కీర్తి కలది (అమరకోశము)

తా. దేవా! గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీ­ు సుప్రభాతమగు గాక.
శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము –18వశ్లో ప్రతి పదార్థము-30112016
సూర్యేందు భౌమబుధవాక్పతి కావ్యసౌరి
స్వర్భాను కేతుదివి షత్సరిషత్ప్రధానాః
త్వద్దాస దాస చరమావధిదాస దాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 18
ప్రతి పదార్థము
సూర్యేందు=సూర్య+ఇందుః       =  సూర్యుడు, చంద్రుడు
భౌమః                                = అంగారకుడు
బుధః                                         = బుధుడు
వాక్పతిః                                       = గురుడు
కావ్యః                                = శుక్రుడు
సౌరిః                                          = శని
స్వర్భానుః                                    = రాహువు
కేతుః                                          = కేతువు
దివి షత్సరిషత్ప్రధానాః             = అను దేవ సభలోని
                                                ప్రధానులు( నవగ్రహములు)
త్వద్దాస                                       = నీ దాసులకు
దాస చరమావధిదాస దాసాః= దాసులలో చివరిలో ఉన్న
                                                 దాసులకు దాసులై ఉన్నారు.
శ్రీ వేంకటాచలపతే                  = సంపదతో కూడిన
                                                          వేంకటాచలపతీ !
తవ                                            = నీకు
సుప్రభాతమ్‌                        = సుప్రభాతము అగుగాక !
తాత్పర్యము
సూర్యుడు, చంద్రుడు
అంగారకుడు
బుధుడు
గురుడు
శుక్రుడు
శని
రాహువు
కేతువు
అను దేవ సభలోని ప్రధానులు( నవగ్రహములు)
నీ దాసులకు
దాసులలో చివరిలో ఉన్న దాసులకు దాసులై ఉన్నారు.
సంపదతో కూడిన వేంకటాచలపతీ !
నీకు
సుప్రభాతము అగుగాక !



తా. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నవగ్రహములును నీ దాస, దాసచరమావధి దాసులకు దాసులయి యున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.


శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము –19వశ్లో ప్రతి పదార్థము-01122016
త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగాః
కల్పాగమా౽౽కలనయా ౽౽కులతాం లభంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 19

ప్రతి పదార్థము

త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః= నీ పాదధూళితో నిండి ప్రకాశించు తలలు కలిగినవారు( నీ పాద సేవకులయిన నీ భక్తులు)
స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగాః          = స్వర్గము, మోక్షములయందు కోరికలేని                                                                            మనస్సు కలవారై
కల్పాగమాకలనయా                                  = మరొక కల్పము వచ్చునను భావన చేత
 ఆకులతాం లభంతే                         = వ్యాకులతను(దుఃఖమును) పొందుతున్నారు.
శ్రీ వేంకటాచలపతే                  = సంపదతో కూడిన      వేంకటాచలపతీ !
తవ                                            = నీకు
సుప్రభాతమ్                        = సుప్రభాతము అగుగాక !
విశేషాలు
కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర మరియు కలి యుగాలు) ఉంటాయి. (వికీపీడీయా సౌజన్యము)

ప్రస్తుతం నడుస్తున్నది శ్వేత వరాహ కల్పము.  ఈ కల్పము తర్వాత  ఈ కొండకు  ఇంత మహిమ ఉండదని చెబుతారు. అందుకే ఈ  శ్వేత వరాహ కల్పము పూర్తయిపోతుందేమో  అని ఇప్పటినుంచే భక్తులు దుఃఖాన్ని పొందుతున్నారని కవి హృదయము.

తా. ఓ స్వామీ! నీ పాదధూళిచే శిరస్సు పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు. ఈ కల్పము అంతమైపోవునేమో అనియే కలత పడుచుందురు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము –20వశ్లో ప్రతి పదార్థము-02122016
త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః
మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయన్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 20

మర్త్యాః                     = మనుష్యులు
పరమాం                            = గొప్పదైన 
స్వర్గాపవర్గ పదవీం       = స్వర్గ లోక, మోక్ష మార్గ మును
శ్రయంతః                            = పొందుచున్నవారగుచు
త్వద్గోపురాగ్రశిఖరాణి = నీదేవాలయ గోపురాగ్ర శిఖరములను
నిరీక్షమాణాః              = చూచుచున్నవారయి
మనుష్యభువనే           = మనుష్య లోకములో నివసించుటకు
మతిమ్                             = బుధ్ధిని
ఆశ్రయన్తే                            = పొందుచున్నారు.
శ్రీ వేంకటాచలపతే        = సంపదతో కూడిన      వేంకటాచలపతీ !
తవ                                  = నీకు
సుప్రభాతమ్              = సుప్రభాతము అగుగాక !


తా. స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము –21వశ్లో ప్రతి పదార్థము-03122016

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్ధే
దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే
శ్రీ మన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 21

శ్రీ భూమినాయక         = శ్రీదేవికి , భూదేవికిని నాయకుడైనవాడా!
దయాది గుణామృతాబ్ధే= దయ మొదలైన గుణములకు అమృత సముద్రము                                                        వంటివాడా !
దేవాధిదేవ                          = సర్వదేవతలను మించినవాడా !(అధిరూఢాః దేవాః యేన  .                                    బహువ్రీహి సమాసము)
జగదేక శరణ్యమూర్తే      =  ప్రపంచములో నువ్వొక్కడవే శరణ్యుడివి.
శ్రీ మన్                    = సంపదతో కూడినవాడా!
అనంత గరుడాదిభిః      = ఆదిశేషుడు, గరుడుడు, విష్వక్సేనుడు మొదలయిన వారిచేత
అర్చితాంఘ్రే                         = పూజింపబడిన పాదములు కలవాడా!
శ్రీ వేంకటాచలపతే        = సంపదతో కూడిన      వేంకటాచలపతీ !
తవ                                  = నీకు
సుప్రభాతమ్              = సుప్రభాతము అగుగాక !

తా. ఓ దేవాదిదేవా! నీవు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయ మున్నగు గుణములకు పాలసముద్రము వంటివాడవు. లోకములకన్నింటికి శరణమిచ్చువాడవు నీవొక్కడవే. అనంతుడు, గరుడుడు నీ పాదములను సేవించుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ వేంకటేశ సుప్రభాత స్తవము –22వశ్లో ప్రతి పదార్థము-04122016

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 22
ప్రతి పదార్థము

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే= ఓ పద్మనాభ!  పురుషోత్తమ! వాసుదేవ! వైకుంఠ !మాధవ! జనార్దన !చక్రపాణీ
శ్రీవత్స చిహ్న                       = శ్రీ వత్సమను పుట్టుమచ్చకలవాడా!
శరణాగత పారిజాత                 = శరణు అని వచ్చినవారికి పారిజాతమను కల్పవృక్షమువంటివాడా !
శ్రీ వేంకటాచలపతే                  = సంపదతో కూడిన      వేంకటాచలపతీ !
తవ                                  = నీకు

సుప్రభాతమ్                        = సుప్రభాతము అగుగాక ! 

No comments: